టీబీ డ్యాంకు భారీగా వరద.. 30వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో..

ABN , First Publish Date - 2021-06-20T06:43:14+05:30 IST

తుంగభద్రమ్మ పరుగుపరుగున వచ్చి.. జిల్లా వాసికి ఆశలు మోసుకొచ్చింది.

టీబీ డ్యాంకు భారీగా వరద.. 30వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో..
తుంగభద్ర జలాశయం

ఆశలు మోసుకొచ్చె..

 టీబీ డ్యాంకు భారీగా వరద.. 30వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో..

జూన్‌ మాసంలో ఆశాజనకంగా వర్షాలు

జలాశయ భద్రతకు కేంద్ర బలగాల నియామకం

జూలై రెండోవారంలో హెచ్చెల్సీకి నీటి విడుదల?

రాయదుర్గం, జూన్‌ 19: తుంగభద్రమ్మ పరుగుపరుగున వచ్చి.. జిల్లా వాసికి ఆశలు మోసుకొచ్చింది. జూన్‌లోనే నదీమతల్లి పరవళ్లు తొక్కుతూ ఉరికొస్తోంది. తుంగభద్ర జలాశయానికి చేరి, అనంత అన్నదాత మోములో ఆనందం నింపుతోంది. తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించిన నేపథ్యంలో తుంగభద్ర జలాశయంలో నీటి ల భ్యత ఆశాజనకంగా ఉంటుందని బోర్డు అధికారులు అం చనా వేశారు. మే చివరి వరకు తొమ్మిది టీఎంసీల దాకా నీరు జలాశయానికి వచ్చి చేరాయి. జూన్‌ మాసంలోని చివరలో వర్షాలు సమృద్ధిగా పడి, జలాశయానికి భారీగా వరదనీరు చేరుతాయని బోర్డు వేసిన అంచనాలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే తుంగభద్ర జలాశయానికి ఎగువన ఉన్న తుంగ జలాశయం నిండిపోవడంతో ఒక్కసారిగా 33 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వంద కిలోమీటర్ల దూరం నుంచి ప్రవహించిన వరదనీరు శుక్రవారం సాయంత్రానికి తుంగభద్ర జలాశయానికి చేరుకుంది. ఇన్‌ఫ్లో క్రమేపీ పెరుగుతూ శనివారం రాత్రికి 30 వేల క్యూసెక్కులు దాటింది. ఈ ఏడాదిలో భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటం ఇదే ప్రారంభంగా భావిస్తున్నారు. జలాశయంలో 14 టీఎంసీల దాకా నీటి నిల్వలున్నాయి. జలాశయానికి ఎగువనున్న శివమొగ్గ, అగుంబె లాంటి ప్రాంతా ల్లో రుతుపవనాల ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్‌ఫ్లో క్రమేపీ పుంజుకుంటోంది. ఇప్పటికే తుంగభద్ర బోర్డు అధికారులు వేసిన అంచనా ప్రకారం ఈ ఏడాది 168 టీఎంసీలకుపైగా జలాశయానికి నీరు వచ్చి, హెచ్చెల్సీకి 25 టీఎంసీల దాకా కేటాయింపులు చేయనున్నారు. ప్రస్తుత నీటి లభ్యతను బట్టి సానుకూల సంకేతా లు అందుతున్నాయి.


జూలై రెండో వారంలో హెచ్చెల్సీకి నీరు?

జలాశయం నుంచి తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ)కి జూలై రెండో వారంలో నీరు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జలాశయంలో 20 టీఎంసీలకుపైగా నీరు చేరితే హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఇన్‌ఫ్లో స్థాయిని బట్టి 40 టీఎంసీల నీరు నిల్వ ఉంటే హెచ్చెల్సీకి నీరిస్తారు. ఇప్పటికే జలాశయంలో 14 టీఎంసీల దాకా నీరు నిల్వ ఉండటంతో మరో వారం రోజుల్లో 20 టీఎంసీలకుపైగా నీటి మట్టం పెరిగే అవకాశాలున్నాయి. దీంతో జూలై రెండో వారంలో నీరు విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక నుంచి హెచ్చెల్సీకి 105వ కిలోమీటర్‌ వరకు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా మరమ్మతులు చేస్తున్నారు. ఈ ఏడాది సరిహద్దులో రెండు వేల క్యూసెక్కులకుపైగా ఆంధ్రా వాటా కింద రోజూ అందించాలని బోర్డు భావించి, ఆ మేరకు ప్రణాళిక రూపొందించింది. జూలై రెండోవారంలో నీరు విడుదల చేసే పరిస్థితి ఉంటుందని ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చారు. ఆంధ్ర, కర్ణాటకకు సంబంధించిన నీటి వాటాలు ఒకేసారి విడుదల చేసేలా బోర్డు చర్యలు తీసుకుంటోంది.


డ్యామ్‌ భద్రతకు కేంద్ర బలగాలు  

తుంగభద్ర జలాశయం ఆనకట్టతోపాటు భద్రత కోసం కేంద్ర బలగాలను నియమించారు. 33 మంది సిబ్బందిని కేటాయించాలని గతంలో బోర్డు.. కేంద్రానికి లేఖ రాసింది. దీంతో 23 మందిని ప్రస్తుతం కేటాయించారు.

Updated Date - 2021-06-20T06:43:14+05:30 IST