తెల్లారేసరికి దేవాలయ ఏర్పాటుకు యత్నం

ABN , First Publish Date - 2020-05-27T09:43:27+05:30 IST

ముషీరాబాద్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం తెల్లారేసరికి దేవాలయాన్ని ఏర్పాటు

తెల్లారేసరికి దేవాలయ ఏర్పాటుకు యత్నం

ముషీరాబాద్‌ అంబేడ్కర్‌నగర్‌లో ఉద్రిక్తత


ముషీరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం తెల్లారేసరికి దేవాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పూజలు చేయడంతో కొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన వారు, వ్యతిరేకించిన వారి మధ్య గొడవ జరగడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురికి సర్దిచెప్పి స్టేషన్‌కు తరలించారు. ఆ స్థలం వద్ద గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌నగర్‌ సర్వే నంబర్‌ 182లో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. 1996లో ఆ గుడిసెవాసులకు వాంబే పథకం కింద పక్కా గృహాలు నిర్మించేందుకు 103 మందికి పట్టాలు ఇచ్చారు. అందులో 42 మందికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారు. మిగతా వారికి ఇళ్లు కట్టించకపోవడంతో గుడిసెల్లోనే నివసిస్తున్నారు. మరికొంతమంది అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల ఓ గుడిసె కూలిపోవడంతో ఆ స్థలంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. 


కొంతమంది స్థానికులు ఆ స్థలంలో చెత్తను తొలగించి నల్లపోచమ్మ, రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. బండలతో గుడికటి,్ట అందులో రెండు విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఈ విషయాన్ని గమనించిన కొంతమంది స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతరులకు చెందిన స్థలంలో దేవాలయం ఎలా కడతారని ప్రశ్నించారు. స్థానికంగా  దేవాలయం లేకపోవడం వల్లే నిర్మించామని నిర్మాణదారులు సమాధానం చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ముషీరాబాద్‌ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురికి సర్దిచెప్పారు. అయినా గొడవ సమసిపోకపోవడంతో అందరినీ స్టేషన్‌కు తరలించారు.


ఈ క్రమంలో బండలతో కట్టిన గుడిలో నుంచి విగ్రహాలను పోలీసులు తీసుకెళ్లారు. తహసీల్దార్‌ నుంచి అనుమతి తీసుకున్నాకే దేవాలయం కట్టాలని పోలీసులు వారికి చెప్పారు. అప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు, పూజలు చేయవద్దని హెచ్చరించారు. గుడి విషయమై అంబేడ్కర్‌నగర్‌ వాసులు ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  బస్తీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ... ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు దేవాలయం ఏర్పాటుకు కొందరు యత్నించారని ఆరోపించారు. గతంలో ఇక్కడ ఎలాంటి దేవాలయం లేదని తెలిపారు.

Updated Date - 2020-05-27T09:43:27+05:30 IST