Abn logo
Oct 12 2021 @ 23:14PM

దారికాచి గ్రామ కార్యదర్శిపై దాడి

మూడు కిలోమీటర్లువెంబడించి అడ్డగించిన దుండగులు

భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఘటన

  ఆళ్లపల్లి, అక్టోబర్‌ 12: గుర్తు తెలియని కొందరు దుండగులు దారికాచి మరీ ఓ గ్రామకార్యదర్శిపై దాడికి పాల్పడ్డారు. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం తీర్లాపూరం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. టేకులపల్లి మండలం, బర్లగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్‌ జబ్బార్‌ సోమవారం పంచాయతీలో పలు పనులు నిర్వహించి సాయంత్రం కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ఆలస్యంగా విధులు ముగించుకుని స్వగ్రామం ఆళ్లపల్లికి బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో ముందుగానే రాయిపాడు-అనంతోగు మధ్య మాడ్షల వాగు దగ్గర మాటువేసిన దుండగులు కర్రలతో కార్యదర్శిపై దాడికి ప్రయత్నించారు. దాన్ని గమనించిన కార్యదర్శి బైక్‌వేగం పెంచి ముందుకు వెళ్లిపోగా దుండగులు కార్యదర్శిని సుమారుగా మూడు కిలోమీటర్లు వెంబడించి తీర్లాపూరం సమీపంలో అడ్డుకుని కర్రలతో తల, శరీరంపై దాడి చేశారు. దాంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా వచ్చిన కొందరు ఈ దాడిని గమనించడంతో దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ ఘటనపై ఆళ్లపల్లి ఎస్‌ఐ సంతోస్‌కుమార్‌ దర్యప్తు చేస్తున్నారు.