అతిథి అధ్యాపకుల ఆకలి కేకలు..!

ABN , First Publish Date - 2021-05-19T06:39:38+05:30 IST

అతిథి అధ్యాపకులు ఆకలి కేకలు పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో జీతాలు అందక కొందరు, ఉన్న ఉద్యోగాలు కూడా పోయి మరికొందరు అష్టకష్టాలు పడుతున్నారు.

అతిథి అధ్యాపకుల ఆకలి కేకలు..!

ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో 

వందలాది మంది లెక్చరర్లు

కొందరికి రెండేళ్లుగా అందని వేతనం

ప్రిన్సిపాళ్ల వైఖరితో మరికొందరి ఉద్యోగాలు గల్లంతు 

గంటల చొప్పున రెమ్యునరేషన్‌  

గొడ్డు చాకిరీ చేసినా... రూ.10 వేల నుంచి రూ.12 వేలలోపే..

 కరోనా నేపథ్యంలో బాధలు వర్ణనాతీతం


‘జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ 68 మంది అవసరం. అంతమంది అవసరం లేదంటూ కేవలం 22 మందిని కొనసాగిస్తున్నారు. ఉద్యోగులను రెన్యువల్‌ చేయాలంటూ 2020 నవంబరులోనే ఉత్తర్వులు ఇచ్చారు. అంతమంది వద్దంటూ 46 మందికి ఉద్వాసన పలికారు. పాపం.. వారు ఈ కరోనా కష్టకాలంలో జీవనోపాధి కోల్పోయారు’.


అనంతపురం విద్య, మే 18:  అతిథి అధ్యాపకులు ఆకలి కేకలు పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో జీతాలు అందక కొందరు, ఉన్న ఉద్యోగాలు కూడా పోయి మరికొందరు అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్నత చదువులు చదివినా.. పొంట నింపుకోవడం కష్టమవుతోందని కన్నీరు పెట్టుకుంటున్నారు. డిగ్రీ, పీజీ పట్టా చేతికొస్తే ఎలాగైనా పొట్ట నించుకోవచ్చు అనుకున్నారు. పరిస్థితులతో పోటీ పడి కొందరు, పస్తులుండి మరికొందరు ఎలాగైతేనేం డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వంటి పట్టాలు పొందారు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులుగా చేరారు. అయినా వారి పొట్ట నిండటం లేదు. కాదు ప్రభుత్వం, కొందరు ప్రిన్సిపాళ్లు వారి కడుపు నింపడం లేదు. ఒక వైపు రెగ్యులర్‌ అధ్యాపకులకు లక్షల్లో జీతాలు ఇస్తూ అతిథి అధ్యాపకులకు మాత్రం గంటల చొప్పున లెక్కలు కడుతూ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు మించి ఇవ్వడం లేదు. ఇదీ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లోని అధ్యాపకుల పరిస్థితి. కొన్నిచోట్ల ప్రిన్సిపాళ్ల పుణ్యమా అని రెండేళ్లుగా కొందరు జూనియర్‌ కళాశాలల అతిథి అధ్యాపకులకు జీతాలు అందలేదంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  కరోనా వల్ల రెండేళ్లుగా కొందరు ఉద్యోగాలు కూడా కోల్పోయారు. పైౖగా చేసిన దానికి కొందరు ప్రిన్సిపాళ్లు సకాలంలో బిల్లులు పెట్టకపోవడంతో వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


2019 నుంచి వేతనాల్లేవ్‌..

జిల్లావ్యాప్తంగా అన్ని మేనేజ్‌మెంట్లలో 236 జూనియ ర్‌కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో సిబ్బంది కొరత నేపథ్యంలో అతిథి అధ్యాపకులను నియమించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 25 నుంచి 30 మంది వరకూ పనిచేస్తున్నారు. గంటకు రూ.150 చొప్పున నెలలో 72 గంటలకు రూ.10 వేలకు మించకుంగా గౌరవ వేతనం అందిస్తున్నారు. ఇటీవల గంటకు రూ.375 గౌరవ వేతనం లెక్కన నెలకు రూ.27 వేలు అందించాలంటూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అది ఎక్కడా అమలు చేయడంలేదు. చాలామంది అధ్యాపకులకు వేతనా లు రెండేళ్లుగా అం దడం లేదు. రాష్ట్రం లో 2019 జులై 1 నుంచి 2021 మే 3 వరకూ పనిచేసిన వారికీ వేతనాల్లేవు. దీంతో అనేక ఇబ్బందుల నడుమ ఆకలితో కడుపులు మాడ్చుకుంటూ పాఠాలు చెబుతున్నారు.


ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో..? 

డిగ్రీ కళాశాలల్లో సైతం గెస్ట్‌ లెక్చరర్ల బాధలు వర్ణనాతీతం. జిల్లాలో 13 కళాశాలలుండగా.. 135 మంది వరకూ పనిచేస్తున్నారు. వీరికి గంటకు రూ.200 చొప్పున నెలకు 72 గంటలకు లెక్క కట్టి, రూ.14400కి మించకుం డా ప్రభుత్వం చెల్లిస్తోంది. వారు లక్ష, లక్షన్నర జీతం తీసుకునే రెగ్యులర్‌, రూ.50 వేల వరకూ తీసుకునే కాంట్రాక్టు వారితో సమానంగా పనిచేస్తున్నారు. వారికి రూ.14400 కూడా సక్రమంగా చెల్లించడం లేదు. కొందరు ప్రిన్సిపాళ్లు విపరీత ధోరణితో సెలవులు, పండుగలు ఇలా రోజులు లెక్కకట్టి వారి చేతికి రూ. 10వేల నుంచి 12 వేలు మాత్రమే అందిస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని దుస్థితి. ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజ్‌లో గతేడాది కొవిడ్‌ సమయంలో 5 నెలల జీతం పెండింగ్‌ పెట్టారు. ఇతర కళాశాలల్లో ఉద్యోగులకు చెల్లించినా ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. ఇలా చాలా కళాశాలల్లో అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు.


కొందరు అధికారుల వైఖరితో..

కొందరు ప్రిన్సిపాళ్లు, మరికొందరు అధికారుల వైఖరి వల్ల డిగ్రీ, జూనియర్‌ కళాశాల్లో గెస్ట్‌ లెక్చరర్లు ఇబ్బందు లు పడుతున్నారు. కొందరు ప్రిన్సిపాళ్లు కళాశాలలో ఫండ్‌ ఉన్నా... వేతనాలు చెల్లించడం లేదు. డీవీఈఓ నుంచి అ నుమతి రావాలని కొందరు, సెలవుల్లో పని చేయాలని కొందరు, ప్రభుత్వ నిబంధనల పేరు చొప్పి వేతనాలు సకాలంలో ఇవ్వకుండా అధ్యాపకులను ఇబ్బంది పెడుతు న్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా ప్రశ్ని ద్దాం అనుకుంటే... ఎక్కడ విధుల నుంచి తొలగిస్తారో..? మళ్లీ విధుల్లోకి తీసుకుంటారో లేదోనన్న భయంతో నెట్టుకొ స్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఉ ద్యోగ భద్రతతో పాటు, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.



2019 నుంచి అందలేదు

రాష్ట్రంలో కొత్తగా 20 కళాశాలలు ఏర్పాటు చేశారు. అ ప్పుడు విధుల్లో చేరాం. రెండేళ్లుగా వేతనాలు చెల్లించలేదు. ఇలా అయితే ఎలా బతికేది? ప్రభుత్వం ఇప్పటికైనా మా కష్టాలు గుర్తించి, జీతాలివ్వాలి.

- శ్రీనివాసులు, హిస్టరీ లెక్చరర్‌


అప్పులు చేసి.. బతకాల్సి వస్తోంది

నేను ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. గతేడాది నుంచి వేతనం చేతికి అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇప్పటికైనా మాకు వేతనాలు చెల్లించి, న్యాయం చేయాలి.

- భారతి, ఇంగ్లీష్‌ లెక్చరర్‌



అందరినీ రెన్యువల్‌ చేయాలి

గంటకు రూ.200 చొప్పున అతిథి అధ్యాపకులకు చెల్లిస్తున్నారు. గతేడాది అది కూడా సక్రమంగా చెల్లించలేదు. రెన్యువల్‌ చేయాలని ఉత్తర్వులు వచ్చినా కొందరినే చేశారు. అందరినీ రెన్యువల్‌ చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు, సమానపనికి సమానవేతనం ఇవ్వాలి. 

-రమేష్‌, అతిథి అధ్యాపకుల సమన్వయకర్త

Updated Date - 2021-05-19T06:39:38+05:30 IST