టీడీపీ బీసీ సెల్‌ నేతపై దాడి

ABN , First Publish Date - 2022-10-02T05:24:45+05:30 IST

పురాతన పీర్ల చావిడిని తొలగించవద్దని అడ్డుకున్నందుకు టీడీపీ బీసీ సెల్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దన్నపై వైసీపీ మండల కన్వీనర్‌ పట్నం నాగేష్‌ దాడి చేశాడు.

టీడీపీ బీసీ సెల్‌ నేతపై దాడి
దాడిలో గాయపడిన టీడీపీ బీసీ సెల్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోయకూర పెద్దన్న

పీర్లచావిడి తొలగించొద్దన్నందుకు వాగ్వాదం..

వైసీపీ మండల కన్వీనర్‌, అనుచరుల వీరంగం

శింగనమల, అక్టోబరు 1: పురాతన పీర్ల చావిడిని తొలగించవద్దని అడ్డుకున్నందుకు టీడీపీ బీసీ సెల్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దన్నపై వైసీపీ మండల కన్వీనర్‌ పట్నం నాగేష్‌ దాడి చేశాడు. మండలంలోని చిన్న జలాలపురంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. శింగనమల మండలం వెస్ట్‌ నరసాపురం పంచాయతీ పరిధిలోని చిన్న జలాలపురం గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్‌ పట్నం నాగేష్‌ పదిరోజుల నుంచి సీసీ రోడ్డు పనులు చేయిస్తున్నాడు. ఈ క్రమంలో పీర్ల చావిడి కట్టను తొలగించి, మురుగు నీటి కాలువను ఏర్పాటు చేయించే పనులు చేపట్టారు. దీంతో గ్రామానికి చెందిన పెద్దన్న అభ్యంతరం తెలిపారు. పురాతన కట్టను తొలగించడం మంచిది కాదని అన్నాడు. ఈ విషయంలో పెద్దన్నకు, నాగే్‌షకు మఽధ్య మాటామాట పెరిగి, వాగ్వాదం జరిగింది. పెద్దన్నపై వైసీపీ మండల కన్వీనర్‌ నాగేష్‌, ఆయన అనుచరులు కట్టెలతో దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ గొడవలో వైసీపీ మండల కన్వీనర్‌ తలకూ గాయమైంది. ఇరువర్గాలు శింగనమల సీఐ వద్ద ఫిర్యాదు చేసుకున్నారు. గాయపడిన టీడీపీ, వైసీపీ నాయకులు చికిత్స నిమిత్తం అస్పత్రికి వెళ్లారు. వైసీపీ నాయకుడు పట్నం నాగేష్‌, తన బంధువులు, అనుచరులతో కలిసి కట్టెలు, రాళ్లతో తన భర్తపై దాడి చేశారని పెద్దన్న భార్య మున్ని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. 


Updated Date - 2022-10-02T05:24:45+05:30 IST