నోడల్‌ అధికారులు!

ABN , First Publish Date - 2021-05-15T06:43:23+05:30 IST

జిల్లాలో వింత నాటకం, పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ కరోనా బాధితులు ఇబ్బంది పడకుండా ఉండాలని పర్యవేక్షణ పెంచారు.

నోడల్‌ అధికారులు!

ఫోన్లు ఎత్తరు... బాధలు వినరు..

కొవిడ్‌ ఆస్పత్రుల్లో తీరని సమస్యలు 

ప్రభుత్వాస్పత్రుల్లో దుర్భరం

ప్రైవేటు ఆస్పత్రులపై కనిపించని నిఘా

యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ

అందరి మధ్య నలిగిపోతున్న కరోనా బాధితులు


 మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌తో తీవ్ర అయాసం, దగ్గుతో బాధపడుతూ ధర్మవరం నుంచి చికిత్స కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికొచ్చిన ఓ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్ప్‌డెస్క్‌ వద్దే ఉన్నారు. బెడ్లు లేవని చేర్చుకోలేదు. ఆయనతోపాటు మరో 50 మంది అక్కడే పడిగాపులు కాశారు. నోడల్‌ ఆఫీసర్‌కు తమ గోడు చెప్పుకోవాలని ఫోన్లు చేశారు. అక్కడి నుంచి స్పందన లేదు. చివరకు ఆయనకు పల్స్‌ రేట్‌ పడిపోవడంతో జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీ వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడికొచ్చిన గంటలోనే వైద్యం, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోయాడు.


జిల్లా సర్వజనాస్పత్రిలో కనీసం కూర్చోడానికి అవకాశం లేదు. రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. బెడ్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బెడ్డు ఇచ్చి, ఆక్సిజన్‌ అందించి ప్రాణాలు కాపాడాలని ఐదు రోజుల క్రితం అనంతపురం నగరానికి చెందిన ఓ బాధితుడి తండ్రి నోడల్‌ ఆఫీసర్‌కు ఫోన్‌ చేశాడు. అక్కడి నుంచి సమాధానం లేదు. దీంతో అక్కడే అవస్థలు పడుతూ చివరకు పరిస్థితి విషమించడంతో వైద్యులు అప్పుడు స్పందించి మంచంలో పడుకోబెట్టి చికిత్సలు అందించేందుకు ప్రయత్నించారు. అయినా ఆయన ప్రాణాలు కోల్పోయాడు.


అనంతపురం వైద్యం, మే14: జిల్లాలో వింత నాటకం, పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ కరోనా బాధితులు ఇబ్బంది పడకుండా ఉండాలని పర్యవేక్షణ పెంచారు. ఇందుకోసం ప్రతి కొవిడ్‌ ఆస్పత్రికీ ఓ నోడల్‌ ఆఫీసర్‌ను నియమించారు. జిల్లాలో 61 కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేసి, బాధితులకు చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు. ఇందులో ప్రభుత్వాస్పత్రులు జిల్లా సర్వజన, సూపర్‌ స్పెషాలిటీ,కేన్సర్‌ ఆస్పత్రి, హిందూపురం ఆస్పత్రి, కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులు కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి డీఈఓ శామ్యూల్‌, కేన్సర్‌ ఆస్పత్రికి డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా సర్వజనాస్పత్రికి అనంత నగర పాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, హిందూపురం ప్రభుత్వాస్పత్రికి సబ్‌ కలెక్టర్‌ నిశాంతి, గుంతకల్లు ఆస్పత్రికి తహసీల్దార్‌ మునివేలు, కదిరి ఆస్పత్రికి ఆర్డీఓ వెంకటరెడ్డి నోడల్‌ ఆఫీసర్లుగా కొనసాగుతున్నారు. బత్తలపల్లి ఆర్డీటీ, పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతోపాటు జిల్లా కేంద్రంలో దాదాపు 40, హిందూపురం 5, కదిరి 3, గుంతకల్లు 3, తాడిపత్రి 2 చొప్పున ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు అధికారికంగా ఆమోదం ఇచ్చారు. ఇక్కడ రోగులకు సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించేందుకు ఒక్కో ఆస్పత్రికి ఒక్కో శాఖకు చెందిన ఉన్నతాధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ నియమించారు. ఇవే కాకుండా ఆక్సిజన్‌ సరఫరా, వినియోగం, భోజనం, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లపై పర్యవేక్షణకు నోడల్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. నోడల్‌ ఆఫీసర్లు నిస్తేజంగా ఉండిపోతున్నారు. ఆయా ఆస్పత్రులకు వెళ్లిన బాధితులు తమ బాధలు చెప్పుకోవడానికి ఫోన్లు చేసినా ఎత్తడం లేదు. వారి బాధలు వినే పరిస్థితి జిల్లాలో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది ఫోన్లు చేసి, నోడల్‌ ఆఫీసర్ల నుంచి స్పందన లేకపోవటంతో తమ సమస్యలు ఎవరు తీరుస్తారని ఆయా ఆస్పత్రుల వద్ద వాపోతున్నారు. అక్కడున్న ఆస్పత్రుల డాక్టర్లు, వైద్య సిబ్బందితో తమను చేర్చుకుని, వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కొందరు, తమ బాధలు తీర్చాలని మరి కొందరు వేడుకుంటున్నారు. వారు ఏమాత్రం కనికరించడం లేదు. గట్టిగా అడిగితే నోడల్‌ ఆఫీసర్‌కు చెప్పుకోండని చెప్పి తప్పించుకుంటున్నారు. నోడల్‌ ఆఫీసర్లు ఫోన్లు ఎత్తరు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధితులు అల్లాడిపోతున్నారు. కొందరు నోడల్‌ ఆఫీసర్లు కేంద్రాల వద్దకు కూడా వెళ్లడం లేదన్న విమర్శలున్నాయి. కొందరిని మధ్యవర్తలుగా పెట్టుకుని, ఫోన్లలో వారితో మాత్రమే మాట్లాడి కాలం గడుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల కష్టాలు దుర్భరంగా ఉన్నాయి. అయినా నోడల్‌ ఆఫీసర్లు ఏమాత్రం మానవత్వంతో స్పందించకపోవడం, వారికి అవసరమైన వసతులు, వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు మూట కట్టుకుంటున్నారు.


ప్రైవేటులో దోపిడీ

ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో రకంగా బాధితులను వేధించి, చంపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ నిబంధనల మేరకు కొవిడ్‌ సేవలు అందించాలి. వీటిని పక్కాగా నోడల్‌ ఆఫీసర్లు పర్యవేక్షించి, బాధితులకు సమస్యలు లేకుండా చూడాలి. ప్రైవేటు ఆస్పత్రులకు ఏర్పాటు చేసిన నోడల్‌ ఆఫీసర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఆస్పత్రుల వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో బెడ్లు ఉన్నా లేవని అధిక ధరలకు కేటాయించి దోచుకుంటున్నారు. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు బాధితుల పేరుతో తీసుకొచ్చి, ఎక్కువ ధరకు ఇతరులకు వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే మూడు ఆస్పత్రులపై విజిలెన్స్‌, స్థానిక పోలీసులు, డ్రగ్స్‌, వైద్య శాఖ అధికారులు దాడులు చేశారు. మూడు ఆస్పత్రుల్లో అధిక ఫీజులతోపాటు అనధికారికంగా రోగులకు చికిత్సలు, రెమ్‌డిసివిర్‌ ఎక్కువ ధరకు వినియోగించడం అవి కూడా ఇతరుల పేరుతో తీసుకొచ్చి, మరొకరికి ఇచ్చినట్లు బయటపడ్డాయి. ఇప్పటికే మూడు ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ లెక్కన ప్రైవేటులో ఏ స్థాయిలో దోపిడీ సాగుతుందో తెలుస్తోంది. వీటిని పర్యవేక్షించే నోడల్‌ ఆఫీసర్లు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులతో చేతులు కలిపి, దోపిడీకి సహకరిస్తున్నారా అన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తమ్మీద నోడల్‌ ఆఫీసర్ల వ్యవహారం జిల్లాలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఉన్నతాధికారులు ఈ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టి, కరోనా బాధితుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు. ఆ దిశగా అధికారులు, పాలకులు అడుగులు వేస్తారని ఆశిద్దాం.

Updated Date - 2021-05-15T06:43:23+05:30 IST