దర్జాగా దాష్టీకం

ABN , First Publish Date - 2021-10-20T08:18:42+05:30 IST

ఓ వైపు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం.. మరోవైపు ఏపీ స్పెషల్‌ పోలీస్‌ ఆరో బెటాలియన్‌.. మధ్యలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ఇంతకు మించిన రక్షణ ఎక్కడా లేదనుకుంటే పొరపాటే. పట్టపగలే భారీగా వైసీపీ శ్రేణులు దర్జాగా కార్లలో వచ్చి..

దర్జాగా దాష్టీకం

  • డీజీపీ ఆఫీస్‌ పక్కనే విధ్వంసం 

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఓ వైపు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం.. మరోవైపు ఏపీ స్పెషల్‌ పోలీస్‌ ఆరో బెటాలియన్‌.. మధ్యలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉంది. ఇంతకు మించిన రక్షణ ఎక్కడా లేదనుకుంటే పొరపాటే. పట్టపగలే భారీగా వైసీపీ శ్రేణులు దర్జాగా కార్లలో వచ్చి.. కర్రలు, ఇనుప రాడ్లు చేత పట్టుకుని టీడీపీ కార్యాలయంపై దాడుల కు దిగాయి. బయట ఉన్న ఫ్లెక్సీలు చింపేసి, గేట్లు విరగ్గొట్టారు. కాంపౌండ్‌లో ఉన్న కార్లు,  ఇతర వాహనాల  అద్దాలు పగుల గొట్టి, డోర్లు ధ్వంసం చేశారు. కార్యాలయంలో చిక్కినవారిని చితక్కొట్టి వీరంగం సృష్టించారు. తమ నాయకుడిపై విమర్శలు ఘాటుగా చేస్తే సమాధానం ఎలా ఉంటుందో కళ్లకు కట్టారు. మీడియా ప్రతినిధులను సైతం వదలకుండా ఇష్టానుసారం రెచ్చిపోయారు. కానీ కూతవేటు దూరంలో ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి కానీ, పక్కనే ఉన్న పోలీస్‌ బెటాలియన్‌ నుంచి కానీ పోలీసులు రాక పోవడమే వింత. దాడులకు వచ్చిన వారు తమకు తాముగా తిరిగి వెళ్లే వరకూ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఏపీ పోలీసులంటే అధికార పార్టీ శ్రేణులకు ఎంత అలుసో.. విధ్వంసం వీడియోలను టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమై ఉంటుంది. విశాఖపట్నం, తిరుపతి, హిందూపురం, విజయవాడ, మంగళగిరి ఎక్కడ బడితే అక్కడ టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపైకి వైసీపీ శ్రేణులు చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టించాయి. 


నెలక్రితం చంద్రబాబు ఇంటిపై దాడి 

దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నివాసంపై సరిగ్గా నెల రోజుల(సెప్టెంబరు 17) క్రితం వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ భారీ కాన్వాయ్‌తో వెళ్లి దాడికి దిగారు. టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గుంటూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు ఇంటిపైకి వెళ్తామంటూ ముందు రోజే జోగి రమేశ్‌ సోషల్‌ మీడియా ద్వారా హెచ్చరించినా పోలీసులు మాత్రం అడ్డుకోలేదు. ఘటన జరిగిన తర్వాత అయినా బలమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారా? అంటే.. ఎమ్మెల్యే కారు డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించి టీడీపీ శ్రేణులు, నేతలపైనే కేసులు పెట్టారు.   


నాడు అలా.. నేడు ఇలా

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబును కాల్చి చంపాలని అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి తన అనుచరులతో వైసీపీ కార్యాలయాలపైకి బయలు దేరారు. కానీ అనంతపురం పోలీసులు అప్పట్లో ఆయన్ను అదుపు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రానికి తాడిపత్రి 50  కిలో మీటర్ల దూరంలో ఉన్నా ముందు జాగ్రత్తగా పోలీసులు చర్యలు చేపట్టారు.    


చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు: డీజీపీ 

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న డీజీపీ కార్యాల యం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు సంయమనం పాటించాలని, చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దని కోరింది.

Updated Date - 2021-10-20T08:18:42+05:30 IST