మేఘాలయ సీఎం ఇంటిపై దాడి

ABN , First Publish Date - 2021-08-17T08:55:29+05:30 IST

హిన్నీట్రెప్‌ నేషనల్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) మాజీ నేత చెరిస్టెర్‌ఫీల్డ్‌ థాంగ్‌కియా మృతితో మేఘాలయలో ఉద్రిక్తత..

మేఘాలయ సీఎం ఇంటిపై దాడి

హెచ్‌ఎన్‌ఎల్‌సీ మాజీ నేత మృతితో నిరసనలు, హింస

షిల్లాంగ్‌, ఆగస్టు 16: హిన్నీట్రెప్‌ నేషనల్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌(హెచ్‌ఎన్‌ఎల్‌సీ) మాజీ నేత చెరిస్టెర్‌ఫీల్డ్‌ థాంగ్‌కియా మృతితో మేఘాలయలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులే చెరిస్టెర్‌ఫీల్డ్‌ను హత్య చేశారంటూ ఆయన అనుచరులు అనేక చోట్ల హింస, దుకాణాల్లో లూటీలకు పాల్పడ్డారు. సీఎం కాన్రాడ్‌ సంగ్మా నివాసంపై దుండగు లు ఆదివారం పెట్రోల్‌ బాంబులు విసిరారు. అయితే.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. హింసాత్మక ఘటనలు పెరగడంతో షిల్లాంగ్‌లో 2 రోజుల కర్ఫ్యూ విధించారు. పలుచోట్ల మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. థాంగ్‌కియూ ఈనెల 13న పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. పోలీసులు కుట్రచేసి దారుణంగా హత్య చేశారని థాంగ్‌కియూ అనుచరులు ఆరోపిస్తున్నారు. తాము థాంగ్‌కియూ ఇంటికి వెళ్తే కత్తితో దాడి చేసి పరారయ్యేందుకు యత్నించారని.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా ఆయనకు తూటాలు తగిలాయని పోలీసులు చెబుతున్నారు. ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో రాష్ట్ర హోం మంత్రి లఖ్‌మెన్‌ రింబుయ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Updated Date - 2021-08-17T08:55:29+05:30 IST