రాజగోపాల్‌రెడ్డిపై వేటు!

ABN , First Publish Date - 2022-07-28T09:24:06+05:30 IST

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

రాజగోపాల్‌రెడ్డిపై వేటు!

  • రంగం సిద్ధం చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం
  • కేడర్‌కు భరోసా కల్పించేందుకు సన్నాహాలు
  • జిల్లా నాయకులతో ఠాగూర్‌ సంప్రదింపులు
  • మునుగోడులో 50వేల మందితో త్వరలో సభ
  • అధిష్ఠానానికి సమగ్ర నివేదిక అందజేత

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో మరింత నష్టం జరగకముందే ఆయనపై వేటు వేస్తే పార్టీ శ్రేణులకు బలమైన సంకేతాలు పంపినట్టుగా ఉంటుందని యోచిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో మునుగోడులో పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని కాదని కోమటిరెడ్డికి టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంటే, సొంత అవసరాల కోసం పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు మునుగోడులో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. విచారణ పేరిట సోనియా, రాహుల్‌ను ఈడీ వేధిస్తోందంటూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన వేళ..


ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు సమావేశమై రాజగోపాల్‌ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. సాధ్యమైనంత మేరకు ఆయనను పార్టీలోనే కొనసాగించేందుకు ఒప్పించాలని తొలుత నిర్ణయించారు. అయితే, బీజేపీలో రాజగోపాల్‌ చేరిక ఖాయమేనంటూ స్వయంగా బండి సంజయ్‌ చేసిన ప్రకటనతో పరిణామాలు మారిపోయాయి. ఆయనపై వేటు వేసేందుకే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడేళ్లుగా మునుగోడులోని పార్టీ శ్రేణులతో రాజగోపాల్‌రెడ్డి అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఆయా ప్రాంతాల్లోని కొంత మంది అనుచరులకు మాత్రమే అంటుబాటులో ఉంటూ.. ఒక వేళ పార్టీ మారాల్సి వస్తే వెంట తీసుకువెళ్లడానికి సిద్ధం చేసుకున్నట్టు చెబుతున్నారు.


మునుగోడు కేడర్‌కు భరోసా కల్పించేలా..

దివంగత నేత పాల్వాయి గోవర్థన్‌రెడ్డి హయాం నుంచి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట టీఆర్‌ఎస్‌ ప్రలోభాలకు గురి చేసినా కాంగ్రెస్‌ కేడర్‌ చెక్కు చెదరలేదు. సుదీర్ఘకాలం పాటు మునుగోడు నుంచి ప్రాతినిథ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మరణించాక, రాజకీయ వారసురాలిగా ఆయన కూతురు శ్రవంతి పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అయితే, 2018 ఎన్నికల్లో అనూహ్యంగా రాజగోపాల్‌రెడ్డికి టికెట్‌ దక్కింది. తాజాగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు అలర్ట్‌ అయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. గతంలో రాజగోపాల్‌రెడ్డి తీరుపై అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలు చేసిన ఫిర్యాదులను మెయిల్‌ ద్వారా తెప్పించుకున్నారు. ఈడీ విచారణపై రాజగోపాల్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలతోపాటు సమగ్ర నివేదికను అధిష్ఠానానికి పంపించారు. రాజగోపాల్‌రెడ్డి తీరును ఎండగట్టేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక కేడర్‌ను ఆదేశించారు. ఇందు లో భాగంగానే.. కేడర్‌కు భరోసా కల్పించేందుకు 50వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించినట్లు నియోజకవర్గానికి చెందిన పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌ నేత మీడియాకు తెలిపారు. 

Updated Date - 2022-07-28T09:24:06+05:30 IST