Abn logo
Jul 28 2021 @ 02:31AM

దేవినేనిపై దాడి.. కార్ల అద్దాలు ధ్వంసం

కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ చూసి వస్తుండగా దాడి

కర్రలు, రాళ్లతో విరుచుకుపడిన ఎమ్మెల్యే అనుచరులు

ఉమ కారును చుట్టుముట్టిన వందల మంది

టీడీపీ శ్రేణులపై పిడిగుద్దులు.. కొందరు పోలీసులకూ గాయాలు

విషయం తెలిసి తరలివచ్చిన చుట్టుపక్కల టీడీపీ కార్యకర్తలు

తప్పించుకున్న మాజీ మంత్రి .. జి.కొండూరు ఠాణా వద్ద ఉద్రిక్తత

నోరుపారేసుకున్న ఓ నేత.. ఆయన కారుపై టీడీపీ శ్రేణుల దాడి

జాతీయ రహదారిపై ధర్నాకు రెండు పార్టీల యత్నం

పోలీసుల లాఠీచార్జి.. అయినా అదుపులోకి రాని పరిస్థితి

స్టేషన్‌ వద్ద టీడీపీ కార్యకర్తల ధర్నా.. అక్కడే వైసీపీ శ్రేణులు

కారులోనే కూర్చున్న ఉమ.. దిగితే అరెస్టు చేస్తామన్న పోలీసులు


విజయవాడ/జి.కొండూరు, జూలై 27: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా... వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగులో ఈ దాడి జరిగింది. ఆ తర్వాత జి.కొండూరు ఠాణా వద్ద రాత్రి పొద్దుపోయే దాకా ఉద్రిక్తత కొనసాగింది. 

టీడీపీ వర్గాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దేవినేని ఉమ కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్టులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఆయన బావమరిది అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉమ అక్కడ క్వారీయింగ్‌ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత జి.కొండూరు వైపు బయల్దేరారు. ఇది తెలుసుకున్న వసంత అనుచరులు వందల సంఖ్యలో గడ్డమణుగు-మునగపాడు మధ్య ఆయన కారును చుట్టుముట్టారు. ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఉమ వెంట ఉన్న కార్యకర్తలు సెల్‌ఫోన్లలో క్వారీ ఫొటోలను తీయడంతో.. వారి నుంచి ఫోన్లను లాక్కుని నేలకేసి కొట్టారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టడంతో టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీశారు. 

కొందరు కార్యకర్తలు, కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన అక్కడకు చేరుకుని మాజీ మంత్రికి రక్షణగా నిలిచారు. వారిపైనా వైసీపీ శ్రేణులు పిడిగుద్దులు కురిపించాయి. వారికి చిక్కకుండా ఉమ తప్పించుకున్నారు. గొడవ ముగిసిన అనంతరం పోలీసులు ఆయన్ను జి.కొండూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడకు వచ్చి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా గుంటుపల్లికి చెందిన వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌.. దుర్భాషలాడారు.‘నా కొ..ల్లారా.. ఉమాను కాపాడి తీసుకెళ్తారా’ అని దూషించారు. మండిపడిన టీడీపీ కార్యకర్తలు.. ఆయన కారుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక దశలో టీడీపీ,  వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపై పోటీ పోటీగా ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ శ్రేణులను వదిలేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఉమను పరామర్శించడానికి జిల్లా టీడీపీ నేతలు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని అనుమతించలేదు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు జి.కొండూరుకు చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. కారులోనే ఉమ..

పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చల్లారలేదు. టీడీపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి ధర్నా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలూ మోహరించారు. తనపై దాడిచేసినవారిని వదిలేసి తమనే నిర్బంధించడంపై ఉమ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఆయన్ను దాడి జరిగిన కారులోనే ఉంచారు.  కారు దిగి రావడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేశారు. ఆయన దిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని.. అరెస్టు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ, టీడీపీ వర్గాలు అక్కడి నుంచి వెళ్లకపోవడం.. పరిస్థితులు చేయిదాటిపోతుండడంతో నందిగామ, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, తిరువూరు, కంచికచర్ల తదితర ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఇంకోవైపు.. జిల్లాకు చెందిన కొందరు టీడీపీ అగ్రనేతలను గృహనిర్బంధంలో ఉంచారు. 

కూతవేటు దూరంలోనే ఎమ్మెల్యే..

దేవినేనిపై దాడి పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు తెలుస్తోంది. గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొనడం చూస్తే పకడ్బందీగానే ప్లాన్‌ చేశారని అవగతమవుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పైగా దాడి సమయంలో వసంత కృష్ణప్రసాద్‌ పీఏతోపాటు పీఆర్వో అక్కడే ఉన్నారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ సోదరుడు రాము, పాలడుగు దుర్గాప్రసాద్‌తో పాటు గరికపాటి రాంబాబు, కొల్లి సైదరావు, పోరంకి శ్రీనివాసరాజు, గుంజా శ్రీనివాస్‌, లంకె అంకమోహన్‌రావు తదితర వైసీపీ నేతలు కూడా దాడిలో పాలు పంచుకున్నారు. కొండపల్లిలో సమన్వయ కమిటీ సమావేశం ముగియడం మొదలు ఆయన రిజర్వ్‌ ఫారెస్టుకు వెళ్లడం, అక్కడి నుంచి తిరుగు ప్రయాణం వరకు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్లలో సమాచారం ఇచ్చుకుని అదను చూసి దాడికి తెగబడ్డారు. దాడి జరిగిన స్థలానికి కూతవేటు దూరంలోనే ఒక రహస్య ప్రదేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నట్లు సమాచారం.

రెండేళ్లుగా పరస్పర ఆరోపణలు..

ఉమ, కృష్ణప్రసాద్‌ గత రెండేళ్లుగా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే ఇటీవల కొద్దిరోజులుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దేహశుద్ధి చేస్తా.. ఇంటికి వచ్చి మరీ కొడతానంటూ బహిరంగంగానే బెదిరించారు. కొండపల్లిలో కృష్ణప్రసాద్‌, ఆయన బావమరిది అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తున్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో వారి వాహనాలను సీజ్‌ చేసినందుకు జిల్లా అటవీ శాఖ అధికారి ఒకరిని ఇక్కడి నుంచి బదిలీ చేయించారన్న ప్రచారమూ ఉంది. అక్రమ మైనింగ్‌ మరింత పెరిగిందని ఇటీవల ఆరోపణలు పెరగడంతో దానిని పరిశీలించేందుకు దేవినేని ఉమ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనపై దాడి జరిగింది. ఆయన కొండపల్లి వెళ్తున్న విషయాన్ని పోలీసులే వైసీపీ నేతలకు ఉప్పందించినట్లు టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. వాస్తవానికి కొద్దిరోజుల కింద దేవినేని గొల్లపూడి వెళ్లినప్పుడు అక్కడే దాడిచేయాలని వైసీపీ నేతలు భావించినట్లు సమాచారం. అది విఫలం కావడంతో వారం రోజులుగా ఆయన కదలికలపై నిఘా వేసి.. ఇప్పుడు దాడికి దిగినట్లు తెలిసింది.హత్యాయత్నం కేసుపెట్టాలి: పట్టాభి

ఉమపై దాడికి పాల్పడిన వైసీపీ గూండాలపై పోలీసుల తక్షణం హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం డిమాండ్‌ చేశారు. ‘ఇంత పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పోలీ్‌సస్టేషన్‌కు ఎందుకొచ్చారు? వారిని చెదరకొట్టకుండా టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠిచార్జి చేయడం హేయమైన చర్య. పదే పదే నీకు దేహశుద్ధి తప్పదు.. ఇంటికొచ్చి కొడతానని ఉమపై దాడి జరిగేలా మాట్లాడి ప్రేరేపించిన ఎమ్మెల్యే వసంతపై కేసు ఎందుకు పెట్టరు’ అని నిలదీశారు.