Abn logo
Jul 31 2021 @ 01:09AM

అధికార పార్టీ సామాజిక వర్గానికి రెండో ‘సారీ’.. నివ్వెరపోతున్న శ్రేణులు!

  • అధికార పార్టీ సామాజిక వర్గానికి మళ్లీ మొండిచేయి
  • రగిలిపోతున్న ఆ సామాజికవర్గం నేతలు
  • హిందూపురంలో పారని ఎమ్మెల్సీ పాచిక
  • అసంతృప్తికి ఆజ్యం పోసిన 
  • రెండో వైస్‌చైౖర్మన్ల ఎంపిక ప్రక్రియ
  • కదిరిలో వైస్‌చైర్మన్‌ ఎంపికపై అదే సామాజికవర్గంలో వ్యతిరేకత
  • తాడిపత్రిలో సమావేశాన్ని బహిష్కరించిన
  • అధికార పార్టీ కౌన్సిలర్లు 

అనంతపురం, జూలై30(ఆంధ్రజ్యోతి) : పురపాలికల్లో రెండో వైస్‌చైర్మన్‌, చైర్‌పర్సన్ల ఎంపిక అధికార పార్టీ సామాజిక వర్గానికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఆ సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో పదవులు దక్క కపోవడంతో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. బహిరంగంగా బయటకు పొక్కనప్పటికీ ఆ వర్గం నేతలను అంతర్మథనంలోకి నెట్టిందనే గుసగుసలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వారిని ఎంపిక చేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొందరు ప్రజాప్రతినిధుల వ్యవహారశైలే ఆ పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తోందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని అనంతపురం నగరపాలక సంస్థతో పాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో శుక్రవారం జరిగిన రెండో వైస్‌చైర్మన్ల ఎంపిక విఽధానంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే...


అనంతపురం నగరపాలక సంస్థలో రెండో డిప్యూటీ మేయర్‌ పదవి కమల్‌భూషణ్‌కు ఇవ్వనున్నారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా సాగింది. అయితే ఇప్పటికే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను ఆశించి భంగపడిన నేపథ్యంలో అధికార పార్టీ సామాజికవర్గం నేతలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సామాజికవర్గానికి కాకుండా మరో సామాజికవర్గానికి రెండో డిప్యూటీ మేయర్‌ పదవిని కట్టబెడితే అసంతృప్తులు మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన నేపథ్యంలోనే... కోగటం విజయభాస్కర్‌ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కాగా... అంతకు ముందు అదే సామాజికవర్గానికి చెందిన ముఖ్య నేతలు సమావేశమైనట్లు సమాచారం. రెండో డిప్యూటీ మేయర్‌ పదవి దక్కకపోతే వేరు కుంపటి పెట్టేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలోనే... చివరికి ఆ సామాజికవర్గానికి చెందిన కోగటం విజయభాస్కర్‌రెడ్డిని రెండో డిప్యూటీ మేయర్‌ పదవికి ఎంపిక చేశారని తెలుస్తోంది. హిందూపురం మున్సిపాల్టీలో రెండో వైస్‌ చైర్మన్‌ ఎంపిక విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


ఇక్కడ ముందు నుంచి ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్న మారుతీరెడ్డిని చైర్మన్‌గా నియమించాలని తొలుత భావించారు. అయితే అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో... ఆ పదవి మారుతీరెడ్డికి దక్కలేదు. రెండో వైస్‌ చైర్మన్‌ పదవిని అయినా అతనికి కట్టబెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడా ఎమ్మెల్సీ వ్యూహం బెడిసికొట్టిందన్న ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా బలరామిరెడ్డిని రెండో వైస్‌చైర్మన్‌ పదవి వరించింది.


ఇక్కడా ఓ మంత్రి, ఓ ఎంపీ పావులు కదిపినట్లు సమాచారం. దీనికి తోడు బలరామిరెడ్డి స్వగ్రామం పులివెందుల నియోజకవర్గం కావడంతో పాటు... అధిష్టానమూ అండదండలు ఉండటంతో మారుతీరెడ్డికి మొండిచేయి చూపారని ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. గుంతకల్లు నియోజక వర్గంలోని గుంతకల్లు, గుత్తి మున్సిపాల్టీల్లో స్థానిక ప్రజాప్రతినిధి సూచించిన వారికే పదవులు కట్టబెట్టారు. గుంతకల్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా స్థానిక ప్రజాప్రతినిధి తన కూతురిని చేయాలని తొలుత భావించినప్పటికీ... అధిష్టానం వారించడంతో వెనక్కుతగ్గారు. రెండో వైస్‌ చైౖర్మన్‌ కుర్చీలో ఆయన తన కూతురు నైరుతిరెడ్డిని కూర్చోబెట్టారు. మున్సిపాల్టీని తన గుప్పిట్లో పెట్టుకునే యోచనలో భాగంగానే ఈ ఎంపిక జరిగినట్లు ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో వైస్‌చైర్‌పర్సన్‌గా నైరుతిరెడ్డి పేరు ఖరారు కాగానే ఆమె ఫొటో కటౌట్‌తో ఊరేగించడం చూస్తే పరిస్థితి అర్థమవుతోంది. గుత్తిలో మైనార్టీకి చెందిన నజీర్‌ రెండో వైస్‌చైర్మన్‌ పదవిని ఆశించారు.  పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న గురు ప్రసాద్‌ యాదవ్‌ సతీమణి వరలక్ష్మిని ఆ పదవికి ఎంపిక చేశారు. దీంతో పదవి ఆశించి భంగపడిన వారిలో అసంతృప్తి నెలకొంది. తాడిపత్రి మున్సిపాల్టీలో రెండో వైస్‌ చైర్మన్‌ ఎంపిక లాంఛనమే అయినప్పటికీ అధికార పార్టీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడం చూసి ఆ పార్టీ వర్గాలే నివ్వెరపోయాయి.


అధికారంలో ఉండి కౌన్సిల్‌ మీట్‌ను బాయ్‌కాట్‌ చేయడం ఏమిటో అర్థం కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పుట్టపర్తిలోనూ ఎస్సీ సామాజికవర్గానికి రెండో వైస్‌చైర్మన్‌ కట్టబెట్టడంతో అధికార పార్టీ సామాజికవర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మడకశిరలోనూ ఆ సామాజికవర్గంలో అసంతృప్తులు రేపుతున్నాయి. రాయదుర్గంలో రెండో వైస్‌చైర్మన్‌ పదవిని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గౌని ఉపేంద్రరెడ్డి తన భార్య లావణ్యకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే తనదైన శైలిలో పావులు కదిపి మైనార్టీకి చెందిన వలీబాషాకు కట్టబెట్టారు.  ఐనాపురం మంజు రెండో వైస్‌చైర్మన్‌ పదవిని ఆశించారు. ఆయన స్థానిక ఎమ్మెల్యే సామాజికవర్గం కావడంతో ఆ పదవి దక్కుతుందని ఆశించారు. ఆ ఆశలు ఆవిరి కావడంతో ఆ వర్గం అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గంలో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన కౌన్సిలర్లు గైర్హాజరు కావడం వెనుక పరిణామాలను పరిశీలిస్తే... అక్కడ ఆ పార్టీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి తన సతీమణి ప్రభావతికి రెండో వైస్‌చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని పట్టుబట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో... ఆ పదవిని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పూజారి తిమ్మప్పకు కట్టబెట్టడం అధికార పార్టీ సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తికి దారి తీసినట్లు  చర్చ జరుగుతోంది. కదిరిలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమే్‌షరెడ్డి తన భార్య రజితారెడ్డికి రెండో వైస్‌చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆ పదవిని రాజశేఖర్‌ రెడ్డికి కట్టబెట్టారు.


మొత్తం మీద ఆయన ఎంపికను మెజార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధి తన పట్టు నిలుపుకోవడంలో భాగంగానే ఈ వ్యవహారం నడిపినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ధర్మవరం మున్సిపాల్టీలో పదవుల పందేరంలో సామాజిక సమతుల్యాన్ని పాటించిన నేపథ్యంలో అక్కడ అసంతృప్తులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మెజార్టీ మున్సిపాల్టీల్లో రెండో వైస్‌చైర్మన్‌ పదవులను అధికార పార్టీ సామా జికవర్గం కౌన్సిలర్లు ఆశించినప్పటికీ దక్కకపోవడం వారిలో తీవ్ర నిరాశ నింపింది. రానున్న రోజుల్లో  అసంతృప్తులు ఏ స్థాయిలో బయటపడుతాయో వేచి చూడాల్సిందే.