ప్రచార హోరు..!

ABN , First Publish Date - 2021-03-07T07:13:03+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ముఖ్యనేతల ప్రచారం హోరెత్తుతోంది.

ప్రచార హోరు..!

మున్సిపోల్స్‌లో టీడీపీ, వైసీపీ హోరాహోరీ

రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు

అందరిచూపూ చైర్మన్‌ పీఠంపైనే..

ప్రభుత్వ వైఫల్యాలే టీడీపీ అజెండా

తాడిపత్రిలో జేసీ, పెద్దారెడ్డి మధ్య

 నువ్వా.. నేనా.. అన్నట్లు పోటీ

కళ్యాణదుర్గంలో ఉమా ఒంటరిపోరు

రాయదుర్గం, హిందూపురం మున్సిపాలిటీల్లో

కుర్చీ నిలుపుకునేందుకు బాలయ్య, కాలవ కసరత్తు

ధర్మవరంపై గురిపెట్టిన పరిటాల సునీత, శ్రీరామ్‌

కదిరిలో పాగా వేసేందుకు కందికుంట ఎత్తులు

కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తిపై జేసీ పవన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

అనంతపురం, మార్చి6(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ముఖ్యనేతల ప్రచారం హోరెత్తుతోంది. గెలుపు తమదంటే.. తమదేనంటూ ఎవరికి వారు ధీమా వ్య క్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల నేతలు వారి వారి అభ్యర్థుల గెలుపునకు ప్రచార హోరును పెంచారు. ఇంటింటికీ వెళ్లి, కరపత్రాలు అందజేసి, తమ పార్టీల గుర్తులపై ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీంతో జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో రాజకీయ వేడి తారస్థాయికి చేరుతోంది. సోమవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు, ఆయా మున్సిపాల్టీల పరిధిలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతలతో కలిసి రోడ్‌షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమయ్యాయి. పార్టీ అధిష్టానం ముందు తలెత్తుకోవాలన్నా.. నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలన్నా.. వారి వారి పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయమే ఏకైక మార్గం. ఈ నేపథ్యంలో ఓట్లు కొనుగోలు చేసైనా, అధికార దర్పాన్ని ప్రదర్శించైనా, పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్ర త్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరించైనా మున్సిపాల్టీల్లో చైర్మన్‌ స్థానాలను కొల్లగొట్టాలన్న దిశగానే వారి చర్యలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా నవరత్నాల అమలు మినహా.. పట్టణ ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్న విమర్శలను అధికార పార్టీ నేతలు ఎదుర్కొంటుండటమే టీడీపీ నేతల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులు సర్వశక్తులూ ఒడ్డాల్సి వస్తోంద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నేతలు వ లంటీర్లను అడ్డుపెట్టుకుని, రాజకీయం చేస్తుండటం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీనికితోడు ఎన్నికల నిబంధనలను అధికార పా ర్టీ నేతలు ఉల్లంఘించినా.. వందలాది మందితో ప్ర చారం నిర్వహించినా.. యం త్రాంగం మిన్నకుండిపోతుండటం.. ప్రతిపక్షాలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే కేసులు న మోదు చేస్తుండటంపై.. వి మర్శలు వ్యక్తమవుతున్నా యి. టీడీపీ నేతలు మాత్రం మున్సిపాలిటీల్లో ఆ పార్టీ జెండాను ఎగురవేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఎదుర్కొంటూనే.. అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు గడపగడపనూ తాకుతూ.. ఓట్లు అభ్యర్థిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా ఓట్లు అభ్యర్తిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా ప్రచారం చేస్తూ నువ్వా.. నే నా.. అన్న రీతి లో ఆయా ము న్సిపాలిటీల్లో దూ కుడు పెంచారు. ఇలా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు చైర్మన్‌ పీఠంపైనే గురి పెట్టాయి.


మున్సిపాలిటీల్లో పోటీ ఇదీ..

జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌తోపాటు 8 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలున్నాయి. అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ, టీడీపీ మధ్య బిగ్‌ఫైట్‌ నడుస్తోంది. ఇక మున్సిపాలిటీల విషయానికొస్తే.. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్యే మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయా.. అన్న తీరుగా అక్కడి ప్రచారం హోరెత్తుతోంది. మున్సిపాలిటీలో తన పట్టును మరోసారి నిలుపుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈసారి మున్సిపాలిటీలో పాగా వేసేందుకు ఊవ్విల్లూరుతున్నారు. 36 వార్డుల్లో ఇప్పటికే వైసీపీకి రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని వార్డులకు వైసీపీ అభ్యర్థులుండగా.. 31 చోట్ల టీడీపీ వారు బరిలో ఉన్నారు. మిత్రపక్షాలతో కలిపి జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేసే దిశగా.. వ్యూహానికి పదును పెడుతున్నారు.


రాయదుర్గం, హిందూపురం మున్సిపాలిటీల్లో మరోసారి చైర్మన్‌ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ఎమ్మెల్యే బాలయ్య, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. వారివారి మున్సిపాలిటీల్లో పాగా వేశారు. ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ.. ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతున్నారు. స్థానికంగా వైసీపీ నేతల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాత్మకంగా సాగుతున్నారు. హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, రాయదుర్గంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆయా మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను సాధించుకుని, పీఠం ఎక్కాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు.


- ధర్మవరం మున్సిపాలిటీలో పాగా వేసేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌లు రంగంలోకి దిగారు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో 40 వార్డులుండగా.. ఇప్పటికే 10 వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 27 వార్డుల్లోనే టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిగిలిన మిత్రపక్షాలను గెలిపించుకుని, మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగురుతుందన్న ధీమాలో ఉన్నారు.

- కళ్యాణదుర్గం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు స్థానిక నేతలతో కలిసి ఒంటరి పోరు సాగిస్తున్నారు. వైసీపీలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది టీడీపీకి లాభం చేకూర్చే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం పట్టణవాసుల్లో వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీలో 24 వార్డులుండగా.. అన్నింటికీ ఇరు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సై అంటే సై అన్న చందంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి.


- కదిరి మున్సిపాలిటీపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ గురిపెట్టారు. మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. మెజార్టీ ఓటర్లు ముస్లింలు ఉండటంతో ఆ వర్గాల ఓట్లను పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా మారేలా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశగా.. ఉన్నాయన్న అభిప్రాయం స్థానిక ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది. దీనికి తోడు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్న విమర్శలను స్థానిక అధికార పార్టీ నేతలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశం ప్రధానంగా టీడీపీకి కలిసొచ్చేలా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


- గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీల్లోనూ టీడీపీ జెండా ఎగురవేసేందుకు ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జితేంద్రగౌడ్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ స్థానిక నేతలతో కలిసి వేర్వేరుగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వ.. ప్రజావ్యతిరేక విధానాలే ప్రచారాస్ర్తాలుగా సంధిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌రెడ్డి కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆయా మున్సిపాలిటీల్లో రెండ్రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. స్థానిక నేతలతో కలిసి, అభ్యర్థులను వెంటబెట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ టీడీపీకి ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు.

Updated Date - 2021-03-07T07:13:03+05:30 IST