మాయ ‘రోగం’

ABN , First Publish Date - 2022-01-05T08:09:42+05:30 IST

ప్రతిపక్షంలో ఉండగా ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన జగన్మోహన్‌రెడ్డి.. సీఎం అయ్యాక వారి బాధలు పట్టించుకున్న దాఖలాలే లేవు. శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల్లో ఈ వ్యాధి పీడితులు

మాయ ‘రోగం’

  • రూ.10 వేల కోట్ల కోసం పథకం..
  • ఉద్దానం కిడ్నీ బాధితుల ప్రాజెక్టుకు నీళ్లు
  • రూ.700 కోట్లతో గతంలో పనులు..
  • బిల్లులు ఆపి అటకెక్కించిన జగన్‌
  • ఇప్పుడు ప్రకాశం ఫ్లోరైడ్‌ బాధితులతో లింకు..
  • 10 వేల కోట్లివ్వాలని ప్రతిపాదన
  • ఆమోదం కోసం ఢిల్లీలో ప్రయత్నాలు..
  • ఇస్తే, రోగుల కోసం వాడతారా?
  • ఇతర అవసరాలకు మళ్లిస్తారా?..
  • ఇప్పటికే 30 వేల కోట్ల వరకు మళ్లింపు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రతిపక్షంలో ఉండగా ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన జగన్మోహన్‌రెడ్డి.. సీఎం అయ్యాక వారి బాధలు పట్టించుకున్న దాఖలాలే లేవు. శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల్లో ఈ వ్యాధి పీడితులు ఉన్నారు. ఇప్పడు వీరితోపాటు ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధితుల పేరిట కేంద్రం నుంచి సొమ్ములు రాబట్టే పథకానికి శ్రీకారం చుట్టింది. కిడ్నీ బాధితులున్న మండలాలకు సురక్షిత నీటి సరఫరా కోసం గత టీడీపీ ప్రభుత్వం రూ.700 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. వంశధార నది నుంచి నీటిని ఎత్తిపోసి ఈ మండలాలకు సరఫరా చేయడం దీని ఉద్దేశం. కేంద్ర జల జీవన్‌ మిషన్‌ కింద ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. పథకం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. జగన్‌ అధికారంలోకి వచ్చేనాటికి ఆ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం రూ.50-60 కోట్లు ఖర్చు పెట్టింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.110 కోట్ల విలువైన పనులు జరిగాయి. పైపులు కొనడం, వాటిని కొంతవరకు బిగించడం జరిగాయి. అయితే పనిచేసిన కాంట్రాక్టర్లకు జగన్‌ ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో కిడ్నీ రోగుల కోసం ఉద్దేశించిన ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయు.


ఇతర కేంద్ర పథకాల నిధులను మళ్లించినట్లుగానే.. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించిందని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి పనులను, ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టాల్సింది పోయి.. మళ్లీ అదే కిడ్నీ బాధితుల పేరుతో కేంద్రాన్ని డబ్బులు అడుగుతోంది.  ఈసారి శ్రీకాకుళం కిడ్నీ బాధితులతో.. ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లోని ఫ్లోరైడ్‌ బాధితులను కూడా కలిపేసి.. ఏకంగా రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కోరుతోంది. వీటి కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారు. రక్షిత మంచినీటి కోసం కేంద్రం రూ.10 వేల కోట్లిస్తే మంచిదే. కానీ వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రక్షిత నీటి సరఫరా కోసమే వాడుతుందా అనేదే అనుమానం. ఎందుకంటే ఈ రెండున్నరేళ్లలో కేంద్ర పథకాలకు సంబంధించిన దాదాపు రూ.30 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు మళ్లించింది. కేంద్రానికి తప్పుడు యూసీలు సమర్పించి తదుపరి వాయిదా నిధులు తెచ్చుకుంటోంది. ఈ రూ.పది వేల కోట్లను కూడా.. కిడ్నీ, ఫ్లోరైడ్‌ బాధితుల కోసం కాకుండా ఇతర అవసరాలకు మళ్లించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కిడ్నీ బాధితుల కోసం రూ.700 కోట్లతో చేపట్టిన రక్షిత తాగు నీటి సరఫరా పథకాన్ని అర్ధాంతరంగా వదిలేసింది. వారి పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టునే పట్టాలెక్కించేది. అలా కాకుండా అదే సమస్యపై కేంద్రాన్ని భారీగా నిధులు కోరడం వెనుక వాటిని సొంత అవసరాలకు మళ్లించే ఎత్తుగడ ఉందని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే కిడ్నీ, ఫ్లోరైడ్‌ బాధితులను ఆదుకుందామంటే సహకరించడం లేదని ప్రచారం చేసుకోవడానికే ఇలాంటి ప్రతిపాదన పెట్టారని అంటున్నారు.


వృథాగా జలజీవన్‌ మిషన్‌

కేంద్రం 60 శాతం ఖర్చును భరిస్తూ రాష్ట్రాల్లో సురక్షిత తాగు నీటి సరఫరా ప్రాజెక్టులను జల జీవన్‌ మిషన్‌ కింద చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల్లో 40 శాతం వ్యయం మాత్రమే రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. బహుశా దేశంలో జల జీవన్‌ మిషన్‌ను ఉపయోగించుకోని ఏ కైక రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశే అయిఉంటుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ మిషన్‌ కింద చేపట్టిన ఉద్దానం ప్రాజెక్టును ఆపేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఇంటింటికీ కుళాయి అంటూ ఈ మిషన్‌ కిందే ప్రాజెక్టు ప్రారంభించి టెండర్లు కూడా పిలిచారు. టెండర్లు దక్కించుకున్న ఒక్క కాంట్రాక్టరు కూడా పని చేయడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే జగన్‌ ప్రభుత్వం పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచడమే కారణం. పనులు చేసి బిల్లుల కోసం అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకనుకున్న కాంట్రాక్టర్లు మౌనంగా ఉండిపోయారు. దీంతో జల జీవన్‌ మిషన్‌ రాష్ట్రంలో వృథా అవుతోంది. కేంద్రం నుంచి రావలసిన 60 శాతం నిధులను కూడా  రాష్ట్రం కోల్పోతోంది. కచ్చితంగా వచ్చే వందల కోట్లు వదులుకుని.. కేంద్రం ఇస్తుందో లేదో తెలియని రూ.10 వేల కోట్లకు జగన్‌ సర్కారు టెండర్‌ పెట్టడం విచిత్రంగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

Updated Date - 2022-01-05T08:09:42+05:30 IST