ఆశలు గల్లంతు..!

ABN , First Publish Date - 2020-10-31T09:40:04+05:30 IST

గంపెడాశలతో రబీలో విత్తిన పప్పుశనగ మొలకెత్తలేదు. ఈ సారి సీజన్‌కు ముందే వర్షాలు రావటంతో రైతులు ఆనందించారు.

ఆశలు గల్లంతు..!


తాడిపత్రి, పుట్లూరు మండలాల్లో మొలకెత్తని పప్పుశనగ 

భారీ వర్షాలతో 20 వేల ఎకరాల్లో నష్టం 

సబ్సిడీ విత్తనం నాణ్యతపైనా అనుమానాలు 

కరువు రైతులకు తప్పని కన్నీరు


అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 30 : గంపెడాశలతో రబీలో విత్తిన పప్పుశనగ మొలకెత్తలేదు. ఈ సారి సీజన్‌కు ముందే వర్షాలు రావటంతో రైతులు ఆనందించారు. జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి భూముల్లో కొందరు ముం దస్తుగా విత్తనం వేశారు. మరికొందరు సబ్సిడీ విత్తనం తీసుకొని విత్తుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈనెల 15 నుంచి విత్తిన పప్పుశనగ పంట మొలకెత్తలేదు. ఆయా సమయాల్లో పప్పుశనగ విత్తనం వేసిన తర్వాత అల్పపీడన ప్రభావంతో వరుసగా భారీ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో పొలాలు పైపెట్టు(భూమి పైపొర గట్టిపడటం)కు గురయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో సబ్సిడీ విత్తనం నాణ్యతపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సబ్సిడీతో విత్తన శుద్ధి మందు ఇవ్వలేదు. దీంతో కొందరు రైతులు విత్తనశుద్ధి చేయకనే విత్తుకున్నారు. సాధారణంగా విత్తిన ఐదు నుంచి వారం రోజుల్లోగా పం ట మొలకెత్తాలి. అయితే విత్తనం వేసి పక్షం రోజులు గడుస్తున్నా మొలకెత్తకపోవడం గమనార్హం. కారణాలేవైనా అప్పు చేసి విత్తుకున్న పంట మొలకెత్తకపోవడంతో కరువు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.  


విత్తన తర్వాత భారీ వర్షాల ప్రభావం 

రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో నల్లరే గడి భూముల్లో ఎక్కువ శాతం పప్పుశనగ సాగు చేస్తున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.20 లక్షల హెక్టార్లు. అందులో పప్పుశనగ 75 వేల హెక్టార్లుగా ఉంది. గతేడాది ఏకంగా 90 వేల హెక్టార్లలో  పప్పుశనగ సాగు చేశారు. ఈ సారి అదే స్థాయిలో పప్పుశనగ సాగయ్యే అవకా శాలున్నాయి. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తంగా 30 వేల హెక్టార్లకుపైగా పప్పుశనగ సాగైనట్లు సమాచారం. తాడిపత్రి, పుట్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఈనెల 15 నుంచి 20వ తేదీలోపు సబ్సిడీ పప్పుశనగ విత్తనాన్ని విత్తుకున్నారు.


తాడిపత్రి, పుట్లూరు మండలాల పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల వరకు పప్పుశనగ పంట మొలకెత్తలేదు. తాడిపత్రి మండలంలోని పెద్దపొడమల, చిన్నపొడమల, కోమలి, చిన్నపల్లి, రావివెంకటాంపల్లి, ఎర్రగుంటపల్లి, తేరన్నపల్లి, దిగువపల్లి, ఎగువపల్లి తదితర గ్రామాలు, పుట్లూరులో మరికొన్ని గ్రామాల్లో పప్పుశనగ పంట మొలకెత్తలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోను ఇదే దుస్థితి నెలకొంది. విత్తనం వేసిన తర్వాత భారీ వర్షాలు పడటంతో పొలాలు పైపెట్టుకు గురై విత్తనం మొలకెత్తకుండా పోయిందని కొందరు రైతులు వాపోతున్నారు. మరికొందరు నాణ్యం గా లేకపోవడంతోనే తమ పొలాల్లో విత్తనం మొలకెత్తలేదని ఆవేదన చెందుతున్నారు. ఎకరా పొలంలో 40 కేజీల నుంచి 50 కేజీల వరకు పప్పుశనగ విత్తనాలు విత్తుకున్నారు. ఎకరా పొలంలో విత్తనాలకు రూ.3 వేలు, విత్త నం విత్తే మనిషికి రూ.600, దుక్కిలో ఎరువులకు రూ.3 వేలు,  ముందస్తు సేద్యాలు, విత్తేందుకు రూ.3,400 దాకా ఖర్చు వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు దాదాపు రూ.10 వేలు వరకు ఖర్చు చేశారు. విత్తనం మొలకెత్తకపోవడంతో పెట్టుబడి ఖర్చు పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మొలకెత్తలేదు ..

7.30 ఎకరాల్లో శనగ విత్తనం వేశా. ఎకరాకు విత్తనంతోపాటు ఇతర రకాల ఖర్చులకు రూ.10 వేల దాకా పెట్టుబడి పెట్టా. ఈ సారి వర్షాలు బాగా పడటంతో ఎంతో ఆశతో శనగ పంట వేశా. పంట వేసిన తర్వాత భారీ వర్షాలు పడ్డాయి. సబ్సిడీతో తీసుకొచ్చిన శనగ నాణ్యత లేకపోవడం కూడా మొలకెత్తకపోవడానికి ఓ కారణమే. శనగ పంట పెట్టుబడి ఖర్చులు పూర్తిగా పోయినట్లే. ప్రభుత్వమే ఆదుకోవాలి. 


ఎప్పుడు ఇలా జరగలేదు.. రైతు నాగరాజు, పెద్ద పొడమల, తాడిపత్రి మండలం

4.30 ఎకరాల్లో శనగ పంట వేశా. విత్తనం వేసి పక్షం రోజులు గడుస్తోంది. ఇప్పటిదాకా పొలంలో శనగ విత్తనా లు మొలకెత్తలేదు. కారణాలేమిటో అర్థం కావడం లేదు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ప్రభుత్వం స్పందించి మొలకెత్తకపోవడంపై వ్యవసాయశాస్త్రవేత్తలతో పరిశీలన చేయించాలి. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలి. మొలకెత్తని రైతులకు మళ్లీ సబ్సిడీతో శనగ విత్తనాలు అందించి ఆదుకోవాలి.  

Updated Date - 2020-10-31T09:40:04+05:30 IST