ప్రగతి నిధులు పక్కదారి!

ABN , First Publish Date - 2020-08-08T05:25:55+05:30 IST

పట్టణప్రగతిలో భాగంగా వార్డుల వారీగా పారిశుధ్య పనుల పేరిట నామమాత్రంగా చేపట్టిన పనుల బిల్లులు రాబట్టేందుకు అటు పాలకవర్గం, ఇటు

ప్రగతి నిధులు పక్కదారి!

పనులు చేయకుండానే బిల్లులు రాబట్టే యత్నం

ఫైళ్లపై సంతకాలు చేయలేమని తిప్పి పంపుతున్న అధికారులు


తాండూరు : పట్టణప్రగతిలో భాగంగా వార్డుల వారీగా పారిశుధ్య  పనుల పేరిట నామమాత్రంగా చేపట్టిన పనుల బిల్లులు రాబట్టేందుకు అటు పాలకవర్గం, ఇటు అధికారులు అనేక తంటాలు పడుతున్నారు. జీవో-97ను సానుకూలంగా చూపించి ఫైళ్లపై సంతకాలు చేయాలని శానిటేషన్‌, అకౌంట్స్‌ సెక్షన్లలో ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే శానిటేషన్‌విభాగంలో ఉన్న ఒక్క ఇన్‌చార్జి అధికారి ఉద్యోగాన్ని వదిలి వెళ్లారు. ఇన్‌చార్జిగా నియమితులైన మరో అధికారిపై కూడా తన హయాంలో పనులు చేపట్టకున్నా.. వార్డులో మినీట్యాంకుల క్లీనింగ్‌, మొక్కలునాటడం, బ్లీచింగ్‌ చల్లడం, కాలువలు శుభ్రం చేసినట్లు ఫైలుపై సంతకాలు చేయాలని ఒత్తిడి తేగా, అప్పటి ఫైళ్లు తిప్పి పంపినట్లు సమాచారం. కొన్ని వార్డుల్లో శానిటరీ సిబ్బందితో పనులు చేయించి ప్రైవేటు సిబ్బందితో చేయించినట్లు  బిల్లు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవో97 ప్రకారం పరిపాలన ఆమోదం లేదా కౌన్సిల్‌ అప్రూవల్‌ చేసి రోస్టర్‌ పద్దతిపై కాంట్రాక్టర్‌కు పని అప్పగించాలి.


ఇంజనీరింగ్‌ విభాగం ఎంబీ రికార్డు, శానిటేషన్‌సెక్షన్‌ పరిశీలన అనంతరం పరిపాలన ఆమోదంతోనే పనులు చేపట్టాలి. పట్టణంలో జీవో-142 ప్రకారం అత్యవసరం మేరకు రూ.50వేలు వ్యయం చేసుకోవచ్చు. ఈజీవోలు కాదని వార్డుకు రూ.60వేలు వ్యయం  చేసి డబ్బులు డ్రాచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వార్డుల వారీగా పని జరిగిందా? లేదా? జరిగితే ఏ మేరకు జరిగింది. పనులను పర్యవేక్షించారా? అనే విషయమై రికార్డు లేకుండా వార్డుకు రూ.60వేల పని జరిగిందని ఫైల్‌ తయారు చేసి  వాటిని సెక్షన్ల వారీగా సంతకాలు తీసుకుని ఫైల్‌ అప్రూవల్‌ చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి.  ఇదిలా ఉండగా సంతకాల కోసం పంపిన ఫైల్‌ను తిప్పి పంపిన ఓ సెక్షన్‌ అధికారిని సరెండర్‌ చేసేందుకు మున్సిపల్‌ ఉన్నతాధికారి ఒకరు కౌన్సిలర్ల ద్వారా సంతకాల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై తాండూరు  మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా, నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయని తెలిపారు. జీవో-97 ప్రకారమే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తామని కమిషనర్‌ వివరించారు.

Updated Date - 2020-08-08T05:25:55+05:30 IST