కట్నం వేధింపులకు మహిళ బలి

ABN , First Publish Date - 2020-10-01T09:46:21+05:30 IST

మండలంలోని పెద్దకొట్టాల పల్లిలో చైతన్య లక్ష్మి (25) అనే వివాహిత వరకట్నం వేధింపులు తాళలేక మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ గోపి తెలిపిన వివరాల మేరకు...

కట్నం వేధింపులకు మహిళ బలి

విడపనకల్లు,సెప్టెంబరు30: మండలంలోని పెద్దకొట్టాల పల్లిలో చైతన్య లక్ష్మి (25) అనే వివాహిత వరకట్నం వేధింపులు తాళలేక మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ గోపి తెలిపిన వివరాల మేరకు... కర్ణాటకలోని కంప్లి కొట్టాల గ్రామానికి చెందిన నరసింహులు, సరిత దంపతుల కుమార్తె చైతన్యలక్ష్మిని, మండలంలోని కొట్టాలపల్లికి చెందిన గురుమూర్తి, సుజాతమ్మ దంపతుల కుమారుడు రంగనాథ్‌కు ఇచ్చి ఐదేళ్ల కిత్రం వివాహం చేశారు. వివాహ సమయంలో కట్న కానుకల కింద 30తులాల బంగారం, రెండెకరాల మాగాణి ఇచ్చారు.


అయితే పెళ్లైన సంవ త్సరం నుంచి అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధించసాగారు. తల్లిదండ్రులు పలుమార్లు సర్దిచెప్పి కూతురిని కాపురానికి పంపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అదనపు కట్నం కోసం చైతన్యలక్ష్మితో అత్తమామ, భర్త ఘర్షణపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన ఆమె ఊరి చివర పొలంలోని వేపచెట్టుకు తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.


విషయం తెలుసుకొనిన భర్త, అత్తమామలు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కొట్టాలపల్లికి చేరుకుని తమ కూతురి భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధించారని ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి మూడేళ్ల కుమార్తె ఉంది. చైతన్యలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-10-01T09:46:21+05:30 IST