నిఘా వర్గాలెక్కడ?

ABN , First Publish Date - 2021-07-28T06:46:04+05:30 IST

సెంటు పట్టా ఇవ్వడంలో స్వార్థం.

నిఘా వర్గాలెక్కడ?
జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

ఉమాపై దాడి వెనుక వసంత పక్కా స్కెచ్‌

రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు 

విమర్శలను ఎదుర్కోలేకే..

ఆగ్రహంతో రగిలిన టీడీపీ కార్యకర్తలు

రణరంగంగా మారిన జి.కొండూరు 

పోలీస్‌స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తం 

పోలీసుల లాఠీఛార్జి


సెంటు పట్టా ఇవ్వడంలో స్వార్థం. పట్టా ఇచ్చిన భూమిలో గ్రావెల్‌ నింపడం కోసం చేసిన తవ్వకం వెనుక అనధికార మైనింగ్‌. రిజర్వ్‌ ఫారెస్టును కొల్లగొట్టే ప్రయత్నాలు. పెండింగ్‌లో ఉన్న సీబీఐ కేసులు.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వెనక ఉన్న అవినీతి కోణాలు ఇవి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ అంశాలపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ విమర్శలను ఎదుర్కోవడంలో విఫలమైన వసంత కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. అందుకు తగ్గట్టుగానే మంగళవారం గడ్డమణుగు - మునగపాడు రోడ్డులో వైసీపీ కార్యకర్తలు ఉమాపై దాడికి తెగబడ్డారు. ఇంత జరుగుతున్నా నిఘా వర్గాలు ఏం చేశాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 


జి.కొండూరు, జూలై 27 : సాధారణంగా వేర్వేరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తారు. ఉమాపై దాడి అప్పటికప్పుడు అనుకుని చేసింది కాదు. పక్కా ప్లాన్‌తోనే వ్యవహారాన్ని తెరవెనుక ఉండి నడిపించారు. ఉమా కొండపల్లిలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ముగించుకుని రిజర్వ్‌ ఫారెస్టులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ ఆయన వెంట వెళ్లిన కార్యకర్తలు ఫొటోలు తీశారు. ఇక్కడ జరుగుతున్న మైనింగ్‌ వెనుక ఎమ్మెల్యే, ఆయన బావమరిది హస్తం ఉందని లోకం కోడై కూస్తోంది. దీనిపైనే ఉమా ఘాటుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను ఆపాలని ఉమా పోరాటం చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకి కంటగింపుగా మారింది. ఈ క్రమంలో దాడికి స్కెచ్‌ వేశారని స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా ఒక పార్టీ నాయకుడు ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పడు ఆయన వెంట ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఉమాపై దాడి జరిగిన ప్రదేశంలో వసంత మనుషులు ఉన్నారు. వసంత పీఏ, పీఆర్వోలు అక్కడ ఎందుకు ఉన్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జి.కొండూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితి చేయిదాటి పోతుందనుకున్న పోలీసులు నందిగామ, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, తిరువూరు, కంచికచర్ల తదితర ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. భారీ బందోబస్తు మధ్య మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును రాత్రి వరకు దాడి జరిగిన కారులోనే ఉంచారు.


ప్రశ్నిస్తే చంపేస్తారా?

ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తారా అని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ అల్లరి మూకలు దాడి చేసిన కారులో సుమారు ఏడు గంటల పాటు కూర్చున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దాడి జరిగి ఇంతసేపైనా పోలీస్‌ అధికారులు రాలేదు. పూర్తిగా జగన్‌ కనుసన్నల్లో, సజ్జల నాయకత్వంలో ఈ దాడి జరిగింది. వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నాపై రాళ్లు రువ్వారు. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో లక్షల టన్నుల గ్రావెల్‌ దోపిడీ జరిగింది. గ్రావెల్‌ దోపిడీపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు. టీడీపీ కార్యకర్తలు సురక్షితంగా నన్ను పీఎస్‌కు తీసుకొచ్చారు. పీఎస్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో నాపై దాడి జరిగినా పోలీసులు రాలేదు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. డీజీపీ, విజయవాడ సీపీ ఈ ఘటనపై సమాఽధానం చెప్పాలి. నాకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?’ అని ప్రశ్నించారు.  


ఇది పిరికిపందల చర్య

దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ గూండాల దాడి పిరికిపందల చర్య. అవినీతి అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా? వైసీపీ నేతలు ప్రజా సంపదను దోచుకుంటుంటే టీడీపీ నేతలు అడ్డుకోవడం తప్పా? ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి. అధికార మదంతో వైసీపీ నేతల అవినీతి అరాచకాలు పెరిగిపోయాయి. - ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, జంపాల సీతారామయ్య, టీడీపీ నేతలు


హత్యాయత్నం కేసు నమోదు చేయాలి 

మాజీమంత్రి ఉమాపై దాడికి పాల్పడిన వైసీపీ గుండాలపై పోలీసుల తక్షణం హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. వైసీపీ మూకలపై కేసు నమోదు చేసే వరకు కదిలేది లేదు. ఇంత పెద్ద మొత్తంలో వైసీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు రావాల్సి వచ్చింది. బయట ఉండి వసంత ఎందుకు వైసీపీ శ్రేణుల్ని పోలీస్‌స్టేషన్‌కు పంపుతున్నాడు. వైసీపీ శ్రేణుల్ని చెదరకొట్టకుండా టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయమైన చర్య. ఉమాపై దాడికి ప్రేరేపించేలా పదేపదే మాట్లాడుతున్న ఎమ్మెల్యే వసంతపై చర్యలెందుకు తీసుకోరు. చట్టంపై ఉన్న గౌరవంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చాం. ఫిర్యాదు తీసుకోలేదు. స్టేషన్‌లోకీ వెళ్లనివ్వడం లేదు. తక్షణం వసంత పైనా, దాడికి పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. - కొమ్మారెడ్డి పట్టాభి, అధికార ప్రతినిధి



Updated Date - 2021-07-28T06:46:04+05:30 IST