ఇసుక అక్రమాలపై దాడులు

ABN , First Publish Date - 2020-06-01T11:22:40+05:30 IST

ఇసుక అక్రమాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నేరడి బ్యారేజ్‌ సమీపంలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

ఇసుక అక్రమాలపై దాడులు

నేరడి బ్యారేజ్‌ వద్ద 19 లారీలు సీజ్‌


భామిని, మే 31 : ఇసుక అక్రమాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నేరడి బ్యారేజ్‌ సమీపంలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నట్టు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి  భామిని తహసీల్దార్‌ ఎస్‌.నర్సింహామూర్తి, కొత్తూరు సీఐ ఎం.చంద్రశేఖర్‌రావు, బత్తిలి ఎస్‌ఐ మహమ్మద్‌ అజాద్‌ అహ్మద్‌లు ఆకస్మికంగా దాడులు చేశారు. నేరడి బ్యారేజ్‌ వద్ద లారీలు అధిక సంఖ్యలో ఉండడాన్ని గుర్తించారు. అధికారులు దాడులు చేస్తున్నారని తెలుసుకున్న అక్రమార్కులు.. క్వారీ నుంచి ప్రొక్లయినర్‌లతో సహా హుటాహుటిన కొన్ని ఇసుక లారీలను ఒడిశా వైపు తరలించారు. దాడుల్లో 19 ఖాళీ లారీలను సీజ్‌ చేశామని ఎస్‌ఐ మహమ్మద్‌ అజాద్‌ అహ్మద్‌ తెలిపారు. వీటిని తహసీల్దార్‌కు అప్పగించామన్నారు. లారీ యజమానులపై కేసులు నమోదు చేసేలా చర్యలు చేపడతామని తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


అధికారుల ఆరా

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇసుక అక్రమ తవ్వకాలు హద్దు మీరుతున్నాయి. లాక్‌డౌన్‌ వేళ అధికారులు కళ్లుగప్పి.. అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. దీనిపై ‘సరిహద్దుల్లో ఇసుకాసురులు’ అనే శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. ఇసుక స్థావరాలపై దాడులు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్నవారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అధికారులు దాడులు చేసే సమయంలో ఒడిశా నుంచి అనుమతులు ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతం నుంచి రవాణాకు అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వంశధార నది సరిహద్దు భాగంలో ఒడిశా ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందంటూ తిరిగి ప్రశ్నించగా.. కాంట్రాక్టర్ల నుంచి సమాధానం కరువవుతోంది. వంశధార నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. 

Updated Date - 2020-06-01T11:22:40+05:30 IST