టీడీపీ వర్గీయులపై రాళ్ళ దాడి

ABN , First Publish Date - 2021-02-24T05:41:44+05:30 IST

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ దాడులకు తెగబడుతోంది.

టీడీపీ వర్గీయులపై రాళ్ళ దాడి
కృష్ణయ్యను పరామర్శిస్తున్న టీడీపీ నేతలు ఆనందబాబు, జీవీ తదితరులు

పలువురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

లక్కరాజుగార్లపాడులో ఘటన

సత్తెనపల్లి రూరల్‌, ఫిబ్రవరి 23: గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ దాడులకు తెగబడుతోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు  పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి నాలుగో విడతలో ఎన్నికలు జరగ్గా టీడీపీ మద్దతుదారు గెలుపొందింది.  లక్కరాజుగార్లపాడు సర్పంచ్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో టీడీపీ మద్దతుతో జొన్నలగడ్డ మరియమ్మ... వైసీపీ మద్దతుతో  జొన్నలగడ్డ మరియమ్మ పోటీచేశారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు జొన్నలగడ్డ మరియమ్మ 124 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ వర్గీయులు సుమారు 60 మంది  సోమవారం రాత్రి టీడీపీ అగ్రవర్ణ వర్గీయుల గృహాలపైకి వచ్చి ఇంటి ముందు ఉన్న వారితోపాటు ఇళ్ళలో ఉన్న వారిపై కూడా రాళ్ళదాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలు, ఇనుపరాడ్లు చేతబూని దాడికి పాల్పడారు. ఏం జరుగుతుందో గ్రహించేలోపే రాళ్ళు, రాడ్లతో కొట్టారు. వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీకి చెందిన గరికపాటి కృష్ణయ్య, శీలంనేని మహేష్‌, శీలంనేని లక్ష్మి, శీలంనేని విజయలక్ష్మితోపాటు పలువురికి గాయాలయ్యాయి. కృష్ణయ్య తలకు తీవ్రగాయాలు కావటంతో గుంటూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. రూరల్‌ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్ళి ఇరువర్గాలవారిని చెదరగొట్టారు. మంగళవారం కూడా వైసీపీ వర్గీయులు అరాచకం సృష్టించారు. కూలీల చేత మిర్చి కోయిస్తున్న టీడీపీ కార్యకర్త కొండవీటి నటరాజ్‌పై వైసీపీకి చెందిన జొన్నలగడ్డ పిచ్చయ్య, పాలేటి ఇర్మియాలు కర్రలతో దాడిచేశారు. నటరాజ్‌ తలకు, శరీర భాగాలకు గాయాలయ్యాయి. నటరాజ్‌ను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై బాధితుడు నటరాజ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేశారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో కృష్ణయ్య సోదరుడు రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదుమేరకు జొన్నలగడ్డ నవీన్‌ మరో 11 మందిపై కేసు నమోదుచేసినట్లు రూరల్‌ ఎస్‌ఐ సీహెచ్‌వీ సురేష్‌ తెలిపారు. కృష్ణ కుటుంబ సభ్యులను నారా లోకేష్‌ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులను మంగళవారం నాడు ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేతలు అడుగడుగునా ఖూనీ చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. గుంటూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న కృష్ణను టీడీపీ నేతలు పరామర్శించారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయన్నారు. దాడి జరిగిన ఇరవై నాలుగుగంటలు గడిచిన నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపించారు. వారి వెంట కార్యక్రమంలో నేతలు చిట్టాబత్తిని చిట్టిబాబు,  శివనాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

- కొండవీటి నటరాజ్‌ను సత్తెనపల్లి మండల టీడీపీ నాయకులు పరామర్శించారు.  దాడులను నుంచి ప్రజలను రక్షించాలని, నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభార్కర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోపోతే ఆయా గ్రామాల బాధితులతో అంధోళన చేస్తామని టీడీపీ, సీపీఐ నాయకులు అన్నారు. వినతిపత్రం అందించినవారిలో టీడీపీ జిల్లా కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు, లగడపాటి గజానన, తుమ్మల ఏడుకొండలు యర్రా వెంకటేశ్వరరావు, నాగం కార్తీక్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-24T05:41:44+05:30 IST