రణరంగం

ABN , First Publish Date - 2022-08-13T07:03:01+05:30 IST

శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం రణరంగాన్ని తలపించింది. భూవివాదంతో దాడులకు పాల్పడ్డ ఇరువర్గాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరగా ఇరువర్గాల సంబంధీకులు పెద్దఎత్తున ఆస్పత్రికి రావడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.

రణరంగం
సాయి వర్గాన్ని అదుపు చేస్తున్న పోలీసులు

 స్థల వివాదంలో ఇరువర్గాల దాడులు

శ్రీకాళహస్తి ఆస్పత్రి వద్ద భీభత్స వాతావరణం 

పరుగులు తీసిన సిబ్బంది, రోగులు


శ్రీకాళహస్తి,ఆగస్టు 12: శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం రణరంగాన్ని తలపించింది. భూవివాదంతో దాడులకు పాల్పడ్డ ఇరువర్గాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రి అత్యవసర విభాగంలో చేరగా ఇరువర్గాల సంబంధీకులు పెద్దఎత్తున ఆస్పత్రికి రావడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.ఎవరు ఎవరిపై దాడులు చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితిలో భయాందోళనతో వైద్యసిబ్బంది, రోగులు పరుగులు తీశారు. క్షతగాత్రులకు అత్యవసర విభాగంలో తలుపులు బఽంధించి బిక్కుబిక్కుమంటూ వైద్యం చేశారు. సీఐ భాస్కర్‌నాయక్‌ కథనం మేరకు....శ్రీకాళహస్తి పట్టణ శివారు చెన్నైరోడ్డులోని సాయిబాబా గుడి సమీపంలో ఓ ప్రైవేటు స్థల విషయమై కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది.ఈ నేపథ్యంలో పట్టణంలోని వీఎంపల్లెకు చెందిన సాయి తన మిత్రుడు శశితో కలిసి శుక్రవారం సాయంత్రం ఆ స్థలం వద్దకు వచ్చాడు. ఇదే సమయంలో ఇంకో వర్గానికి చెందిన మునిరత్నం కొందరు మిత్రులతో కలిసి అక్కడికి వెళ్లాడు.ఇరువర్గాల నడుమ భూవివాదంపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మునిరత్నం వెంట ఉన్న కొందరు బీరు బాటిల్‌తో దాడి చేయడంతో సాయి,శశి గాయపడ్డారు.చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకోగా వారి వెంట ప్రత్యర్థులూ వచ్చారు.ఇదంతా తెలిసి ఇరువర్గాల సంబంధీకులు సుమారు 150 మంది ఆస్పత్రి అత్యవసర విభాగం వద్ద మొహరించారు. మళ్లీ ఆగ్రహావేశాలతో పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఒకసారిగా ఏం జరుగుతుందోనన్న భయానక వాతావరణం అత్యవసర విభాగంలో ఆవహించింది.క్షతగాత్రులు సాయి, శశి ప్రాణభయంతో గదిలో ఉండి తలుపులు బంధించారు.మునిరత్నంపై ఆస్పత్రిలోనే సాయి బంధువులు రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. ఆస్పత్రి మొత్తం రణరంగంగా మారడంతో వైద్యసిబ్బంది, రోగులు పరుగులు తీసి శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.సీఐ భాస్కర్‌నాయక్‌ పెద్దఎత్తున పోలీసు సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరువర్గాలను కట్టడిచేసే ప్రయత్నం చేశారు.  ఎవరు ఏ వర్గానికి చెందిన వారో తెలియకపోవడంతో ఇటువారు అటు.. అటువారు ఇటు వెళుతూ మళ్లీ పోలీసుల ఎదుటే దాడులకు ప్రయత్నించారు. సుమారు రెండు గంటల సేపు ఇరువర్గాలను కట్టడిచేసేందుకు పోలీసు సిబ్బంది తలమునకలయ్యారు. అప్పటికీ మునిరత్నం వర్గానికి చెందిన ఓ యువకుడు ఆటోలో కూర్చుని ఉండగా గుర్తు తెలియని యువకులు తలపై రాయితో కొట్టి గాయపరిచారు. ఉద్రిక్త వాతావరణం అదుపులోకి రాకపోవడంతో శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ అంజుయాదవ్‌, ఎస్‌ఐ సంజీవకుమార్‌, సిబ్బంది, అదే విధంగా తొట్టంబేడు ఎస్‌ఐ రాఘవేంద్ర వారి సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. స్వల్పంగా గాయపడిన మునిరత్నం వర్గీయులను పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించడంతో ఆస్పత్రిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ తరువాత కూడా మళ్లీ రెండు వర్గాల వారూ పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకుని అరుపులు, కేకలతో ఆందోళన రేకెత్తించారు. తీవ్రంగా గాయపడిన సాయికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. సాయిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు , మునిరత్నంపై దాడికి పాల్పడినట్లు ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.



Updated Date - 2022-08-13T07:03:01+05:30 IST