హాజరు అంతంతే..

ABN , First Publish Date - 2021-02-25T04:01:44+05:30 IST

ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం జిల్లాలో 6,7,8 తరగతుల విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధనను లాంఛనంగా ప్రారంభించారు.

హాజరు అంతంతే..

-ప్రారంభమైన ప్రాథమికోన్నత పాఠశాలలు

-జిల్లాలో మొత్తం 12,959 మంది విద్యార్థులు

-తొలిరోజు 9.80 శాతమే హాజరు 

-తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో బుధవారం జిల్లాలో 6,7,8 తరగతుల విద్యార్థులకు పాఠశాలలో విద్యాబోధనను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. 12,959 మంది విద్యార్థులకు గాను కేవలం 9.80శాతం మాత్రమే హాజరయ్యారు. తరగతుల పునః ప్రారం భంపై మంగళవారం రాత్రి వరకు జిల్లా విద్యాశాఖకు అధికారిక సమాచారం అందలేదు. దీంతో పాఠశాలలకు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సంబంధించి సమాచారం సరిగ్గా ఇవ్వలేకపోయారు. ఈ కారణంగానే తొలిరోజు తక్కువ హాజరు శాతం నమోదైందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మే 26వ తేదీ వరకు  విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించనున్నారు. విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా అనుమానాల నివృత్తితో పాటు సిలబస్‌ సులభతరంగా అర్థమయ్యే అవకాశం ఉంటుం దని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే 9,10 తరగతులకు ఫిబ్రవరి1 నుంచి ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఆన్‌లైన్‌ బోధన అంతా గందరగోళమే

కొవిడ్‌ మహమ్మారి విజృంభనతో ప్రభుత్వం ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 747 ప్రభుత్వ, స్థానిక సంస్థలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలకు చెందిన మొత్తం 33,063 మంది విద్యార్థులకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్‌ విద్య అందిస్తున్నారు. అలాగే ఈ ఆన్‌లెన్‌ తరగతుల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలు, ట్రాన్స్‌కో, కేబుల్‌ ఆపరేటర్లను సమన్వయ పరిచి విద్యాబోధన అందరికీ అందేలా ఏర్పాట్లు చేసింది. ఆరంభంలో అంతా బాగానే సాగుతోందనిపించినా నెట్‌వర్క్‌ సంబంధిత సాంకేతిక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో ఎక్కువగా ఆదివాసీ, పేద కుటుంబాలకు చెందిన విధ్యార్దులే ఉండడంతో స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో విధ్యకు దూరమయ్యారు.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం తరగతులు

కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా 6,7,8 తరగతులకు బుధవారం పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 9,10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో వారికి అనుసరించిన విధంగానే 6-8 తరగతుల విద్యార్థులను ప్రతి గదిలో ఒక బెంచికి ఇద్దరు చొప్పున కూర్చోబెట్టారు. అలాగే తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉంటేనే ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. అయితే విద్యార్థులు పాఠశాలలకు రాకపోయినా, అలాంటి వారిని కూడా పై తరగతులకు ప్రమోట్‌ చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా తరగతి గదుల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ చెబుతోంది. అలాగే  పాఠశాల ప్రాంగణాల్లో శానిటైజ్‌ చేసుకునేందుకు అవసరమైన నీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలను సిద్ధం చేస్తున్నారు. ప్రతీ విద్యార్థి విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. 

1270 మంది హాజరు

6,7,8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైనా తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం పలుచగానే కనిపించింది. జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద మొత్తం 226 పాఠశాలలకు చెందిన 12,959 మంది విద్యార్థులకు గాను తొలి రోజు కేవలం 1270 మంది మాత్రమే హాజరయ్యారు. 160 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో మొత్తం 8,257 మంది విద్యార్థులకు గాను కేవలం 732 మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం 103 ప్రైవేటు పాఠశాలలకు గాను 6,7,8 తరగతులకు సంబంధించి మొత్తం 4,702 మంది విద్యార్థులు ఉంటే తొలి రోజు కేవలం 538 మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలకు 8.87 శాతం విధ్యార్ధులు హాజరు కాగా ప్రైవేటు పాఠశాలలకు సంభందించి 11.4 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.


Updated Date - 2021-02-25T04:01:44+05:30 IST