Abn logo
Sep 25 2020 @ 04:32AM

బది‘లీలలు’పై పెదవి విరుపు..!

Kaakateeya

 క్రమబద్ధీకరణకు మౌఖిక ఆదేశాలు

 కసరత్తు చేస్తున్న అధికారులు

 స్పౌజు, స్పెషల్‌ కేటగిరీ వినియోగంపై ఆరా

 మండలాల వారీగా లెక్కలు తీస్తున్న అధికారులు

 డీఎస్సీ నియామకాలతో 

 అన్యాయమంటున్న సీనియర్లు

 బదిలీల షెడ్యూల్‌కు మరో నెల..?


అనంతపురం విద్య, సెప్టెంబరు 24: తమ బదిలీలపై ప్రభుత్వం, విద్యాశాఖ అనుసరిస్తున్న వింత పోకడలపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. జూలైలోనే పూర్తి చేస్తామన్న అధికారులు.. మూడు నెలలైనా  షెడ్యూల్‌ కూ డా ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలకు ముందు డీఎస్సీ-2018 అభ్యర్థుల నియామకాలు చేపట్టడంపై సీనియర్‌ ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నియామకాలు చేపడితే.. దగ్గరి స్థానాల దక్కకుండా తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. బదిలీలు చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నియామకాలకు దిగటంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


క్రమబద్దీకరణకు కసరత్తు

జిల్లా విద్యాశాఖాధికారులు క్రమబద్దీకరణకు కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులుగా అదే పనిలో పడ్డారు. విద్యాశాఖ కమిషనరేట్‌ మౌఖిక ఆదేశాల మేరకు రేషనలైజేషన్‌కు అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డా రు. ఈనెల 23వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలోని సైన్స్‌ సెంటర్‌లో కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఎంత మంది స్పౌజు, స్పెషల్‌ కేటగిరీ ఆప్షన్‌ వినియోగించుకున్నారు? తదితర వివరాలను సేకరిస్తున్నారు.


డీప్యూటీ డీ ఈఓ దేవరాజ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనాథ్‌ ఆధ్వర్యంలో మండలాల వారీగా డేటా తెప్పించుకుంటున్నారు. 2012 నవంబరు 18 నుంచి 2015 నవంబరు 18 మధ్య కాలం లో స్పౌజు, స్పెషల్‌ కేటగిరీ వినియోగంపై ఆరా తీస్తున్నారు. వివరాలివ్వాలంటూ ఎంఈఓలను ఆదేశించారు. ఈనెల 23వ తేదీన 16, 24న 22, 25న 25 మండలాలకు అవకాశం కల్పించారు. ఆశించిన స్థాయిలో మండలాల నుంచి సమాచారం రావట్లేదు. దీంతో మూడు రోజుల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఆలస్యమవుతోంది. మరో రెండు, మూడు రోజులు తీసుకునే అవకాశం ఉంది.


బదిలీల షెడ్యూల్‌కు మరో నెల?

విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ ఇచ్చేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు పే ర్కొంటున్నాయి. అందులో భాగంగా ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖికంగా రేషనలైజేషన్‌కు అవసరమైన సమాచారం సేకరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.


నిబంధనల మేరకు ముందు బదిలీలు, తర్వాత పదోన్నతులు, అనంతరం డీఎస్సీ ద్వారా కొత్త నియామకాలు చేపట్టేవారు. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వెళ్తోందంటూ ఉపాధ్యాయ వర్గాల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. సాకులు చెబుతూ ఉద్దేశపూర్వకంగానే బదిలీల ప్రక్రియను జాప్యం చేస్తోందంటూ.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement