టీకాపై అయోమయం

ABN , First Publish Date - 2021-05-08T06:31:38+05:30 IST

కరోనా టీకాపై అయోమయం సాగుతోంది.

టీకాపై అయోమయం

మరో 20 వేల కోవీషీల్డ్‌.. 5 వేలు కోవాగ్జిన్‌ డోసుల రాక 

నేడు రెండో విడత వారికే అంటూ అధికారుల వెల్లడి

తొలి విడత కోసం దరఖాస్తు చేసుకున్నోళ్ల ఆగ్రహం 

అనంతపురం వైద్యం, మే 7: కరోనా టీకాపై అయోమయం సాగుతోంది. అవసరం మేరకు సరఫరా కాకపోవడంతో అధికారులు ఆంక్షలు పెట్టి, వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 15 రోజులుగా వచ్చిన వ్యాక్సిన్‌ను కేవలం రెండో విడత డోసు వారికి మాత్రమే అంటూ ఆంక్షలు పెట్టి వేస్తున్నారు. శుక్రవారం మరో 25 వేల డోసులు వచ్చాయి. అందులో 20 వేలు కోవీషీల్డ్‌, 5 వేలు కోవాగ్జిన్‌ డోసులున్నాయి. శనివారం ఈ వ్యాక్సిన్‌ను కూడా రెండో డోస్‌ వారికి మాత్రమే వేస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ కామేశ్వరప్రసాద్‌, డీఐఓ డాక్టర్‌ గంగాధర్‌రెడ్డి చెబుతున్నారు. తొలి విడత కోసం కోవిన్‌ వెబ్‌సైట్‌లో న మోదు చేసుకున్నవారు.. అధికారుల తీరుపై మండి పడుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. ఎందుకు వ్యాక్సిన్‌ వేయడం లేదనీ, అ లాంటపుడు ఎందుకు స్లాట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ పెట్టారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రస్థాయి నుంచి రెండో విడత వారికే వ్యాక్సిన్‌ వేయాలని ఆదేశాలున్నట్లు అధికారులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి స్లాట్‌ల వారీగా వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఏపీలో ఎందుకు ఇలా చేస్తున్నారని వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్న వారు మండి పడుతున్నారు. అత్యధికంగా జిల్లాలో కేసులు నమోదవుతున్నా.. వ్యాక్సిన్‌కు ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓ చొరవ తీసుకుని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వ్యాక్సిన్‌ పంపిణీ సాగేలా చూడాలని కోరుతున్నారు. లేకపోతే దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాక్సిన్‌పై జిల్లాలో గందరగోళం కొనసాగుతోంది.

Updated Date - 2021-05-08T06:31:38+05:30 IST