దారుణాలు

ABN , First Publish Date - 2022-05-12T05:23:03+05:30 IST

సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరిగిన పలు హత్యల్లో మహిళల పాత్ర కీలకంగా ఉండడం గమనార్హం. ఈ హత్యోదంతాలకు స్కెచ్‌ వేసింది కూడా వారేనని పోలీసుల విచారణల్లో తేలింది.

దారుణాలు

హత్యలకు ఒడిగడుతున్న కొందరు మహిళలు 

జిల్లాలో జరిగిన పలు ఘటనల్లో వారే కీలకం


ఒకప్పుడు బలమైన కారణాలకు హత్యలు జరిగేవి. అది కూడా ఎక్కడో ఒక చోట సంభవించేవి. గ్రామాల ఆధిపత్యం, భూముల సమస్యలు, రాజకీయ, సామాజిక కారణాలు హత్యలకు ఉసిగొల్పేవి. కానీ నేడు స్వల్ప కారణాలకే  నిండు ప్రాణాలు బలవుతున్నాయి. అనాలోచిత నిర్ణయాలు, అర్థంపర్థం లేని అపార్థాలతో దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు మహిళలు హంతకులుగా మారుతున్నారు. భర్తనే గొంతునులిమి చంపించిన నవవధువు శ్యామల..  ఆస్తి కోసం తండ్రిని మట్టుబెట్టిన రాజేశ్వరి ఉదంతాలు కనిపిస్తూనే ఉన్నాయి. కట్టుకున్న భర్తను ఒకరు, కన్నతండ్రిని మరొకరు కడతేర్చిన ఈ ఘటనల్లో  మహిళలే  కీలక నిందితులు. 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 11 : జిల్లాలో ఇటీవల జరిగిన పలు హత్యల్లో మహిళల పాత్ర కీలకంగా ఉండడం గమనార్హం. ఈ హత్యోదంతాలకు స్కెచ్‌ వేసింది కూడా వారేనని పోలీసుల విచారణల్లో తేలింది. దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన చంద్రశేఖర్‌కు తొగుట మండలం గుడికందులకు చెందిన శ్యామలకు గత మార్చి 23న వివాహం జరిగింది. ఈ పెళ్లి శ్యామలకు ఇష్టం లేక తన భర్తను చంపేందుకు కుట్రపన్నింది. తన ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి ఏప్రిల్‌ 28న  గొంతు నులిమి హత్య చేసింది. గతంలోనూ అతను తినే అన్నంలో ఎలుకల మందు కలిపింది. 

-చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ గ్రామానికి చెందిన మర్కంటి ఎల్లయ్యను తన భార్య నర్సవ్వ జనవరి 6న గొడ్డలితో నరికి చంపింది. భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని, చిత్రహింసలు పెడుతున్నాడనే కారణంతో ఈ ఉదంతానికి పాల్పడింది. 

-కోహెడ మండలం సముద్రాల గ్రామంలో కొలిపెల్లి రాజయ్యను భార్య లక్ష్మి, కొడుకు నరేశ్‌ కలిసి హత్య చేశారు. మద్యానికి బానిసయ్యాడనే కారణంతో అతనిపై యాసిడ్‌ పోసి గాయపరిచి చంపారు. గతేడాది జూన్‌ నెలలో ఈ సంఘటన చోటు చేసుకోగా.. తల్లి, కొడుకును పోలీసులు జైలుకు పంపారు. 

-కోహెడ మండలం వింజపల్లిలో పోచయ్యను తన కూతురు రాజేశ్వరి ఈ నెల 8న దాడి చేసి చంపింది. తండ్రికి సంబంధించిన వ్యవసాయ భూమి, ఇల్లును తన పేరిట రిజిస్ర్టేషన్‌ చేయాలని గొడవపడి తీవ్రంగా కొట్టడంతో పోచయ్య చనిపోయాడు. ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదైంది. 

-దూళిమిట్టలో అత్తకు సేవ చేయలేక ఓ కోడలు హత్యకు ఒడిగట్టింది. నిద్రిస్తున్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపి గోనె సంచిలో వేసి గ్రామశివారులోని బావిలో పడవేసింది.

-దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లికి చెందిన కురుమ రెడ్డయ్యను భార్య, కూతురు కలిసి తమ ప్రియుల సహకారంతో మద్యంలో విషం కలిపి, ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. 


హత్యలు.. ఆపై డ్రామాలు

ఒక వ్యక్తి అనుమానస్పదంగా చనిపోతే అతనిది హత్యా.. ఆత్మహత్యా అనే విషయంపై కుటుంబ సభ్యులే అనుమానం వ్యక్తం చేస్తారు. కానీ వారే తమ కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసి ఎవరికీ అనుమానం రాకుండా ప్రయత్నిస్తారు. పలు సంఘటనల్లోనూ ఇదే జరిగింది. కానీ వారు చేసిన పొరపాట్లతో నిజాలు బయటపడ్డాయి. తాజాగా సిద్దిపేట శివారులో శ్యామల తన భర్త చంద్రశేఖర్‌ను ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హత్య చేయించింది. పైగా గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. కానీ పోస్టుమార్టం రిపోర్టుతో బండారం బయటపడింది. కోహెడ మండలం సముద్రాలలో రాజయ్యను భార్య, కొడుకు యాసిడ్‌ పోసి గాయపరిచి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు గ్రామస్థులను నమ్మించి దహనం చేశారు. కానీ వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. ఇదే సముద్రాలలో అట్ల కనకయ్యను తన కొడుకు పారతో తలపై బాది హత్య చేసి చెట్టు మీద నుంచి కిందపడి చనిపోయాడని నమ్మించాడు. కానీ నాటకం ఎక్కువ సేపు నిలవలేదు. దూళిమిట్టలో అత్తను చంపిన కోడలు కూడా తన అత్త కనబడడం లేదని భర్తతో నమ్మబలికి ఆ తర్వాత పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది.


బంధాల నడుమ రక్తపాతం

కోహెడ మండలం సముద్రాలలో అట్ల కనకయ్య అనే వ్యక్తిని తన కుమారుడు వీరేందర్‌ హత్య చేశాడు. తన పేరిట భూమిని రిజస్టర్‌ చేయడం లేదనే కారణంతో పారతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే కనకయ్య చనిపోయాడు. కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా కడతేర్చాడు. ఇదే తరహాలో కట్టుకున్న భర్తను, కన్న తండ్రిని, తోడబుట్టిన అన్నదమ్ములను సైతం ఆస్తుల కోసం, అవసరాల కోసం చంపడానికి వెనుకాడడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా మారుతున్నదో స్పష్టమవుతున్నది. మానవత్వాన్ని మంటగలిపేలా వీరి చేష్టలు ఉంటున్నాయి. ప్రేమానురాగాలు మరచి పాశవిక పగలు, పన్నాగాలతో అనుబంధాలను తెంచుకుంటున్నారు. ఇటీవల జరిగిన కీలక హత్యలన్నీ కుటుంబాలు, రక్తసంబంధీకుల నడుమ జరిగినవే కావడం విషాదకరం.

Read more