Abn logo
May 15 2021 @ 01:14AM

రానున్నది దళారీ రాజ్యం..!

కనుమరుగవనున్న ఇసుక స్టాక్‌ పాయింట్లు

రీచ్‌ల నుంచే సరఫరా

రెట్టింపుకానున్న కష్టాలు

10 టన్నుల ఇసుక

రూ.10 వేలపైమాటే..

చుట్టూ 45 కిలోమీటర్ల పైమాటే..

రవాణాతో తడిసి మోపెడు..

17 నుంచి జేపీ ప్రైవేట్‌ కంపెనీ ద్వారా విక్రయాలు

జిల్లాలోని అన్ని రీచ్‌లు కంపెనీ పరిధిలోకి..

అనంతపురం కార్పొరేషన్‌, మే 14: ఇసుక సరఫరాలో దళారీ రాజ్యం రాబోతోంది. ఇసుక ప్రైవేటుపరం కాబోతోంది. దీంతో ఇసుక కష్టాలు పెరగనున్నాయా..? ఇసుక  ఇంటికి తీసుకురావడం కలగా మారనుందా..? భవిష్యత్తులో మధ్యవర్తు(బ్రోకర్ల) హవా నడవనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాఽధానం వినవస్తోంది. ఇసుక ఇకపై ప్రైవేటు వ్యవహారం కానున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం జయప్రకాష్‌ వెంచర్స్‌ (జేపీ) కంపెనీకి ఆ బాధ్యతలు  అప్పగించింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌లు, స్టాక్‌పాయింట్ల వివరాలను గనులశాఖ, ఏపీఎండీసీ అధికారులు అప్పగించారు. ఇదివరకే  ప్రైవేటు కంపెనీ ప్రతినిధులు భూమిపూజ కూడా చేసినట్లు తెలిసింది. ఈనెల 17వ తేదీ సోమవారం నుంచి పూర్తిస్థాయిలో ఆ కంపెనీ పరిధిలోనే ఇసుక కొనుగోలు, రవాణా వ్యవహారాలు సాగనున్నాయి. ఇసుక విషయంలో సరికొత్త కష్టాలు ఎదురుకానున్నాయి. టన్ను ఇసుక ధర రూ.475గా నిర్ణయించారు. నేరుగా రీచ్‌ల వద్దే ఇసుకను కొనుగోలు చే యాల్సి ఉంటుంది. అక్రమ తవ్వకాలు, రవాణాను కంపెనీ అరికట్టగలిగినా... సామాన్యులకు మాత్రం ఇసుక  ధరల విషయంలో చుక్కలను చూపుతుందనడంలో సందేహం లేదు. ఇదివరకు ఏపీఎండీసీ పరిధిలో పనిచేసిన ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని తొలగించకుండా వారినే కొనసాగించడం విశేషం.


బ్రోకర్ల హవా..?

జిల్లా కేంద్రమైన అనంతపురం నగరానికి ఉప్పలపాడు నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంది. ఉప్పలపాడు సమీపంలో పీసీ రేవు, సీసీ రేవుల నుంచి ధర్మవరం 45 కిలోమీటర్లు, కదిరి 44 కిలోమీటర్ల దూరంలో  ఉన్నాయి. ఉప్పలపాడు రీచ్‌లో టన్ను ఇసుక రూ.475 చొప్పున 10 టన్నుల ఇసుక (ఆరు టైర్ల వాహనం) కొనుగోలు చేయడానికి రూ.4750 ఖర్చవుతుంది. ఇక రవాణా ఖర్చు రూ.6వేలపైమాటే అంటే మొత్తం రూ.10,750 అవుతుంది. రవాణా పెరిగిందంటే మొత్తం ఖర్చు కూడా పెరిగినట్లే. 18 టన్నుల (10 చక్రాల వాహనం) ఇసుకైతే రూ.20వేల పైమాటే. అంటే గతంలో రవాణాతో కలిపి రూ.16 వేలు పలికిన ఇసుకకు మరో రూ.5వేలకుపైగా చెల్లించాల్సి వస్తుంది. దూరప్రాంతాలకు ట్రాక్టర్లు తీసుకుపోవడం రిస్క్‌ తీసుకోవడం కిందకే వస్తుంది. అంతదూరం నుంచి వచ్చే ఇసుక వాహనంలో ఎంత ఉంటుందో (దారిలో డోర్‌ పై నుంచే పడిపోవడం) తెలియదు. ఇసుక అవసరమైన వారు సైతం సొంతంగా రీచ్‌లకు వెళ్లలేకపోవచ్చు. దీంతో బ్రోకర్ల హవా నడుస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వారు ఎంత అడిగితే అంత ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది.


నో స్టాక్‌ పాయింట్స్‌..

జిల్లాలో ఇసుక రవాణాకు సంబంధించి స్టాక్‌పాయింట్లు ఉండబోవని స మాచారం. జిల్లాలో ఇది వరకు ఉన్న స్టాక్‌పాయింట్లన్నీ రద్దు కానున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నగర శివారులోని సోముులదొడ్డి, బుక్కరాయసముద్రం, కొర్రపాడు, కదిరి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం తదితర ప్రాంతాల్లోని స్టాక్‌పాయింట్లలో ఇకపై ఇసుక తీసుకురాలేం. జిల్లాలో ఇసుక రీచ్‌లకు సంబంధించి ఉప్పలపాడు, పీసీ రేవు, సీసీ రేవు, తాడిపత్రి సమీపంలోని లక్షుంపల్లి, తరిమెల, పేరూరు సమీపంలోని పేరూరు పాళ్యం, కళ్యాణదుర్గం పరిధిలోని అజ్జయ్యదొడ్డి, రాయదుర్గం సమీపంలోని జుంజురాంపల్లి, హిందూపురం సమీపంలోని దేవనహళ్లి ఇసుక రీచ్‌ల నుంచే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. టన్ను ఇసుకను రీచ్‌ల వద్ద రూ.475గా నిర్ణయించిన విషయం తెలిసిందే.


కొత్త ఏజెన్సీకి రీచ్‌లు అప్పగించండి

గనులశాఖ, ఇసుక అధికారులకు ఆదేశాలు

అనంతపురం కార్పొరేషన్‌, మే14: రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన కొత్త ఏజెన్సీ ఇసుక రీచ్‌లను స్వాధీనం చేసుకుంటుందనీ, వాటిని అప్పగించాలని జిల్లా గనులశాఖ, ఇసుక అధికారులకు ఆదేశాలందాయి. గనులశాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇండస్ర్టీస్‌ అండ్‌ కామర్స్‌ శాఖ అధికారులు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. వీసీలో గనుల శాఖ డీడీ రమణరావు, తాడిపత్రి ఏడీ ఆదినారాయణ, జిల్లా ఇసుక అధికారి కొండారెడ్డి, ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త ఏజెన్సీ శుక్రవారం నుంచే తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత జిల్లా ఇసుక అధికారి జిల్లాలోని ఏజెన్సీ ప్రతినిధులకు నెల వరకు సహాయం చేస్తారన్నారు. ఏపీఎండీసీకి సంబంధించిన సీసీ కెమెరాలు, తూకం యంత్రాలు, చెక్‌ పోస్టులను ఏజెన్సీకి అప్పగించి, రసీదు పొందాలన్నారు. ఇసుక స్టాక్‌ పరిమాణంలో, సీసీ కెమెరాల నష్టంలో తేడా ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేదవారి హౌసింగ్‌ స్కీమ్‌లు, ఆర్‌ఆర్‌ ప్యాకేజీలకు ఉచిత ఇసుక సరఫరా ఏజెన్సీ చేత కూపన్లను అందిస్తారన్నారు. వారు సరఫరా చేసిన పరిమాణానికి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. మూడో ఆర్డర్‌లోని వాగులు, వంకల్లో ఇసుక పరిమాణం 500 మెట్రిక్‌ టన్నుల కంటే తక్కువగా ఉంటే, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్ల ద్వారా స్థానిక ప్రజలు ఉచితంగా తీసుకుపోవటానికి అనుమతిస్తారన్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే జిల్లా ఇసుక కమిటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారన్నారు. ఏపీఎండీసీలో పనిచేస్తున్న సిబ్బంది సేవలను ఈనెల 21వ తేదీ వరకు ఉపయోగించుకుంటారనీ, ముగింపు ఉత్తర్వులను జేసీ జారీ చేస్తారన్నారు. రీచ్‌పాయింట్‌ టన్ను ఇసుక రూ.475 నుంచి నియోజకవర్గాల వారి రేట్లు త్వరలోనే గనుల శాఖ నుంచి తెలియజేస్తారన్నారు. భవిష్యత్తు సమస్యలను నివారించడానికి కాంట్రాక్టర్ల బిల్లులను ఈనెల 21లోపు ఖరారు చేసి ఏపీఎండీసీకి సమర్పించాలని సూచించారు. ఉప్పలపాడు వద్ద ఇసుక పూడిక తీయడానికి గనుల శాఖ తదుపరి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అన్ని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేస్తారన్నారు. ఇసుక అక్రమ కార్యకలాపాలను నియంత్రించడానికి సంబంధిత జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా ఇసుక అధికారి, గనుల శాఖతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తారన్నారు.

Advertisement