వైద్యులపై దాడులు అమానుషం

ABN , First Publish Date - 2021-06-19T05:55:03+05:30 IST

ప్రాణాలను నిలబెట్టే డాక్టర్లపై దాడులు అమానుషమని ఐఎంఏ విశాఖపట్నం అధ్యక్షురాలు డాక్టర్‌ పీఏ రమణి అన్నారు. ‘రక్షకులను రక్షించండి, డాక్టర్లను రక్షించండి’ అంటూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి వైద్యులు నిరసన తెలియజేశారు.

వైద్యులపై దాడులు అమానుషం
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులు

‘రక్షకులను రక్షించండి’ పేరుతో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన

సిరిపురం, జూన్‌ 18: ప్రాణాలను నిలబెట్టే డాక్టర్లపై దాడులు అమానుషమని ఐఎంఏ విశాఖపట్నం అధ్యక్షురాలు డాక్టర్‌ పీఏ రమణి అన్నారు. ‘రక్షకులను రక్షించండి, డాక్టర్లను రక్షించండి’ అంటూ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి వైద్యులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో డాక్టర్లు కేవలం ఉద్యోగులు మాత్రమేనన్నారు. ప్రజలు ఒక్కోసారి డాక్టర్లపై దాడులకు దిగుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి, కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న వారిపట్ల దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు.  ఇలా దాడులకు పాల్పడేవారిపై నాన్‌ బెయిల్‌బుల్‌ క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా సుమారు 800 మంది వైద్యులు  ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను రక్షణ కేంద్రాలుగా ప్రకటించి పోలీసులతో రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎం.వి.శేఖర్‌, ఉపాధ్యక్షుడు కె.ఫణీంద్ర పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి ప్రజారోగ్యవేదిక, మెడికల్‌ రిప్రజంటేటివ్స్‌ యూనియన్‌ల తరఫున టి.కామేశ్వరరావు, కేవీపీ చంద్రమౌళి, సంతోష్‌ తదితరులు మద్దతు ప్రకటించారు. 

  

Updated Date - 2021-06-19T05:55:03+05:30 IST