సబ్సిడీ పప్పుశనగపై నిరాసక్తి

ABN , First Publish Date - 2020-10-30T09:21:37+05:30 IST

సబ్సిడీ పప్పుశనగపై అన్నదాతలు నిరాసక్తి చూపుతున్నారు. కొన్నేళ్లుగా పప్పుశనగ సాగు చేసినా ధరలు తక్కువగా ఉండటంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

సబ్సిడీ పప్పుశనగపై నిరాసక్తి

 పలు కారణాలతో ముందుకురాని రైతులు 
 బహిరంగ మార్కెట్‌లోనే ఎక్కువగా కొనుగోలు 
 ఆలస్యంగా పంపిణీ, షరతులతో విసిగిన వైనం 
 నేటితో ముగియనున్న పంపిణీ

అనంతపురం వ్యవసాయం, అక్టోబరు 29 : సబ్సిడీ పప్పుశనగపై అన్నదాతలు నిరాసక్తి చూపుతున్నారు.  కొన్నేళ్లుగా పప్పుశనగ సాగు చేసినా ధరలు తక్కువగా ఉండటంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. అయినా ప్రతి ఏడాది రబీ సీజన్‌లో ఆశించిన స్థాయిలో పప్పుశనగ సాగు చేస్తూనే ఉన్నారు. ఈ సారి సబ్సిడీ విత్తన పంపిణీ ఆలస్యంగా ప్రారంభించడంతోపాటు పలు రకాల షరతులు విధించడం, బహిరంగ మార్కెట్‌ ధరలకు పెద్దగా వ్యత్యాసం లేకపోవడం తదితర కారణాలతో విత్తనం కోసం రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో నల్లరేగడి భూముల్లో ఎక్కువ శాతం పప్పుశనగ సాగు చేస్తున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.20 లక్షల హెక్టార్లు, అందులో పప్పుశనగ 75 వేల హెక్టార్లుగా ఉంది. గతేడాది ఏకంగా 90 వేల హెక్టార్లల్లో పప్పుశనగ సాగు చేశారు. ఈ సారి అదే స్థాయిలో పప్పుశనగ సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తంగా 30 వేల హెక్టార్లకుపైగా పప్పుశనగ సాగైనట్లు సమాచారం. ఈనెలలో వరుస వర్షాలు పడటంతో పలు ప్రాంతాల్లో విత్తనం వేయలేదు. పొలాల్లో పదును ఆరిన తర్వాత ఆశించిన స్థాయిలో పప్పుశనగ సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాల అభిప్రాయం. 


బహిరంగ మార్కెట్‌లోనే ఎక్కువగా కొనుగోలు 
ఈ ఏడాది రబీ సీజన్‌కు ముందస్తుగా భారీ వర్షాలు పడ్డాయి. సీజన్‌ ఆరంభమైన తర్వాత కూడా భారీగా వర్షాలు పడ్డాయి. ముందస్తు వర్షాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పప్పుశనగ విత్తనం విత్తుకున్నారు. ప్రతి ఏడాది రబీ సీజన్‌ ఆరంభంలోనే విత్తన పంపిణీ మొదలు పెట్టేవారు. ఈసారి ఈనెల 13వ తేదీ నుంచి రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ ప్రారంభించారు. అందులోను ముందస్తుగా రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకొని డబ్బులు కట్టిన తర్వాత కొద్ది రోజులకు విత్తనాన్ని పంపిణీ చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో పంపిణీలో పలు రకాల షరతులు విధించారు. ఈ ఏడాది పప్పుశనగ సబ్సిడీ ధరను ప్రభుత్వం తగ్గించింది. గతంలో 40 శాతం ఉంటే ఈసారి 30 శాతం మాత్రమే వర్తింపజేశారు.


సబ్సిడీపోను క్వింటాల్‌ పప్పుశనగ ధర రూ.5250లుగా నిర్ణయించారు. విత్తన పంపిణీ ప్రారంభించకముందు బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌ ధర రూ.6 వేలు ఉండేది. ఆ తర్వాత   ధర రూ.5500కు తగ్గింది.  కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మ రింత తక్కువ ధరకే విత్తన పప్పుశనగ లభించడంతో ఆయా ప్రాంతాల రైతులు అక్కడే కొనుగోలు చేసినట్లు సమాచారం. సీజన్‌కు ముందే వర్షాలు బాగా పడటంతో పలు ప్రాంతాల్లో ముందస్తుగానే బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు. సబ్సిడీ విత్తనం ప్రా రంభించిన తర్వాత బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే పెద్దగా ధరలు తేడా లేకపోవడం, అనుకున్న సమయానికి విత్తనం అందించలేకపోవటం, పలు రకాల షరతులు విధించడంతో  వేలాది మంది రైతులు బహిరంగ మార్కె ట్‌లో విత్తనం కొనుగోలు చేశారన్న అభిప్రాయాలు వినిపి స్తున్నాయి. 

 
 19 వేల క్వింటాళ్లే పంపిణీ  
ఈ ఏడాది జిల్లాకు 51680 క్వింటాళ్ల పప్పుశనగ విత్తనం కేటాయించారు. గత ఏడాది ఏకంగా 69 వేల క్వింటాళ్లకుపైగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సారి అనూహ్యంగా పంపిణీ శాతం తగ్గింది. ఈనెల 13వ తేదీ పంపిణీ మొదలుపెట్టారు. పంపిణీ ఆరంభం నుంచి ఇప్పటి దాకా 23172 మంది రైతులు  22 వేల క్వింటాళ్ల కోసం పేర్లు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. వీరిలో 20897 మంది రైతులు 20 వేల క్వింటాళ్లకు డబ్బులు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి దాకా 19732 మంది రైతులకు 19 వేల క్వింటాళ్లు పప్పుశనగ పంపిణీ చేశారు. రైతుల నుంచి పెద్దగా స్పందనలేకపోవడంతో శుక్రవారంతో పంపి ణీ ముగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఆఖరు గడువుకు మరొక్క రోజే అవకాశం ఉన్నా రైతుల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. సబ్సిడీ పప్పుశనగ కోసం రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వ్యవసాయ, ఏపీసీడ్స్‌ అధికారులు, విత్తన సరఫరాదారులు అయోమయంలో పడ్డారు. 

Updated Date - 2020-10-30T09:21:37+05:30 IST