వైసీపీ నేతల బరితెగింపు

ABN , First Publish Date - 2021-02-27T06:37:44+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు బరితెగించి, వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీ నేతల బరితెగింపు
ఎస్పీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు కాలవ, బీకే, పరిటాల సునీత, ప్రభాకర చౌదరి

ఎన్నికల్లో గెలుపునకు అడ్డదారులు

టీడీపీ అభ్యర్థులపై బెదిరింపులు,  దౌర్జన్యాలు

పోలేపల్లిలో అక్రమ కేసులు పెట్టి, వేధింపులు

జిల్లా ఎస్పీకి ఆధారాలతో  ఫిర్యాదు చేశాం

అధికార పార్టీ  అరాచకాలకు అడ్డకట్ట వేయాలి

టీడీపీ నేతలు కాలవ, బీకే, పరిటాల సునీత, ప్రభాకర చౌదరి

అనంతపురం వైద్యం, ఫిబ్రవరి26: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు బరితెగించి, వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఆగడాలపై ఆధారాలతో జిల్లా ఎస్పీ సత్యయేసుబాబుకు శుక్రవారం టీడీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల అ ధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారధి, మాజీ మంత్రి పరిటాల సునీత, అనంతపురం మాజీ ఎమ్మె ల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆడియోలను అందజేశారు. జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను ఎస్పీకి విన్నవించారు. అనంతరం మీడియాతో టీడీపీ నేతలు మాట్లాడారు. కాలవ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న అనంత నగరంలోనూ వైసీపీ అరాచకాలకు తెరలేపటం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంలేకే వైసీపీ ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. వాటిని తెలుగుదేశం ధైర్యంగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నచ్చిన వారికి ఓటు వేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా ఓ వైపు వైసీపీ నేతలు, కార్యకర్తలు మరోవైపు వలంటీర్లు చేస్తున్నారన్నారు. వలంటీర్లు కార్యకర్తలుగా మారిపోయారన్నారు. మెజారిటీ రాకపోతే వలంటీర్లను తొలగిస్తామని నేతలు హెచ్చరిస్తున్నారన్నారు. దీంతో వలంటీర్లు మరింత బరితెగించి, అమాయక ప్రజలను ఫించన్‌ రాదు, బియ్యం రావు అంటూ హెచ్చరిస్తూ వైసీపీకి ఓట్లు వేయాలని బెదిరిస్తున్నారన్నారు. ఓటు ఎవరికి వేస్తున్నారో సీసీ కెమెరాలో కనిపిస్తుందనీ, అధికార పార్టీకి ఓటు పడకపోతే వెంటనే విజయవాడలోనే పింఛన్‌, రేషన్‌కార్డు తొలగించేస్తారని బెదిరిస్తున్నారన్నారు. ప్రజల అమాయకత్వం, అవసరాలను ఆసరాగా చేసుకుని, ఓట్లు వేయించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీ అరాచకాలను అడ్డుకుని, ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడాలని ఎస్పీని కోరామన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండలం పోలేపల్లిలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి, వేధిస్తున్నారన్నారు. దాదాపు 18 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారన్నారు. సీకేపల్లి మండలం నామాల గ్రామంలో ఓడిపోయిన టీడీపీ మద్దతుదారుడు కుళ్లాయప్పను ఊరు విడిచివెళ్లాలని గెలిచిన నరసింహులు బెదిరిస్తున్నారన్నారు. ఇవన్నీ జిల్లా ఎస్పీకి తెలియజేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి మాట్లాడుతూ అనంతపురం నగరంలో అన్నివర్గాల ప్రజలున్నారన్నారు. ఉన్నతాధికారులు ఇక్కడే నివాసముంటున్నారన్నారు. అయినా వైసీపీ నాయకులు బరితెగించి, టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ఊరు విడిచివెళ్లాలని బెదిరిస్తున్నారన్నారు. నగరంలో 17 డివిజన్లను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి బెదిరింపులకు ఉసిగొలుపుతున్నారన్నారు. కొందరిని మహిళలు అని కూడా చూడకుండా ఇక్కడ ఉండకుండా వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారన్నారు. దీంతో విధిలేక వెళ్లిపోతున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఆడియోను ఎస్పీకి అందజేశామన్నారు. వీటిపై చర్య లు తీసుకుని, ప్రశాంతంగా ఎన్నికలు సాగేలా అధికారులు చూడాలని కోరారు. వైసీపీ అరాచకాలను ప్రజలకు తెలియజేస్తామని చౌదరి పేర్కొన్నారు.

Updated Date - 2021-02-27T06:37:44+05:30 IST