Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘శ్రీకాకుళసాహితి’ వెన్నుదన్ను

twitter-iconwatsapp-iconfb-icon
శ్రీకాకుళసాహితి వెన్నుదన్ను

తనువూ, మనసూ వృక్ష శాస్త్రం చుట్టూ కేంద్రీకరించిన అరుదైన అధ్యాపకుడు రామారావునాయుడు. మూడున్నర దశాబ్దాలు శ్రీకాకుళసాహితిని దిగ్విజయంగా నడిపించటంలో ఆయన పాత్ర కీలకమయినది. 


బలిజిరెడ్డి వెంకట అచ్యుత రామారావునాయుడు గారే సాహిత్యలోకం పిలుచుకునే బి. వి. ఏ. రామారావునాయుడు. పెద్దలు పెట్టిన పూర్తి పేరుని సంక్షిప్తీకరించుకున్నట్టే, రామారావునాయుడుగారు వృత్తీ, ప్రవృత్తుల్లో నిర్వహించిన అనేకానేక పాత్రలను కూడా సమాజం ముఖ్యంగా సాహిత్య సమాజం సంక్షిప్తీకరించుకుంది. గుర్తించాల్సినంత విపులంగా నాయుడుగారి పాత్రలను గుర్తించలేదు. కళింగనేలకు చెందినందున, బహుజన సామాజికుడైనందున నోచుకోవలసినంత గుర్తింపుకు నోచుకోలేదు. రామారావునాయుడి వ్యక్తిత్వం కూడా ఇందుకు మరో కారణం. ఆయనెన్నడూ గుర్తింపుకోసం అర్రులు చాచలేదు. తనకు నచ్చిన, తనకు తెల్సిన కార్యక్రమాలను చేయటమే తప్పా, వాటినెవరు గుర్తించారన్నదాయన యేనాడూ లెక్కలోకి తీసుకోలేదు. మౌనంగా తన కర్తవ్యాన్ని నిర్వహించేవారు. వృక్షశాస్త్ర అధ్యాపకులైన నాయుడుగారు వృక్షానికే మౌనం నేర్పినట్టు జీవించారు. ‘సైలెంట్‌ బాంబ్‌’ అని నాయుడుగార్ని ప్రముఖకవి సుంకిరెడ్డి నారాయణరెడ్డిగారు సరిగ్గానే వ్యాఖ్యానించేరు. 


దాదాపు నాలుగుదశాబ్దాల కింద వృత్తిరీత్యా శ్రీకాకుళం చేరిన రామారావునాయుడుగారు వృత్తీ, ప్రవృత్తుల్లో తన శక్తియుక్తుల్ని సమర్పించి, తనదైన ముద్రను వేసి తన 76వ యేట ఫిబ్రవరి రెండవతేదీన ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోయేరు. వృత్తికి చెందిన రంగంలో ఆయన కేవలం వృక్షశాస్త్ర అధ్యాపకత్వంతో ఆగలేదు. వృక్షశాస్త్రానికి సంబంధించిన పరిశోధన చేస్తూ, ఉద్యోగవిరమణానంతరం జానపద వైద్యంకి సంబంధించిన అంశాల్లోకి వెళ్లి, జానపదులు సేకరించే వనమూలికలను పరిశీలించి, వివిధ వనమూలికల వివరాలు సేకరించి, అవి ఆయా రోగాలను నయం చేసేందుకెలా ఉపయోగపడతాయో తెలుసుకున్నారు, లోకానికి తెలియజేసారు. జానపద వైద్యాన్ని ఆధునిక ప్రపంచానికి గ్రంధరూపంలో అందించేరు. అద్భుతమయిన ఆ గ్రంధంలోని అంశాలను తొలిసారిగా చాన్నాళ్లు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించేరు.


జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో మెడిసినల్‌ ప్లాంట్ల మీద ఉపన్యాసాలిచ్చినారు. కళింగాంధ్రలో అనేక ప్రాంతాల పర్యావరణ సమస్యలమీద వ్యాసాలు రాసినారు. రాతలు, ఉపన్యాసాలే కాదు, ఆయన దోవంట నడచి వెళ్తే సామాన్యంగా నడచి వెళ్లడు. దోవలోని మొక్క, మొలక, గడ్డీగాదం పరిశీలిస్తూ వెళ్తాడు. తనువూ, మనసూ వృక్ష శాస్త్రం చుట్టూ కేంద్రీకరించిన అరుదైన అధ్యాపకుడు రామారావునాయుడు. సాహిత్య, సాంస్కృతికరంగాల్లో రామారావునాయుడు పాత్ర శ్రీకాకుళ సాహితికి శిఖరాయమానం! బహుశా దేశంలో అత్యవసర పరిస్ధితి తొలగిన కొన్నాళ్లకు ఎన్టీయార్‌ పాలనలో రాష్ట్రంలో పాట, మాట బందయిన రోజుల్లో, విశాల ప్రజాస్వామిక వేదిక యేర్పాటు కోసం శ్రీకాకుళంలో కొందరు బుద్ధి జీవులు, రచయితలు, అభ్యుదయవాదులు పరితపించే సందర్భంలో గురిజెళ్లవారి మేడ వారికి గూడునిచ్చింది.


ఆ మేడలో అద్దెకుండేవారు రామారావునాయుడు. ఆ మేడలో అనేకానేక రోజుల సమావేశాలనంతరం యేర్పడ్డదే ‘శ్రీకాకుళసాహితి’. కవి ఛాయరాజ్‌, కధకులు ఏ. వి.రెడ్డిశాస్త్రి, చిత్రకారులు బి.ఎన్‌.స్వామి, స్వామిగారి సోదరులు బి.పి.శాస్త్రిగారు, పి.సూర్యనారాయణగారు, నేనూ, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (అపుడు శ్రీకాకుళంలో అధ్యాపకులు), ఆంగ్లసాహిత్యంలో బాగా పరిచయమున్న కనకలింగేశ్వరరావు, గార క్రిష్ణారావు వంటి అనేకుల్ని ఏకతాటిమీదకు తీసుకొచ్చి మూడున్నర దశాబ్దాలు శ్రీకాకుళసాహితిని దిగ్విజయంగా నడిపించటంలో నాయుడిగారి పాత్ర కీలకమయినది. శ్రీకాకుళసాహితిలోకి ఆ తర్వాత కొత్తతరం... పి.ఎస్‌.నాగరాజు (ప్రజాసాహితి సంపాదకులు ఇప్పుడు), కె. భానుమూర్తి (కధకులు), చింతాడ తిరుమలరావు (కవి), దాసరి రామచంద్రరావు (ఇప్పుడు కధానిలయం కార్యదర్శి), గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీశ్‌ మరికొంతమంది చేరారు.


జనసాహితి, విరసం, ప్రసారం వంటి విభిన్న సంస్ధలకు చెందినవారే అయినా శ్రీకాకుళసాహితిలో ఉమ్మడిశక్తిగా వీరంతా నిలిచేట్టు చూడడంలో నాయుడిగారి ప్రజాస్వామిక నడవడి కీలకమయినది. ఐక్యవేదికగా పనిచేయడమెలాగో శ్రీకాకుళసాహితి నిరూపించడంలో నాయుడుగారే కీలకం. జముకు సాహిత్య బులిటిన్‌ తేవటం, సభ్యుల రచనలను సంకలించటం, కళింగనేలలోని నదుల పేరుతో కధాసంకలనాలు (నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి కధాసంకలనాలు వచ్చేయి, ఇపుడు ‘బాహుదా’ తేబోతున్నాం) ప్రచురించటం, నెలనెలా సభలు నిర్వహించటం, తెలుగునేల నలుమూలలనుంచీ కాళోజీ, జ్వాలాముఖి, కేకే రంగనాథాచార్యులు, వరవరరావు, కె. శ్రీనివాస్‌, కాత్యాయని, రాచపాళెం, వాడ్రేవు చినవీరభద్రుడు వంటి అనేకుల ఉపన్యాసాలు ఏర్పాటు చేయటమే గాక జాతీయోద్యమకవి గరిమెళ్ల శతజయంతిని ఘనంగా నిర్వహించి మహీధరను రప్పించటం, ప్రజల మధ్య గరిమెళ్ల స్వగ్రామం ప్రియాగ్రహారంలో సభ జరపటం ఇప్పటికీ పచ్చిగా ఙ్ఞాపకమున్న ఘటనలు. రామారావునాయుడుగారు కధానిలయం ఏర్పాటులో కూడా ప్రధానపాత్ర వహించేరు.


కధానిలయం బిల్డింగ్‌ నిర్మాణం పూర్తిగా ఆయనే పర్యవేక్షించేరు. శ్రీకాకుళానికి కాళీపట్నం రామారావు రావడం గానీ, నివాసమేర్పరచుకోవటం గానీ, కధానిలయాన్ని శ్రీకాకుళానికి పరిచయం చేయటంలో గానీ (శ్రీకాకుళసాహితి వారు కారాను శ్రీకాకుళానికి హైజాక్‌ చేసారని కవనశర్మగారు వాపోయేరు), ఇప్పటి కధానిలయం స్థితికి గానీ కారకులైన కీలకవ్యక్తుల్లో ప్రథములు రామారావునాయుడుగారు! ఇన్ని చేసి వారు కధలు రాసేరు, కవిత్వం రాసేరు, వ్యాసాలు రాసేరు. కానీ అవన్నీ సంపుటీకరించుకోలేదు. ఇన్ని కార్యక్రమాలను తన బాధ్యతగా భావించిన నాయుడుగారు తన రచనల పట్ల అంతగా శ్రద్ధచూపలేదంటేనే ఆయన నిస్వార్ధత తెలుస్తుంది. శ్రీకాకుళసాహితి తప్పకుండా ఆయన రచనలను సంపుటీకరించి తన కృతజ్ఞతను తెలుపుకుంటుంది, ఆయనకు జోహార్లర్పిస్తున్నది.


అట్టాడ అప్పల్నాయుడు

కార్యదర్శి, శ్రీకాకుళసాహితి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.