ఎమ్మెల్యే బలాలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-05-22T10:41:08+05:30 IST

మలక్‌పేట్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ దళిత మోర్చా జాతీయ

ఎమ్మెల్యే బలాలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

చాదర్‌ఘాట్‌ పీఎస్‌ ముందు బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి శ్రుతి ధర్నా


చాదర్‌ఘాట్‌, మే 21(ఆంధ్రజ్యోతి): మలక్‌పేట్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శ్రుతి గురువారం చాదర్‌ఘాట్‌ పీఎస్‌ ముందు బైఠాయించి ధర్నా చేశారు. శ్రుతికి మద్దతుగా మహిళా మోర్చా నాయకురాలు డాక్టర్‌ విజయలక్ష్మి, పద్మ ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఈనెల 6న చాదర్‌ఘాట్‌లో అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించడానికి వెళ్లానని తెలిపారు. అదే సమయంలో ఎమ్మెల్యే బలాల తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.


వెంటనే తాను ఎమ్మెల్యే బలాలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఘటన జరిగి 15రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యవైఖరిని అవలంభిస్తున్నాయని ఆమె విమర్శించారు. గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ధర్నాలో బైఠాయించారు. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ అక్కడికి చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. ఒకదశలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. 

Updated Date - 2020-05-22T10:41:08+05:30 IST