ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ దెబ్బ..!

ABN , First Publish Date - 2021-07-23T06:57:13+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ దెబ్బ పడింది.

ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ దెబ్బ..!
అనంతపురంలోని వెంకట్రావ్‌ నగర్‌లో సర్వర్‌ సమస్యతో వేచి ఉన్న కార్దుదారులు

మూడు రోజులుగా సతాయింపు 

సమస్యనుపరిష్కరించని యంత్రాంగం 

కార్డుదారులు, డీలర్లకు తప్పని ఇబ్బందులు

బియ్యం సరఫరాలోనూ జాప్యం

పలు షాపులకు ఇప్పటికీ చేరని దుస్థితి

అనంతపురం వ్యవసాయం, జూలై 22:  కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీకి సర్వర్‌ దెబ్బ పడింది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం ద్వారా బియ్యం కార్డులోని ఒక్కో సభ్యుడికి ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మూడు రోజులుగా ఎఫ్‌పీ షాపుల్లో డీలర్ల వేలిముద్రలతోనే బియ్యం పంపిణీ ప్రారంభించారు. తొలిరోజు నుంచి సర్వర్‌ సమస్యతో ఉచితబియ్యం పంపిణీకి ఆటంకం ఏర్పడింది. తెల్లవారుజామున, ఉదయమే షాపులు తెరిచినా.. పంపిణీ ముందుకు సాగడంలేదు. ఉదయం 8 గంటలకు తెరిచిన షాపుల్లో ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్‌ పడుతోంది. కార్డుదారుల వివరాలు నమోదు చేసేందుకు కూడా అవకాశం లేకుండా సర్వర్‌ పనిచేయడం లేదు. ఒక్కోసారి కార్డుదారుల వివరాలు నమోదు చేసేంత వరకు పనిచేసి, ఆ తర్వాత సమస్య ఏర్పడుతోంది. మళ్లీ ప్రయత్నించాలని చూపుతోంది. ఇలా పలు రకాలుగా సర్వర్‌ ఎర్రర్‌ చూపిస్తుండటంతో ఏం చేయాలో తోచని అయోమయంలో డీలర్లు కొట్టుమిట్టాడుతున్నారు. సర్వర్‌ సమస్యను పౌరసరఫరాల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేకుండా పోతోంది. ఎన్‌ఐసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామనీ, వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత చెబుతామని స్థానిక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌పీ షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు నిరీక్షించాల్సి వస్తోంది. మరికొంతమంది నిరాశగా ఇంటి ముఖం పడుతున్నారు. సర్వర్‌ బాగా పనిచేసినపుడు తామే సమాచారం ఇస్తామని కొందరు డీలర్లు.. కార్డుదారులకు సర్దిచెబుతూ కాలం వెల్లదీస్తున్నారు.


బియ్యం సరఫరాలోనూ జాప్యం

జిల్లావ్యాప్తంగా 3 వేల ఎఫ్‌పీ షాపులున్నాయి. వీటి పరిధిలో 12.27 లక్షల బియ్యం కార్డులున్నాయి. జిల్లాకు 18 వేల మెట్రిక్‌ టన్నుల ఉచిత బియ్యాన్ని కేటాయించారు. ఇప్పటిదాకా 2 వేల ఎఫ్‌పీ షాపులకు 14 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేసినట్లు పౌరసరఫరాల కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. మిగిలిన సరుకు ఇప్పటిదాకా షాపులకు చేరలేదు. ఉన్నట్లుండి ఉచిత బియ్యం పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు చెప్పడంతో బియ్యం సరఫరా చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు బియ్యం అందినా సర్వర్‌ సమస్యతో పంపిణీ ముందుకు సాగడం లేదు. కొన్ని షాపులకు నేటికీ బియ్యమే పంపకపోవడంతో ఆయా స్థానిక కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరుదాకా ఉచిత బియ్యం పంపిణీకి గడువు విధించారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా  90 వేల కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల అధికారులు పేర్కొంటున్నారు. సర్వర్‌ సమస్య ఇలాగే కొనసాగితే క్షేత్ర స్థాయిలో పేదలకు ఉచిత బియ్యం అందించడం సాధ్యంకాదన్న వాదనలు డీలర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సర్వర్‌ సమస్యను పరిష్కరించి, బియ్యం పంపిణీ సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.



ఉచిత బియ్యం వేయడం లేదు

మా ప్రాంతంలో ఉచిత బియ్యం వేయడం లేదు. సర్వర్‌ పనిచేయడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఇతర కార్డుదారులతోపాటు నేను రెండుసార్లు షాపు వద్దకెళ్లా. సర్వర్‌ పూర్తిగా పనిచేయకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చా. ఎప్పుడు సర్వర్‌ పనిచేస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

- వీరాంజనేయులు, చిన్నజలాలపురం, శింగనమల మండలం

Updated Date - 2021-07-23T06:57:13+05:30 IST