నకిలీ విత్తనాలపై ఉత్తుత్తి దాడులు!

ABN , First Publish Date - 2022-05-25T07:50:33+05:30 IST

నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వ్యవసాయ శాఖ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.

నకిలీ విత్తనాలపై ఉత్తుత్తి దాడులు!

  • దందా నియంత్రణలో వ్యవసాయ శాఖ విఫలం
  • 3 రోజుల స్పెషల్‌డ్రైవ్‌లో ఒక్క కేసే నమోదు!
  • కొండను తవ్వి ఎలుకను పట్టిన టాస్క్‌ఫోర్స్‌
  • 500 జరిమానా విధించి వదిలేస్తున్న వైనం
  • ఐదేళ్లలో 75 లైసెన్సులు రద్దు.. రైతులకు నష్టం


హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలను నియంత్రించడంపై వ్యవసాయ శాఖ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. అన్నదాతల పుట్టి ముంచుతున్న నకిలీలపై ఉక్కుపాదం మోపడం లేదు. టాస్క్‌ఫోర్స్‌ దాడులు, అధికారుల నిరంతర తనిఖీలతో నకిలీ విత్తన డంపులను ధ్వంసం చేయాల్సి ఉండగా.. వ్యవసాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఉత్తుత్తి దాడులు.. మొక్కుబడి కేసులతో సరిపెడుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. కళ్లముందు టన్నుల కొద్దీ నకిలీ విత్తనాలు  కనిపిస్తున్నా వ్యవసాయశాఖ చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రస్థాయిలో 9 టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి ఈ నెల 13, 14, 15 తేదీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ మినహా పాత జిల్లాల ప్రాతిపదికన టాస్క్‌ఫోర్స్‌ బృందాలను పంపించారు. దాడులకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ వ్యవహరించారు. కేవలం మంచిర్యాల జిల్లాలో ఒకే ఒక్క కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు ఒక్క గింజ కూడా లేవన్నట్లుగా.. 9 టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఒట్టి చేతులతో హైదరాబాద్‌కు తిరిగొచ్చాయి. ఈ వ్యవహారంలో గూడుపుఠాణీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్పైషల్‌ డ్రైవ్‌ను సీరియ్‌సగా తీసుకోవద్దని, నామమాత్రంగా తనిఖీలు చేసి రావాలని ఓ ఉన్నతాధికారి నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 


ఈ వ్యవహారంలో సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ హస్తం ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. నకిలీ విత్తన కంపెనీలు, డీలర్లు, విక్రయదారులతో కొందరు అధికారులు కుమ్మక్కై వారిపై ఈగ వాలకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ కమిషనరేట్‌లో ఒక టార్గెట్‌ డిసైడ్‌ చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేయడం, అవి వీగిపోవడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో పత్తి, మిర్చి, సోయాబీన్‌ విత్తనాలు ఎక్కువగా నకిలీవి ఉత్పత్తి అవుతున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా నకిలీ విత్తనాలు తెలంగాణకు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, మల్కాజిగిరి ప్రాంతాల్లో విత్తన డంపులు ఎక్కువగా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా నకిలీ పత్తివిత్తన దందాకు అడ్డాగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ మిర్చి విత్తనాల బెడద ఎక్కువగా ఉంది. ఇవి గుంటూరు నుంచి దిగుమతి అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా పెద్ద ఎత్తున సాగుతోంది. టాస్క్‌ఫోర్సు దాడులు, స్పెషల్‌ డ్రైవ్‌లు, జిల్లా, డివిజన్‌, మండల స్థాయి వ్యవసాయాధికారులు, పోలీసులు, సీడ్‌ సర్టిఫికేషన్‌ అధికారుల తనిఖీలు.. నకిలీ విత్తనాలను నియంత్రించలేకపోతున్నాయి. 


పీడీ యాక్టు కేసులు.. తుస్‌!

నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసినా, విక్రయించినా క్షమించేది లేదని, పీడీ యాక్టులు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇన్ని వేల టన్నుల నకిలీ విత్తనాలు బయటపడుతున్నా, రహస్య ప్రదేశాల్లో డంపులు ఉన్నా.. ఏడాదికి 25 వేల క్వింటాళ్లకు మించి పట్టుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. అందులో సీజ్‌ చేసే సీడ్‌ 10 వేల క్వింటాళ్లు కూడా ఉండడం లేదు. రాష్ట్రంలో పీడీ యాక్టు కేసులు ఐదేళ్లలో 23 నమోదయ్యాయి. కానీ, ఈ కేసులేవీ నిలవలేదు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఓడిపోయింది. ఉదాహరణకు.. ఖమ్మంలో 3 నకిలీ మిర్చి విత్తన కేసులు, బెల్లంపల్లిలో 3 నకిలీ పత్తి విత్తన కేసులు, మేడ్చల్‌లో 5 పీడీ కేసులు నమోదు చేస్తే.. ఏ ఒక్క కేసులో కూడా శిక్ష లేదా జరిమానా లేదా కంపెనీలను సీజ్‌ చేయడం వంటివేమీ జరగలేదు. ఇక విత్తన చట్టం-1955, విత్తన నియంత్రణ ఆర్డర్‌-1986 ప్రకారం నమోదు చేసే కేసుల్లో కూడా గరిష్ఠంగా రూ.500 మించి జరిమానా విఽధించే పరిస్థితి లేదు. పీడీ యాక్టు కేసులను సైతం రూ.500 జరిమానా విధించి కొట్టిపడేశారు. లైసెన్సుల రద్దు కూడా కేవలం 21 రోజులే కావడం శోచనీయం. 22వ రోజు నుంచి యథాతథంగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. 


50 వేల కేసుల్లో.. 75 లైసెన్సులు రద్దు!

గత ఐదేళ్లలో ఏడాదికి సగటున 10 వేల చొప్పున 50 వేల కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌ టార్గెట్‌ విధించింది. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ బృందాలు, జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులంతా కలిసి 48 వేల కేసులు నమోదు చేశారు. ఇందులో జర్మినేషన్‌ శాతం తక్కువగా (సబ్‌ స్టాండర్డ్‌ సీడ్‌) ఉన్నట్లు కేవలం 1,250 కేసులు బుక్‌ చేశారు. ఈ కేసులన్నీ చార్జిషీట్‌ నమోదు వరకు వచ్చాయి. ఇదిలా ఉండగా ఐదేళ్లలో దాడుల్లో పట్టుకున్న విత్తనాల విలువ రూ.350 కోట్లు కాగా.. సీజ్‌ చేసిన విత్తనాల విలువ కేవలం రూ.75 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా, ఐదేళ్లలో సుమారు 1000 మంది ‘నకిలీ’ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 750 క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 6(ఏ) కేసులు 90 నమోదు చేశారు. ఇవి కూడా కోర్టులో నిలవకపోవడం చూస్తుంటే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు ఎంత చిత్తశుద్ధితో కేసులు పెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఐదేళ్లలో 50 వేల నకిలీ విత్తన కేసులు నమోదు చేస్తే.. కేవలం 75 మంది లైసెన్సులు మాత్రమే రద్దు చేయడం గమనార్హం.


పర్యావరణ పరిరక్షణ చట్టం నమోదు చేయరే!

పత్తిలో హెచ్‌టీ (హెర్బిసైడ్‌ టాలరెన్స్‌) కాటన్‌ సాగుపై భారతదేశంలో నిషేధం ఉంది. గ్లైఫోసెట్‌ లాంటి కలుపు మందు పిచికారీపైనా నిషేధం ఉంది. నకిలీ పత్తి విత్తనాలతోపాటు హెచ్‌టీ కాటన్‌, గ్లైఫోసెట్‌ వినియోగం రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతోంది. మానవులకు, ఇతర జీవులకు, మొక్కలకు ప్రమాదం జరిగినపుడు ‘1986- పర్యావరణ పరిరక్షణ చట్టం’ నమోదు చేయడానికి అవకాశం ఉంది. 1986 నవంబరు 19 నుంచి ఈ చట్టం అమలులో ఉంది. నిషేధిత, నకిలీ విత్తనాల ద్వారా పర్యావరణానికి నష్టం కలిగించేవారిపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని వ్యవసాయరంగ నిపుణులు డిమాండ్‌ చేస్తున్నారు. నకి‘లీలలకు’ అడ్డుకట్ట వేయాలంటే పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయడమే సరైన మార్గమని చెబుతున్నారు. అక్రమార్కులపై ఈ చట్టాన్ని ప్రయోగిస్తే కనీసం రూ.లక్ష జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధించే అవకాశాలున్నాయి. కఠినమైన చట్టాలు అమలు చేస్తేనే నకిలీ విత్తనాల ఉత్పత్తిదారులు, డీలర్లు, దళారులు, అమ్మకందారులకు కళ్లెం వేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, రాష్ట్రంలో అలాంటి కఠిన చట్టాలను అమలు చేయలేకపోతున్నారు. 

Updated Date - 2022-05-25T07:50:33+05:30 IST