Abn logo
Sep 23 2021 @ 23:53PM

అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయానికి కృషి

కమిటీ సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం

కాకినాడ సిటీ, సెప్టెంబరు 23: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్‌ మాట్లాడుతూ  విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీల్లో సభ్యులు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి ప్రజాప్రతినిధులందరూ సిద్ధంగా ఉంటారన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు.  బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.  కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం అందించేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కారుణ్య నియామకాలు ఎక్కువగా చేపడుతున్నామన్నారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు నక్కా చిట్టిబాబు, ఎ.రామేశ్వరరావు, పిడుగు రాముడు,  కొమ్ము చినబాబు, ఎం.రాంబాబు, బీవీవీఎస్‌ఎస్‌ మూర్తి, బూర కృష్ణవేణి, జంగా బాబూరావు కీలక అంశాలను లేవనెత్తారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎంపీలు వంగా గీత, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, ఎ.భార్గవ్‌ తేజ, డీఆర్‌వో సీహెచ్‌.సత్తిబాబు, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలం, కాకినాడ, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీలు కరణం కుమార్‌, లతా మాధురి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె..రంగలక్ష్మీదేవి, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, సాంఘిక సంక్షేమం, పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.