టీడీపీ జడ్పీటీసీ కిడ్నాప్‌ యత్నం

ABN , First Publish Date - 2022-05-17T04:38:59+05:30 IST

ముగ్గురు దుండగులు హిరమండలం టీడీపీ జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబును కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. ‘మర్యాదగా కారు ఎక్కుతావా లేదా? ఎన్‌కౌంటర్‌ చేయాలా?’ అని తుపాకీతో బెదిరించారు. బుచ్చిబాబు కర్రపట్టుకుని తిరగబడడంతో పారిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన ఇల్లు, హోటల్‌ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

టీడీపీ జడ్పీటీసీ కిడ్నాప్‌ యత్నం
హోటల్‌లో మాస్క్‌ ధరించి జడ్పీటీసీతో మాట్లాడుతున్న గుర్తు తెలియని వ్యక్తి

కారులో వచ్చిన ముగ్గురు దుండగులు
తుపాకీ చూపించి చంపుతామని బెదిరింపు
సీసీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు
హిరమండలం, మే 16:
ముగ్గురు దుండగులు హిరమండలం టీడీపీ జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబును కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. ‘మర్యాదగా కారు ఎక్కుతావా లేదా? ఎన్‌కౌంటర్‌ చేయాలా?’ అని తుపాకీతో బెదిరించారు. బుచ్చిబాబు కర్రపట్టుకుని తిరగబడడంతో పారిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన ఇల్లు, హోటల్‌ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, జడ్పీటీసీ వివరాల మేరకు.. బుచ్చిబాబుకు బ్యారేజీ సెంటర్‌లో హోటల్‌ ఉంది. ఆదివారం రాత్రి 10.10 గంటలకు హోటల్‌ నిర్వహణ ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఇంటి బయట వాహనం పార్కు చేస్తుండగా ఇద్దరు దుండగులు వచ్చి పోలీసు డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చామని, నీతో మాట్లాడాలని అన్నారు. సరే ఇంట్లోకి రండి మాట్లాడుకుందామని జడ్పీటీసీ చెప్పడంతో ఇంట్లో కాదు కారులోకి రమ్మంటూ దుండగులు.. బుచ్చిబాబు చేయిపట్టుకుని తీసుకుని వెళ్లారు. కారులోకి తోసి కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారు. ‘మీరెక్కడి పోలీసులు.. ఏదైనా విషయం ఉంటే ఇంట్లోకి రండి మాట్లాడదాం’ అంటూ బుచ్చిబాబు వారి నుంచి విడిపించుకుని ఇంటి గేటుకు వరకు వచ్చారు. ఆయన వెంటే ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి ‘మర్యాదగా కారు ఎక్కుతావా.. లేదా? నిన్ను ఎన్‌కౌంటర్‌ చేయాలా’ అంటూ తుపాకీతో బెదిరించారు. వెంటనే బుచ్చిబాబు గేటు వద్ద ఉన్న కర్ర పట్టుకుని ఆ వ్యక్తిని ప్రతిఘటించారు. ఇది గమనించిన కారులోని వ్యక్తి.. బయట ఉన్న వ్యక్తిని ఎక్కించుకుని అతివేగంగా శ్రీకాకుళం వెపు వెళ్లారు. ఆ సమయంలో కారులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. బుచ్చిబాబు వెంటనే స్థానిక ఎస్‌ఐ మధుసూదనరావుకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కొన్ని రోజులుగా రెక్కీ
అగంతకులు వెళ్లిపోయాక కారు పార్కు చేసిన ప్రదేశాన్ని పరిశీలించగా ఆమ్లెట్‌ తిని కింద పడేసిన పార్సిల్‌ కవర్‌  దొరికింది. అది తన హోటల్‌లో కొనుగోలు చేసిందని బుచ్చిబాబు గుర్తు పట్టారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఒక వ్యక్తి మాస్కు పెట్టుకుని వచ్చిన వ్యక్తి జడ్పీటీసీ మీరేనా? అంటూ కొన్ని వివరాలు ఆడిగారని బుచ్చిబాబు ఎస్‌ఐకి చెప్పారు. వెంటనే హోటల్‌లోని సీసీ పుటేజీని ఎస్‌ఐ పరిశీలించారు. 9 గంటలకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు కనిపించింది. హోటల్‌ లోపలకి వచ్చే ముందు, బయట కూడా మాస్కు ధరించాడు. జడ్పీటీసీ ఇంటి ముందు కూడా పావుగంటకు పైగా దుండగులు రెక్కీ నిర్వహించారు. కారు రిపేరు చేస్తున్నట్లు నటించారు. నాలుగు రోజుల కిందట ఇదే వ్యక్తులు తన వద్దకు వచ్చి వివరాలు అడిగారని బుచ్చిబాబు చెప్పారు. అయితే తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు. పోలీసులు శ్రీకాకుళం వెళ్లే దారిలో సీసీ పుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పలు చోట్ల కారు అతివేగంగా వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-05-17T04:38:59+05:30 IST