సరిహద్దులో దారుణం

ABN , First Publish Date - 2020-06-17T06:18:06+05:30 IST

భారత్‌–చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి ఉభయదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అత్యంత విషాదకరమైనది. గాల్వాన్‌ లోయలో కత్తులు, తుపాకులు కాక, రాళ్ళతో కర్రలతో సాగినట్టుగా చెబుతున్న ఈ పరస్పర దాడుల్లో తొలుత...

సరిహద్దులో దారుణం

భారత్‌–చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి ఉభయదేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అత్యంత విషాదకరమైనది. గాల్వాన్‌ లోయలో కత్తులు, తుపాకులు కాక, రాళ్ళతో కర్రలతో సాగినట్టుగా చెబుతున్న ఈ పరస్పర దాడుల్లో తొలుత సూర్యాపేటకు చెందిన కల్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబుతో పాటు మరో ఇద్దరు జవాన్లు నేలకొరిగినట్టుగా ప్రకటించిన భారత సైన్యం, ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి అతిశీతల వాతావరణంలో చిక్కుకున్న మరో 17మంది కూడా కన్నుమూసినట్టుగా మంగళవారం రాత్రి మరో ప్రకటన చేసింది. చైనా వైపు కూడా నలభైమందికి పైగా మరణించినట్టు చెబుతున్నారు. మూడున్నర వేల కిలోమీటర్ల వాస్తవాధీనరేఖ వద్ద ఉద్రిక్తతలు రేగినప్పుడల్లా సైనికులు బాహాబాహీ తలపడిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. కానీ, ప్రాణాలు తీసుకొనేంత వరకూ ఇవి పోలేదు. 1975లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో నలుగురు భారతసైనికులను చైనా దళాలు మాటువేసి మట్టుబెట్టిన దుర్మార్గపు ఘటన మరణాల చరిత్రలో చివరిది. సరిహద్దులో వెడెక్కిన వాతావరణాన్ని చల్లార్చే లక్ష్యంతో సైనికాధికారుల స్థాయిలో మంతనాలు సాగుతున్న తరుణంలోనే ఈ ఘటన జరగడం ఆశ్చర్యం. లోయనుంచి వెనక్కు మళ్ళుతున్న దశలో చైనా సైనికులు ఇలా రెచ్చిపోవడం, మరణాలు భారీగా ఉండటం చూస్తే, ఈ ఘటన తక్షణ ఆవేశకావేశాలతో జరిగింది కాదేమోనన్న అనుమానమూ కలుగుతున్నది.


చల్లారుతున్నట్టుగా కనిపిస్తున్న వాతావరణాన్ని ఈ ఘటన మళ్ళీ వేడెక్కించింది. మాటకు కట్టుబడి తాము వెనక్కు మళ్ళుతుంటే, భారత్‌ ఈ దుశ్చర్యకు పాల్పడిందని చైనా ఎదురుదాడి చేస్తున్నది. భారత్‌ మాట తప్పి, రెండుసార్లు హద్దులు దాటివచ్చి మరీ తమ సైనికులను రెచ్చగొట్టిందని ఆరోపిస్తున్నది. ఉభయదేశాల సైనికులు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎంత సామీప్యంగా ఉన్నారో ఈ ఘటన తెలియచెబుతున్నది. అత్యున్నత స్థాయి సైనికాధికారుల మధ్య జరిగే ఈ చర్చోపచర్చల కంటే, దౌత్య స్థాయిలో మాటామంతీ తక్షణావసరమని కొందరు అందుకే గుర్తుచేస్తున్నారు. పదిరోజుల క్రితం సైనికాధికారుల మధ్య చర్చలకు భారత్‌ ప్రతిపాదించడం, చైనా సరేననడం, కోర్‌ కమాండర్ల స్థాయిలో చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని చోట్ల రెండు దేశాల సైనికులు వెనక్కు తగ్గడం తెలిసిందే. పరిస్థితులు అదుపులో ఉన్నాయని ఆర్మీ చీఫ్‌ కూడా ప్రకటించారు. కానీ, మూడు చోట్ల మాత్రమే చైనా కాస్తంత వెనక్కుతగ్గింది కానీ, ప్యాంగాంగ్‌ సరస్సు, చుశాల్‌ ప్రాంతాల్లో పరిస్థితి యథావిధిగానే ఉన్నదన్న వార్తలూ వినిపించాయి. చైనా సైన్యం చాలా చోట్ల మన భూభాగంలోకి చొరబడిందని విపక్షాలు ఎంతోకాలంగా విమర్శిస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి వాస్తవస్థితికి సంబంధించిన వివరణలేవీ ఎప్పటికప్పుడు లేకపోవడం ఎంతో అయోమయం కలిగిస్తున్నది. ప్యాంగ్యాంగ్‌ సరస్సు సమీపంలోని కొన్ని పర్వతప్రాంతాలు ఇప్పటికీ దాని ఆక్రమణలోనే ఉండటం, సోమవారం కూడా ఈ అంశానికి సంబంధించి సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలోనే గాల్వాన్‌ ఘటన జరగడం వాస్తవాధీనరేఖలో పరిస్థితులు పెద్దగా మెరుగుపడలేదనడానికి నిదర్శనం. 


గాల్వాన్‌లోయలో వాస్తవాధీనరేఖకు అత్యంత చేరువగా భారత్‌ జరుపుతున్న సుదీర్ఘరహదారి నిర్మాణం చైనాకు కంటకింపుగా ఉన్నమాట నిజం. రక్షణ పరంగా అది ఎంతో అవసరం కనుక, ఉద్రిక్తతలు తీవ్రమైన ఈ స్థితిలో కూడా భారత్‌ వెనక్కు తగ్గలేదు. సోమవారం కూడా జార్ఖండ్‌నుంచి వందలాదిమంది కార్మికులను ప్రభుత్వం అక్కడకు తరలించింది. ఈ నిర్మాణం పట్ల చైనాకు ఉన్న వ్యతిరేకతలు, అభ్యంతరాలు అటుంచితే, అమెరికాతో పెరుగుతున్న మన సాన్నిహిత్యం కూడా దాని వీరంగానికి ఓ కారణం. చైనా ప్రయోజనాలను దెబ్బతీసే అమెరికా వ్యూహాల్లో భారత్‌ భాగస్వామి కావడం దానికి ఆందోళన కలిగిస్తున్నది. ఇక, కరోనాతో అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలైన నేపథ్యంలో ఆత్మరక్షణకు స్వస్తిచెప్పి దూకుడుగా పోవాలని కూడా అది నిర్ణయించుకుంది. ‘యుద్ధానికి సన్నద్ధం కండి’ అంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ లద్దాఖ్‌ నుంచి హాంకాంగ్‌ వరకూ అన్నింటినీ వేడెక్కిస్తున్నారు. చైనా పెట్టుబడులకు అడ్డుకట్టవేయడం నుంచి కరోనా పుట్టుపూర్వోత్తరాలపై స్వతంత్ర దర్యాప్తు వరకూ భారత్‌ దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే, సరిహద్దుల్లో చొరబడటం, నేపాల్‌ను గిల్లడం ద్వారా మనమీద కక్షసాధించాలని చైనా ప్రయత్నిస్తున్నది. గాల్వాన్‌ లోయలో పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోయిన తరువాతైనా ఉభయదేశాలూ దిగివచ్చి, స్వల్ప ఉద్రిక్తతలు పెను యుద్ధాలుగా మారకుండా జాగ్రత్తపడితే మంచిది.

Updated Date - 2020-06-17T06:18:06+05:30 IST