Abn logo
Jun 19 2021 @ 01:28AM

దగా.. దగా..!

అరకొర పోస్టులతో జాబ్‌ క్యాలండర్‌ విడుదల

నిరుద్యోగులకు తీవ్ర నిరాశ

గ్రూప్‌- 1, 2కి కలిపి 36 పోస్టులే 

టీచర్‌ ఉద్యోగాల భర్తీకి కానరాని డీఎస్సీ

కానిస్టేబుల్‌ పోస్టులూ అరకొరే 

మిగతా శాఖల్లోనూ ఇదే తంతు

గతంతో పోల్చుకుని   

ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న నిరుద్యోగులు 

వైసీపీ మాటలు నమ్మి 

మోసపోయారంటున్న విద్యార్థి సంఘాలు 

అనంతపురం విద్య, జూన్‌ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ నిరుద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది.  రెండేళ్లుగా ఎదురుచూసినా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఒక్క డీఎస్సీ ప్రకటించలేదు. ఇక గ్రూప్స్‌ పోస్టుల ప్రకటన మరీ దారుణం. దీర్ఘకాలిక లక్ష్యంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్థుల ఆశలపై పెద్ద బండరాయి వేశారు. గ్రూప్స్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 36 పోస్టులు ప్రకటించటంపై ఉద్యోగ ఆశావహుల్లో తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క డీఎస్సీ ప్రకటనా లేదు. ఆఖరికి టెట్‌ కూడా ప్రకటించలేదు. జీఓ-39 పేరుతో ప్రభుత్వం శుక్ర వారం ఇచ్చిన జాబ్‌ కేలండర్‌ కోసం ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది.


డీఎస్సీ ఊసే లేదు...

ఉద్యోగ ప్రకటనల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కీలకం. ఏ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగాల ప్రకటన చేసినా భారీగా చేస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2018లో భారీగా పోస్టులు భర్తీ చేసింది.  జిల్లా వ్యాప్తంగా 602 నోటిఫైడ్‌ పోస్టులను ఇచ్చారు. దాదాపు 45 వేల మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారు.  గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చి, శరవేగంగా పరీక్షలు కూడా నిర్వహించింది. అయితే ఎన్నికలు రావడంతో ఆ పోస్టుల భర్తీలో జాప్యమైంది. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ  పరీక్షలు పూర్తయినా... ఆ పోస్టులను భర్తీ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. డీఎస్సీ- 2018 నోటిఫికేషన్‌ వచ్చి మూడేళ్లు కావస్తున్నా నేటికీ ఆ  పోస్టులను భర్తీ చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం ఆ మాటను అటకెక్కించింది. జాబ్‌ క్యాలండర్‌తో పాటు ఉపాధ్యాయు పోస్టుల కనీస ప్రకటన అయినా ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎక్కడా అది కనిపించకపోవడంతో ఉపాధ్యాయ పోస్టుల ఆశావహ అభ్యర్థులు తీవ్ర ఆసహ నం వ్యక్తం చేస్తున్నారు.  


వేళ్ల మీద లెక్కపెట్టేలా....!

ఇక గ్రూప్స్‌ పోస్టుల ప్రకటనలో కనీవినీ ఎరుగని విధంగా, గ్రూప్స్‌ చరిత్రలో ఏనాడూ చూడని విధంగా వేళ్ల మీద లెక్కపెట్టేలా పోస్టులను ప్రకటించడంతో గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం గ్రూప్స్‌ పోస్టులను భారీగా ప్రకటించింది. గ్రూప్‌-2 పోస్టులు 2016లో 982 పోస్టులు ప్రకటించగా, 2018లో గ్రూప్‌-2లో 446 పోస్టులు ప్రకటించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ ఏడాది ఇచ్చిన జాబ్‌ కేలండర్‌ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయని నిరుద్యోగులు వాపోతున్నారు. గ్రూప్స్‌ 1, 2 కలిపి కేవలం 36 పోస్టులు ప్రకటించారు.  కానిస్టేబుల్‌ పోస్టులు  2018లో  2,723, 2016లో 4,548 ప్రకటించారు. 2021-2022 ఏడాదికి కానిస్టేబుల్‌ 401 పోస్టులకు మాత్రమే ప్రకటన చేశారు. 2016లో ప్రకటించిన పోస్టుల్లో ప్రస్తుత కానిస్టేబుల్‌ పోస్టుల ప్రకటన కేవలం 10 శాతం కూడా మించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
నిరుద్యోగుల పాలిట దగా ప్రభుత్వం 

: జాబ్‌ క్యాలండర్‌ పేరుతో నిరుద్యోగులను ఈ ప్రభుత్వం దగా చేసింది. వైఎ్‌సఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. మాజీ సీఎం చంద్రబాబునాయుడు హయాంలో 2018లో ఇచ్చిన డీఎస్సీ మినహా  మళ్లీ ఈ ప్రభుత్వం టీచర్‌ పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు లేవు. గ్రూప్స్‌ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు. జగన్‌కు ఓటేసిన వారు ప్రస్తుతం  ఎందుకు వేశామా అని  బాధపడుతున్నారు.  

లక్ష్మీనరసింహ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, టీఎన్‌ఎ్‌సఎఫ్‌

తీవ్ర నిరాశే మిగిల్చారు

ఉద్యోగాల ప్రకటన కోసం 2019 నుంచి నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కోచింగ్‌ తీసుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు. 2020లోనే అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలపై నోటిఫికేషన్‌ఇస్తామన్నారు. 2021లో జనవరిలో ఇస్తారని ఆశగా నిరుద్యోగులు ఎదురుచూసి మోసపోయారు. జాబ్‌ క్యాలండర్‌ మోసంపై విద్యార్థుల తరఫున త్వరలో నిరసనలు తెలుపుతాం. 

- వేమన, ఏఐఎ్‌సఏ జిల్లా అధ్యక్షులు