పేదల రేషన్‌ బియ్యంతో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం

ABN , First Publish Date - 2021-08-06T06:31:17+05:30 IST

ఆయన ఖాద్రీశుడి ఆలయ చైర్మన్‌ హోదాలో స్వామివారికి ప్రథమ సేవకుడు. శ్రీవారి సేవలో పునీతులు కావాల్సిన కుమారుడేమో నారసింహుడికే లీలలు చూపించాడు.

పేదల రేషన్‌ బియ్యంతో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం
రైస్‌ మిల్లులో నిల్వ ఉంచిన బియ్యం

అధికారమే.. అండగా..!

పేదల రేషన్‌ బియ్యంతో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం

ఖాద్రీశుడి ఆలయ చైర్మన్‌  కుమారుడి బాగోతం బట్టబయలు

రైస్‌మిల్లులో 1645 బియ్యం బస్తాలు సీజ్‌

రేషన్‌ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి అమ్ముతున్నట్లు ఆరోపణలు

ముదిగుబ్బలో తీగలాగితే కదిరిలో కదిలిన డొంక 

శ్రీవారి సన్నిధి కలగలపు బియ్యమంటూ బుకాయింపు

కదిరి, ఆగస్టు 5: ఆయన ఖాద్రీశుడి ఆలయ చైర్మన్‌ హోదాలో స్వామివారికి ప్రథమ సేవకుడు. శ్రీవారి సేవలో పునీతులు కావాల్సిన కుమారుడేమో నారసింహుడికే లీలలు చూపించాడు. తన కల్తీ వ్యాపారానికి ఆలయ ప్రతిష్టను బజారుకీడ్చాడు. శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి కుమారుడు వెంకటేష్‌ కల్తీ బియ్యం వ్యాపారం చేస్తూ గురువారం పట్టుబడ్డాడు. పేదల బియ్యాన్ని అధికార పార్టీ అండతో సన్నబియ్యంగా మార్చి అమ్ముతున్న వైనం వెలుగుచూసింది. తన అక్రమాలు బట్టబయలు కావడంతో... శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కలగలుపు బియ్యం కొన్నామంటూ తప్పుడు పత్రాలను సృష్టించారు. పేదల బియ్యం అమ్ముతున్న దళారులను ముదిగుబ్బలో పట్టుకుని విచారించడంతో ఆలయ చైర్మన్‌ కుమారుడు వెంకటేష్‌ అక్రమ వ్యాపారం గుట్టు రట్టయ్యింది. 




అక్రమాలు బట్టబయలైంది ఇలా..

 పట్టణంలోని రాయచోటిరోడ్డులో ఉన్న వైసీపీ నాయకుడు, నరసింహస్వామి ఆలయ చైర్మన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి కుమారుడు వెంకటే్‌షకు చెందిన రైస్‌మిల్లు ఉంది. సాధారణంగా రైస్‌మిల్లులో వడ్లను బియ్యంగా మార్చి అమ్ముతుంటారు. కానీ అక్రమార్జనకు ఆశపడి అధికార పార్టీ అండదండలతో పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా మార్చి వివిధ బ్రాండ్‌ల పేరుతో కర్ణాటకకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ క్రమంలో ముదిగుబ్బలో దళారి గంగయ్య గురువారం 12 బస్తాల రేషన్‌ బియ్యాన్ని ఆటోలో కదిరికి తరలిస్తుండగా ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ పట్టుకున్నారు. దళారిని విచారించగా, కదిరిలోని వెంకటేష్‌ రైస్‌మిల్లుకు తరలిస్తున్నట్లు చెప్పాడు. ఎస్‌ఐ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఆయనతో పాటు అర్బన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ నిరంజన్‌రెడ్డి కదిరిలోని వెంకటేష్‌ రైస్‌మిల్లుకు వచ్చారు. అప్పటికే మరో ఆటో కూడా రేషన్‌ బియ్యాన్ని తీసుకొచ్చి అక్కడ అమ్మడానికి సిద్ధంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్‌ మారుతి విషయాన్ని ఆర్‌డీఓ వెంకటరెడ్డి దృష్టికి తీసుకుపోయారు. ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్‌ ముకుందను సంఘటన స్థలానికి పంపారు. అక్కడ ఉన్న స్టాక్‌ మొత్తాన్ని పోలీసులతో పాటు డీటీ పరిశీలించారు. కర్ణాటకకు తరలించడానికి సిద్ధంగా ఉన్న లారీలో వివిధ బ్రాండ్‌ల పేరుతో ప్యాక్‌ చేసి ఉన్న 500 బియ్యం బస్తాలు కూడా ఉన్నాయి. మిల్లులో వందల కొద్దీ బస్తాలు ఉన్నాయి. ఈ విషయంపై మిల్లు యజమాని వెంకటే్‌షను ప్రశ్నించారు. తాను ఇటీవలే 800 బస్తాలు శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కలగలుపు బియ్యాన్ని కొనుగోలు చేశానని చెప్పాడు. బియ్యాన్ని పరిశీలిస్తుండగానే తహసీల్దార్‌ మారుతి, డీఎస్పీ భవ్యకిశోర్‌లు మిల్లుకు చేరుకుని అధికారులకు సూచనలు చేశారు. తహసీల్దార్‌ మారుతి జిల్లా ఉన్నతాధికారులకు బియ్యం బస్తాల విషయం తెలపడంతో సీఎ్‌సడీటీ కళ్యాణ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి కదిరికి పంపారు. మధ్యా హ్నం 3 గంటల నుంచి అధికారులు మిల్లులో ఉన్న బి య్యం బస్తాలను లెక్కకట్టారు. 50 కిలోల బియ్యం బస్తాలు 1599,.. 25 కిలోల బియ్యం బస్తాలు 46 ఉన్నట్లు లెక్క తేల్చారు. వాటి నుంచి శ్యాంపిళ్లు సేకరించారు. అనంతరం సీఎ్‌సడీటీ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలను సీజ్‌ చేసి, శ్యాంపిల్స్‌ తీసుకున్నామన్నారు. పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతవరకు మిల్లులో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదన్నారు. బియ్యం బస్తాల స్టాక్‌ రిజిస్టర్‌, ఇతర ఎటువంటి రికార్డులు మిల్లులో ఉంచలేదని చెప్పారు. 


ఖాద్రీ ఆలయ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం

పట్టణంలోని శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రతిష్ట రాష్ట్ర నలుమూలలా ఎంతో పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కింది. సత్యదేవుడిగా స్వామివారికి పేరుంది. అటువంటి ఆలయ ప్రతిష్టను ఆలయ చైర్మన్‌ కుమారుడు వెంకటేష్‌ దిగజార్చే ప్రయత్నం చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. తన అక్రమ వ్యాపారానికి ఆలయాన్ని వాడుకోవడం తగదని వాపోతున్నారు. వెంకటేష్‌ తన మిల్లులో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని కప్పిపుచ్చుకోవడానికి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెరపైకి తెచ్చాడు. భక్తులు సమర్పించే కలగలుపు బియ్యం తనకు తెలిసిన వ్యక్తి టెండర్‌ పాడాడని, 2021 జూన్‌ 11న 50 కిలోల 800 బస్తాల బియ్యం కొనుగోలు చేసినట్లు తన అధికారాన్ని ఉపయోగించి లెటర్‌ తీసుకున్నారు. ఇందులో ఆలయ సూపరింటెండెంట్‌ రామలింగారెడ్డి సంతకం చేశారు. వాస్తవానికి ఆలయంలో ఉన్న బియ్యం లెక్కలకు, వారు ఇచ్చిన లెటర్‌లోని లెక్కలకు పొంతన లేదు. 2021 జూన్‌ 2న సీ రవీంద్ర కేరాఫ్‌ కే వెంకటేష్‌, కుమ్మరవాండ్లపల్లి, కదిరి పేరుతో 11,755 కిలోల కలగలుపు బియ్యాన్ని కిలో రూ.17.60లతో వేలం ద్వారా కొనుగోలు చేసినట్లు రసీదు ఇచ్చారు. ఇందుకు గాను వారు ఆలయానికి రూ.2,06,888 చెల్లించారు. అయితే మిల్లు యజమాని వెంకటేష్‌ మాత్రం 2021 జూన్‌ 11న 800 బస్తాలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నాడు. దీనిని బట్టి ఆయన అక్రమ వ్యాపారం తెలిసిపోతోంది. తన వ్యాపారానికి స్వామివారి ఆలయాన్ని కూడా వాడుకోవడంపై పలువురు తప్పు పడుతున్నారు. అధికార పక్షం అండతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 



పోలీసులకు తెలిసినా పట్టించుకోని వైనం 

పట్టణంలో జోరుగా సాగుతున్న రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారంపై ఈ నెల ఒకటో తేదీన మీడియా ద్వారా పట్టణ సీఐ శ్రీనివాసులుకు విషయం చేరవేశారు. ఎద్దుల బండిలో రేషన్‌ బియ్యాన్ని వెంకటేష్‌ రైస్‌మిల్లుకు తరలిస్తున్న ఫొటోలను వాట్సప్‌ ద్వారా సీఐకి పంపారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ఎక్కడా? ఏమిటీ? ఎలా చే స్తున్నారు? అంటూ హేళనగా మాట్లాడి ఫోన్‌ పెట్టేసినట్లు తెలిసింది. స్థానిక పోలీసుల అండతోనే రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగుతోందని, నెలవారీ మామూళ్లు కూడా అందుతున్నాయని  ప్ర తిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కడప జి ల్లా నుంచే కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా కదిరి ప్రాంతానికి రేషన్‌ బియ్యం చేరుతున్నాయని పేర్కొంటున్నారు. రూ. కోట్లలో వ్యాపారం జరుగుతోందని, రేషన్‌ బియ్యానికి పాలిష్‌ చేసి సన్న బియ్యంగా మార్చి అందమైన ప్యాకింగ్‌లు చేసి, వివిధ కంపెనీల బ్రాండ్‌లతో కర్ణాటకకు తరలిస్తున్నారని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 



Updated Date - 2021-08-06T06:31:17+05:30 IST