సాహితీ కళారత్న సింగమనేని నారాయణ కన్నుమూత

ABN , First Publish Date - 2021-02-26T06:40:16+05:30 IST

సాహితీ ధృవతార నింగికేగింది. జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, అభ్యుదయ సాహితీ విమర్శకుడు, సీనియర్‌ సాహితీవేత్త సింగమనేని నారాయణ(78) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు.

సాహితీ కళారత్న   సింగమనేని నారాయణ కన్నుమూత
సింగమనేని నారాయణ భౌతిక కాయం వద్ద రోదిస్తున్న భార్య, కుటుంబీకులు

సాహితీ కళారత్న 

సింగమనేని నారాయణ కన్నుమూత

దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాజకీయ, 

అధికార, సాహితీ ప్రముఖులు

అనంతపురం టౌన్‌, ఫిబ్రవరి 25: సాహితీ ధృవతార నింగికేగింది. జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, అభ్యుదయ సాహితీ విమర్శకుడు, సీనియర్‌ సాహితీవేత్త సింగమనేని నారాయణ(78) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆరునెలల క్రితం ఆయన నివాసంలోని బాత్రూమ్‌లో జారి పడి, తుంటి వెముక విరిగింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి, చికిత్స పొందారు. చికిత్స సమయంలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. తర్వాత కరోనా నుంచి బయట పడి అనంతపురంలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోలేకపోవటంతో ఇంటికే పరిమితమయ్యారు. పది రోజుల క్రితం సింగమనేని ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి ఆయన మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాప్తాడు మండలం మరూరు బండమీదపల్లెకు చెందిన వ్యవసాయ కుటుంబమైన సంజీవమ్మ, రామప్ప దంపతుల ఏడుగురు సంతానంలో రెండో సంతానంగా సింగమనేని నారాయణ 1943 జూన్‌ 26న జన్మించారు. 1 నుంచి 5వ తరగతి వరకు బండమీదపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివారు. జిల్లాకేంద్రంలోని ఎస్‌ఎ్‌సబీఎన్‌ ఉన్నత పాఠశాలలో 6 నుంచి ఎస్‌ఎ్‌సఎల్‌సీ వరకు చదివారు. ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో పీయూసీ చేశారు. 1964 నుంచి 1968 వరకు తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో విద్వాన్‌ కోర్సు చదివారు. 1969లో తెలుగు పండిట్‌గా ప్రభుత్వోద్యోగం పొంది, నార్పల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విధుల్లో చేరారు. అదే ఏడాదిలో గోవిందమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు రాజ్యలక్ష్మి, సృజన, రాధ, కుమారుడు శ్రీకాంత్‌ సంతానం. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 32 ఏళ్లపాటు సేవలందించి, 2001 జూన్‌లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత కూడా సాహితీకారుడిగా సమాజానికి తన రచనలనందిస్తూ వచ్చారు. 60కిపైగా కథలు, 40కిపైగా సాహితీ వ్యాసాలు, 10కిపైగా పుస్తకాలు రచించారు. సమాజంలోని సమస్యలపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉద్యమకారుడిగా వ్యవహరించారు. ఈక్రమంలోనే రైతు సంఘాలతో కలిసి, పనిచేశారు. 2002లో అనంతలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర, సాగునీరు, ఇన్‌పుట్‌ సబ్సిడీ సాధనకు ‘రైతు ఆత్మవిశ్వాస యాత్రలు’ చేపట్టి నాయకులతోపాటు సింగమనేని కూడా అరెస్లయ్యారు. హంద్రీనీవా జలసాధక సమితి కన్వీనర్‌గానూ వ్యవహరించారు. తన ఉపన్యాసాలతో మార్క్సిజం పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించటంతోపాటు సామాజిక రుగ్మతల పట్ల చైతన్య పరిచేందుకు కృషిచేశారు. ప్రభుత్వంతోపాటు వివిధ సాహితీ, స్వచ్చంద సంస్థల నుంచి సింగమనేని నారాయణ పదుల సంఖ్యలో పురస్కారాలు, సత్కారాలను అందుకున్నారు.


సాహితీ రచనలు...

ఆదర్శాలు-అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబి, మధురాంతకం రాజారాం, సీమ కథలు, ఈతరం కోసం- కథాస్రవంతి, కథావరణం వ్యాససంపుటి, సమయమూ-సందర్భమూ వ్యాస సంపుటి, సంభాషణం వ్యాససంపుటి, జూదం కథాసంపుటి, సింగమనేని నారాయణ కథలు, అనంతం కథల సంపుటి, జీవఫలం చేదువిషం, నీకు నాకు మధ్య నిశీధి.


అందుకున్న అవార్డులు...

2001లో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, 2001లో తాపీ ధర్మారావు స్మారక పురస్కారం, 2006లో రాచకొండ రచనా పురస్కారం, 2007లో వాసిరెడ్డి సీతాదేవి స్మారక పురస్కారం, 2010లో ఆవంత్స సోమసుందర్‌ ఉత్తమ రచనా పురస్కారం, 2013లో అప్పాజ్యోశ్యుల విష్ణుభొట్ల సాహిత్య పురస్కారం, 2014లో పెద్దిభొట్ల సుబ్బరామయ్య స్మారక పురస్కారం, 2017లో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా సాహితీ కళారత్న పురస్కారాన్ని సింగమనేని అందుకున్నారు.


ప్రముఖుల దిగ్ర్భాంతి

సింగమనేని నారాయణ మృతిచెందారన్న విషయం తెలుసుకుని జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, సాహితీ ప్రముఖులు దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. సాయినగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన సింగమనేని నారాయణ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు రామచంద్రనగర్‌లోని స్వగృహానికి తీసుకెళ్లారు. ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఇంటి వద్దనే ఏర్పాట్లు చేశారు. సింగమనేని మృతి విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శి రాంభూపాల్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌, సీనియర్‌ సాహితీవేత్తలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, శాంతినారాయణ, పతికి రమే్‌షనారాయణ, ఏలూరి యంగన్న, రాధేయ, నాగేశ్వరాచారి తదితర సాహితీవేత్తలు సింగమనేని భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు.



Updated Date - 2021-02-26T06:40:16+05:30 IST