చికిత్స పొందుతూ రోగి మృతి

ABN , First Publish Date - 2021-04-17T05:13:00+05:30 IST

కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఓ రోగి మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసింది. సుజాతనగర్‌కు చెందిన అబ్దుల్లా (56) ఆయాసం వస్తోందంటూ గురువారం రాత్రి ఓప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన అక్కడి వైద్యులు ఆక్సీజన్‌ లెవల్స్‌ సరిగాలేవని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు

చికిత్స పొందుతూ రోగి మృతి
దాడికి పాల్పడిన వారిని అదుపులోకితీసుకొంటున్న పోలీసులు

వైద్యుల నిర్లక్ష్యం వల్లేనంటూ మృతుడి బంధువుల వీరంగం

వైద్యసిబ్బంది, పోలీసులపై దాడి

డాక్టర్‌ కారు, ఫర్నిచర్‌, కిటికీ ఆద్దాలు ధ్వంసం

కొత్తగూడెం లో ఉద్రిక్తత

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌16: కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఓ రోగి మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసింది. సుజాతనగర్‌కు చెందిన అబ్దుల్లా (56) ఆయాసం వస్తోందంటూ గురువారం రాత్రి  ఓప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన అక్కడి వైద్యులు ఆక్సీజన్‌ లెవల్స్‌ సరిగాలేవని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో రాత్రి 12గంటలసమయంలో ఆయన ఏరియా ఆస్పత్రికి వెళ్లగా డ్యూటిలో ఉన్న వైద్యులు అతడిని పరీక్షించారు. ఆయాసం, బీపీ, షుగర్‌, కొవిడ్‌ పరీక్ష చేసి చికిత్స ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు కూడా ఆయనకు చికిత్స అందిస్తుండగా.. ఆయాసం పెరిగి, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి 12.16గంటలకు మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు.. డ్యూటీ వైద్యులు బాబురావు, మరోవైద్యుడితో పాటు ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఇద్దరు ఎంఎన్‌వోలపై దాడికి పాల్పడ్డారు. డాక్టర్‌ కారు, ఆసుపత్రిలోనలి ఫర్నిచర్‌, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకితెచ్చేందుకు ప్రయత్నించగా.. అబ్దుల్లా కుటుంబీకులు పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అయితే అబ్దుల్లాకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే అతడు మృతి చెందాడరని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి ఆస్పత్రి సూపరిండిండెంట్‌ డాక్టర్‌ సరళ స్పందిస్తూ.. అబ్దులా మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని, వైద్యులు ఆస్పత్రికి వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించారని, అతడికి బీపీ, షుగర్‌, ఆయాసం ఉందని కొవిడ్‌ పరీక్ష కూడా చేశామన్నారు. ఆసుపత్రి రికార్డు ప్రకారం రాత్రి 2గంటలకు ఆస్పత్రికి వచ్చినట్టు నమోదైందన్నారు. అయితే అతడు గుండెపోటుతో మృతిచెందినట్టు అర్థమవుతోందన్నారు. ఏదేమైనా కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలు అందిస్తున్న తమపై దాడి చేయడం అమానుషమన్నారు. 


Updated Date - 2021-04-17T05:13:00+05:30 IST