వైసీపీ దుర్మార్గాలను ఆపండి

ABN , First Publish Date - 2021-03-05T06:42:03+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ దుర్మార్గాలను ఆపాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడును టీడీపీ నేతలు కోరారు.

వైసీపీ దుర్మార్గాలను ఆపండి
కలెక్టరేట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు, ప్రభాకరచౌదరి

అధికార పార్టీ తర ఫున వలంటీర్లు, మెప్మా సిబ్బంది ప్రచారం

అమలుకాని  ఎన్నికల కమిషన్‌ నిబంధనలు

ఆధారాలివిగో..  చర్యలు తీసుకోండి..

కలెక్టర్‌కు  టీడీపీ నేతలు 

కాలవ శ్రీనివాసులు, ప్రభాకర చౌదరి ఫిర్యాదు

అనంతపురం వైద్యం, మార్చి4: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ దుర్మార్గాలను ఆపాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడును టీడీపీ  నేతలు కోరారు. గురువారం మాజీ మంత్రి, టీడీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ.. కలెక్టర్‌ను కలిశారు. రాయదుర్గం, అనంతపురంతోపాటు వివిధ మున్సిపాలిటీల్లో వైసీపీ అరాచకాలు హెచ్చుమీరాయన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వలంటీర్లు, మెప్మా సిబ్బంది.. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ, ఓటర్లను బెదిరించటం వంటి వాటిపై ఆధారాలను కలెక్టర్‌కు అందించి, ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వలంటీర్లు, మెప్మా సిబ్బందిని అధికార పార్టీ ఉపయోగించుకుంటోందన్నారు. వారిపై వైసీపీ నేతలు ఒత్తిడి పెట్టి, భయపెట్టి, మానసికంగా వేధిస్తున్నారన్నారు. దీంతో వారు వైసీపీ అభ్యర్థుల వెంట బహిరంగంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితాతో వెళ్లి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలనీ, లేకపోతే ఫించన్‌ పోతుందనీ, అమ్మ ఒడి రాదు అనీ, రేషన్‌ కార్డు తొలగిస్తామంటూ వలంటీర్లు బెదరిస్తున్నారన్నారు. వీడియోలు, ఫొటోలతో ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే ఆధారాలతో ఉన్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ప్రభాకరచౌదరి మాట్లాడుతూ అనంత నగరంలోనూ అడ్డదారుల్లో గెలవాలని అధికార పార్టీ ఎమ్మెల్యే ఇతర నేతలు అనేక అరాచకాలు చేస్తున్నారన్నారు. ఏకగ్రీవాల కోసం టీడీపీ అభ్యర్థులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినా, వారి ఆటలు సాగనీయలేదన్నారు. ఇప్పుడు ఎలాగైనా గెలవాలని వలంటీర్లపై ఒత్తిడి పెట్టి, పథకాలు తొలగిస్తామని ఓ వైపు బెదిరిస్తూ, మరో వైపు డబ్బు పంపిణీ చేయిస్తున్నారన్నారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాము కూడా గుణపాఠాలు నేర్చుకుని, వచ్చే ఎన్నికలలో తిప్పి కొడతామన్నారు. టీడీపీ, సీపీఐ ఇతర పార్టీలను కలుపుకుని, ఎన్నికల్లో పోరాటం సాగిస్తున్నామనీ, మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటామని  ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-05T06:42:03+05:30 IST