సరుకుల సరఫరాకు రూ.12 కోట్లతో టెండర్లు

ABN , First Publish Date - 2021-01-21T06:58:51+05:30 IST

అధికార వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య టెండర్‌ వార్‌ నడుస్తోంది. సమగ్ర శిక్షలో టెండర్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

సరుకుల సరఫరాకు  రూ.12 కోట్లతో టెండర్లు
సమగ్రశిక్ష కార్యాలయం (ఫైల్‌)

‘సమగ్ర శిక్ష’లో టెండర్‌ వార్‌..

దక్కించుకునేందుకు  అధికార పార్టీ నేతల పోటీ

ఓ ఎమ్మెల్యే వర్గీయుల హల్‌చల్‌

ఇతరులు టెండర్లు వేయకుండా అడ్డంకులు

ఎదురొడ్డిన ఓ ఎంపీ అనుచరులు

ఘర్షణతో ప్రక్రియ వాయిదా..

అనంతపురం విద్య, జనవరి 20:  అధికార వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య టెండర్‌ వార్‌ నడుస్తోంది. సమగ్ర శిక్షలో టెండర్లు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అనుచరుల మధ్యే యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా కోట్ల రూపాయల పనులు దక్కించుకోవటానికి వైసీపీ నాయకులే కాలు దువ్వుతున్నారు. ఏడాది కాలానికి కేజీవీబీలు, ఆదర్శ పాఠశాలలకు సరుకులు, పాలు, ఇతరత్రా సరఫరాకు ఇటీవల టెండర్లు పిలిచారు. ఓపెన్‌ టెండర్లలో ఏవరైనా పాల్గొనవచ్చు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వర్గీయులు దూకుడుగా వ్యవహరించారు. ఇతరులు ఎవరూ టెండర్‌ వేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం. పనులన్నీ తమకే దక్కాలని హల్‌చల్‌ చేశారని తెలుస్తోంది. వారికి ఓ ఎంపీ వర్గీయులు ఎదురొడ్డి నిలవటంతో తీవ్ర స్థాయిలోనే సమగ్రశిక్ష కార్యాలయంలో ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఈనెల 9న చేపట్టాల్సిన టెండర్ల ఓపెన్‌ ప్రక్రియ కాస్తా.. వాయిదా పడింది. అధికార పార్టీ నాయకులే పోటీకి దిగటంతో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి.


కోట్ల రూపాయల పనులు

జిల్లాలోని 62 కేజీబీవీలు, 24 ఆదర్శ పాఠశాలలకు కిరాణా సరుకులు, పాలు, కోడిగుడ్లు, పండ్లు ఇతర సరుకుల సరఫరాకు సంబంధించి ఏడాది కాలానికి టెండర్లు పిలిచారు. వీటి విలువ రూ.కోట్లలోనే ఉంటుంది. 62 కేజీబీవీల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ 13,797 మంది చదువుతున్నారు. ఒక్కో విద్యార్థినికి ప్రభుత్వం నెలకు రూ. 1,400 వ్యయం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 24 ఆదర్శ పాఠశాలల పరిధిలో 12,061 మంది చదువుతున్నారు. విద్యార్థికి నెలకు రూ.1,500 ప్రభుత్వం వెచ్చిస్తోంది. మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలకు ఏకంగా రూ.12 కోట్ల విలువైన సరుకులు సరఫరా చేయాల్సి ఉంది. ఇంత విలువైన టెండర్‌ కావటంతో అధికార పార్టీ నేతలు పోటీపడుతున్నారు. టెండర్లను హస్తగతం చేసుకునేందుకు ఓ ఎమ్మెల్యే వర్గీయులు పావులు కదిపారు.



అడ్డుకుని.. ఆగమాగం..

ఈనెల ఒకటో తేదీన కేజీబీవీలు, 24 ఆదర్శ పాఠశాలలకు సరుకుల సరఫరాకు సమగ్రశిక్ష అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 8వ తేదీ వరకూ షీల్డ్‌ కవర్లలో టెండర్లు ఆహ్వానించారు. 70 వరకూ దరఖాస్తులిచ్చారు. 45 మాత్రమే టెండర్లు పడినట్లు సమాచారం. ఇంకా ఎక్కువగానే పడాల్సి ఉండగా.. ఆఖరి రోజున ఓ ఎమ్మెల్యే వర్గీయులు సమగ్రశిక్ష కార్యాలయానికి వచ్చి, హల్‌చల్‌ చేశారు. ఎవరూ టెండర్లు వేయకూడదంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులున్నా.. ఫలానా వారి మనుషులమంటూ దూకుడుగా టెండర్లు వేసే ఇతరులను సైతం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అదే పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి వర్గీయులు ఘాటుగా ఎమ్మెల్యే వర్గీయులకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల ఘర్షణతో సమగ్రశిక్ష ప్రాంగణం కాస్తా వేడెక్కింది. భారీగా కేకలు వేసుకోవటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో ఈనెల 9న డీపీసీ ఎదుట ఓపెన్‌ చేయాల్సిన టెండర్లను ఉన్నఫలంగా అధికారులు ఈనెల 11వ తేదీకి వాయిదా వేశారు. తర్వాత కూడా రాజకీయ ఒత్తిళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రస్తావనే లేకుండా చేశారు. రాప్తాడు, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, మడకశిర ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల వర్గాలు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఒత్తిళ్ల నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ వాయిదా వేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లే కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం సాకులు చెబుతున్నారు.




ఒత్తిళ్లు లేవు

ఏడాది కాలానికి సరుకుల సరఫరాకు రూ.12 కోట్లకు టెండర్లు పిలిచాం. అఽధికారులపై రాజకీయ ఒత్తిళ్లు లేవు. సంక్రాంతి సెలవులు, కోర్టు కేసులు, ఇతర సమస్యల కారణంగా టెండర్లు ఓపెన్‌ చేయలేదు. దానికి సంబంధించిన ఫైళ్లపై నాతో పాటు, డీఈఓ సంతకాలు చేశారు. జేసీ నిర్ణయం మేరకు త్వరలోనే టెండర్లు ఓపెన్‌చేస్తాం. 

- తిలక్‌ విద్యాసాగర్‌, ఏపీసీ


Updated Date - 2021-01-21T06:58:51+05:30 IST