ఏకకాలంలో... వ్యూహాత్మకంగా!

ABN , First Publish Date - 2021-10-20T08:30:12+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై మంగళవారం ఏకకాలంలో వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. ఈ దాడులన్నీ సాయంత్రం 5 గంటలకు అటూఇటూగానే జరిగాయని, ..

ఏకకాలంలో... వ్యూహాత్మకంగా!

  • రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు
  • ఆ పార్టీ నాయకుల ఇళ్లపైనా వైసీపీ శ్రేణుల గురి 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై మంగళవారం ఏకకాలంలో వైసీపీ శ్రేణులు దాడులకు యత్నించాయి. ఈ దాడులన్నీ సాయంత్రం 5 గంటలకు అటూఇటూగానే జరిగాయని, వైసీపీ వ్యూహాత్మకంగా పథకం వేసిందనడానికి ఇదే సాక్ష్యమని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 


రేణిగుంటలో వైసీపీ వీరంగం

చిత్తూరు జిల్లా రేణిగుంటలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పెరిగిన విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టేందుకు టీడీపీ శ్రేణులు మంగళవారం రేణిగుంటకు చేరుకున్నాయి. ఈ ర్యాలీవైపు వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. టీడీపీ శ్రేణులు రక్షణ కోసం పక్కనే ఉన్న డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నా వదలకుండా వెంబడించారు. అయితే తరుముకుంటూ వస్తున్నవారిని పోలీసులు నిలువరించ లేకపోయారు. వైసీపీ వర్గీయులు కాళ్లకు వేసుకున్న చెప్పులను విసిరికొట్టారు. రాళ్లు రువ్వారు. ఇళ్లలోకి దూరి చీపుర్లు చేతబట్టుకుని టీడీపీ శ్రేణులను వెంబడించారు. ఈ ఘటనలో సుధీర్‌రెడ్డికి వెన్నెముక దగ్గర గాయమైనట్టు వైద్యులు గుర్తించినట్టు తెలుస్తోంది.  


ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు ముట్టడి 

అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించాయి. ఆ పార్టీకి కొందరు నాయకులు, కార్యకర్తలు చౌడేశ్వరీ కాలనీలోని ఎమ్మెల్యే ఇంటిని మంగళవారం సాయంత్రం ముట్టడించారు. గేటుకు తాళాలు వేసి ఉండటంతో వాటిని తెరిచేందుకు ప్రయత్నించి ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను స్టేషన్‌కు తరలించారు. వైసీపీ దాడి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకోవడంతో కాసేపు ఉద్రికత్తత నెలకొంది. 


కడపలో టీడీపీ నేతల ఇళ్ల ముట్టడి 

కడప, ప్రొద్దుటూరులోని టీడీపీ నేతల ఇళ్లను వైసీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున కోఆపరేటివ్‌ కాలనీలో ఉన్న అమీర్‌బాబు ఇంటిని ముట్టడించి, నినాదాలు చేశారు. కడప టీడీపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు వర్గీయులు టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం వైపు భారీగా తరలివచ్చారు. ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. దాదాపు గంటసేపు వాదోపవాదాల అనంతరం పోలీసులు వారికి సర్దిచెప్పి వెనక్కు పంపేశారు. కాగడడా, నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వైసీపీ నేతలందరినీ పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడినుంచి తరలించారు.


విశాఖలో రెండున్నర గంటల పాటు ఉద్రిక్తత

విశాఖలోని టీడీపీ జిల్లా కార్యాలయంపై మంగళవారం సాయంత్రం వైసీపీకి చెందిన మహిళలు దాడికి యత్నించారు. ఆ సమయంలో సిబ్బంది నలుగురికి మించి లేకపోవడంతో కార్యాలయం గేటు తోసుకుంటూ లోపలకు ప్రవేశించారు. కొందరు మహిళలు చెప్పులతో ఆవరణలో ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహం పైకి ఎక్కేందుకు యత్నించారు. వెనక్కి వెళ్లిపోవాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హితవు పలికినా మహిళలు ఆగకుండా కార్యాలయం వైపు దూసుకువెళ్లారు.


అవంతి సార్‌.. మీతో మాట్లాడతారంట! 

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ మహిళలు దాడికి పాల్పడిన సమయంలో అందులో ఒకరికి స్వయంగా రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఫోన్‌ చేసి ఆరా తీయడం కలకలం రేపింది. ఘటనా స్థలంలో ఉన్న వైసీపీ మహిళా నేత ఒకరికి మంత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ఆమె లిఫ్ట్‌ చేసి మాట్లాడిన తర్వాత.. ఫోన్‌ను అక్కడే ఉన్న ఓ సీఐకు ఇవ్వడానికి యత్నించారు. కేకలు, అరుపుల మధ్య ఏమీ వినబడడం లేదని, ఫోన్‌ చేసింది ఎవరని సీఐ చేతులతో సైగ చేశారు. దీంతో ఆ మహిళ.. ‘మంత్రి అవంతి సార్‌.. మీతో మాట్లాడతారంట’ అంటూ మరోమారు ఫోన్‌ ఇవ్వడానికి యత్నించారు. అయితే ఫోన్‌ తీసుకునేందుకు ఆ సీఐ అయిష్టత వ్యక్తం చేయడంతో ఆమె అక్కడ నుంచి కొద్దిదూరం వెళ్లి ఏదో మాట్లాడారు. దీంతో ఇప్పుడు మంత్రి పేరెందుకు చెప్పావు అంటూ మిగిలిన మహిళలు ఆమెను మందలించారు.

Updated Date - 2021-10-20T08:30:12+05:30 IST