Abn logo
Sep 21 2021 @ 01:27AM

మసీదులో మంచి నీళ్లు పట్టుకున్నారని దాడి!

  • పాక్‌లో హిందూ కుటుంబంపై స్థానిక భూస్వాముల దాష్టీకం


ఇస్లామాబాద్‌, సెప్టెంబరు 20: పాకిస్థాన్‌లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఓ మసీదులో మంచినీళ్లు పట్టుకున్నందుకు నిరుపేద హిందూ రైతు కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన ఘటన పంజాబ్‌లోని రహిమ్యార్‌ ఖాన్‌ సిటీలో చోటుచేసుకుంది. రైతు అలం రామ్‌ భీల్‌ తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి చేనులో పత్తి తీసేందుకు వెళ్లాడు. దాహం వేయడంతో సమీపంలోని మసీదులో ఉన్న పంపు నుంచి నీళ్లు పట్టుకున్నాడు. స్థానిక భూస్వాములు మసీదు పవిత్రతను మంటగలిపారంటూ భీల్‌పై దాడి చేసినట్లు డాన్‌ పత్రిక తెలిపింది.


రామ్‌ భీల్‌ కుటుంబాన్ని బంధించి, అవుట్‌హౌ్‌సలో ఉంచారని.. మళ్లీ హింసించారని వెల్లడించింది. దాడికి పాల్పడ్డ వారు అధికార పీటీఐ పార్టీ ఎంపీ మద్దతుదారులు కావడంతో కేసు కూడా నమోదు చేయలేదని వివరించింది. భీల్‌పై దాడి విషయం తెలిసినప్పటికీ ఎంపీ ప్రాబల్యంతో తాను మిన్నకుండిపోవాల్సి వచ్చిందని పీటీఐ మైనారిటీ విభాగం దక్షిణ పంజాబ్‌ ప్రధాన కార్యదర్శి యుధిష్టర్‌ చౌహాన్‌ చెప్పినట్లు తెలిపింది. సీనియర్‌ న్యాయవాది ఫరూక్‌ రింద్‌.. బాధిత కుటుంబానికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తానని వెల్లడించారు.