అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-09-27T07:08:32+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు....

అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరించాలి

ప్రభుత్వ పథకాలు ఎస్సీ, ఎస్టీలకు చేరాలి

ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

క్రియాశీలకంగా పనిచేస్తున్న కమిషన్‌ 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సంగారెడ్డి రూరల్‌, సెప్టెంబరు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీలకు చేరాలని, రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న జిల్లా సంగారెడ్డి అని, అదే విధంగా రాష్ట్రంలోనే తక్కువ కేసులున్న జిల్లా కూడా సంగారెడ్డి జిల్లానే అని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సూచించారు. జిల్లాలో జోగినులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నవి లేనిది పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ హనుమంతరావును కోరారు. 


ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ క్రియాశీలకంగా పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. రాష్ట్రంలో పదివేల కేసులు పెండింగ్‌లో ఉండగా దాదాపు ఎనిమిదడి వేల కేసులను వేగవంతంగా పరిష్కరించడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో రూ. 52.50 కోట్ల పరిహారం అందించామన్నారు. కమిషన్‌ కార్యాలయానికి త్వరతగతిన అందించాలన్నారు. కమిషన్‌ నుంచి వచ్చిన ప్రతీ విషయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత టెండర్లలోనూ ఎస్సీ, ఎస్టీలకు పనులు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలపారు. కోటి రూపాయల వరకు ఉన్న పనుల్లో వారికి నిర్ణయించిన శాతం మేరకు పనులు కేటాయించలన్నారు.


ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను నోటిఫై చేయాలని, సబ్‌ప్లాన్‌ అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన సబ్సిడీని రిలీజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, కలెక్టర్‌ హన్మంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్‌, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, కమిషన్‌ సభ్యులు రామ్‌లాల్‌ నాయక్‌, విద్యాసాగర్‌, జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి అధికారి మల్లేశం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T07:08:32+05:30 IST