చిరుద్యోగులపై కక్ష సాధింపు

ABN , First Publish Date - 2020-09-24T09:07:08+05:30 IST

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి జంట ఆలయాల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ముగ్గురు నాయీబ్రాహ్మణులపై ‘రాజకీయ రంగు’ పడింది.

చిరుద్యోగులపై కక్ష సాధింపు

బండారు శ్రావణిశ్రీ ర్యాలీలో సన్నాయి వాయించిన ముగ్గురు నాయీబ్రాహ్మణుల సస్పెన్షన్‌ ఫ గూగూడులో రాజకీయంపై గ్రామస్థుల ఆగ్రహం


నార్పల, సెప్టెంబరు 23: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి జంట ఆలయాల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న ముగ్గురు నాయీబ్రాహ్మణులపై ‘రాజకీయ రంగు’ పడింది. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఓ ముగ్గురు చిరుద్యోగు లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈమేరకు బుధవా రం ఆలయ ఈఓ మోహన్‌ రెడ్డి ఆదేశాలు సైతం జారీ చేశారు.


అసలు వివరాల్లోకి వెళ్తే... నాలుగు రోజుల క్రితం శింగనమల టీడీపీ ఇన్‌చార్జ్‌ బండారుశ్రావణిశ్రీ గూగూడు జంట ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఆమె గ్రామంలోకి రాగానే టీడీపీ అనుచరులు పసుపు జెండాలతో ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో దేవదాయశాఖకు చెందిన నాయీబ్రాహ్మణులు  శంకరయ్య, జనార్దన, లక్ష్మయ్యలు సన్నాయి మేళాతాళాలతో ఆ లయం వద్దకు వచ్చారు.


ఏదో పెద్ద తప్పిదమే చేసినట్లు చిరుద్యోగులపై సంబంధిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్‌ చేశారు. ఈ విషయంపై ఆలయ ఈఓ మోహన్‌రెడ్డిని వివరణ కోర గా... తమకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని టీడీపీ జెండాల ముందు బండారు శ్రావణిశ్రీ గ్రామంలోకి వచ్చేటప్పుడు ఈ ముగ్గురు నాయీబ్రాహ్మణులు మేళతాళాలతో రావడం నిబందనలకు విరుద్ధమన్నారు. అందుకే వారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.


అసలే పేదలు.. వారిపై ప్రతాపమా?

కొందరు వైసీపీ నాయకులు కావాలనే పనికట్టుకుని చిరుద్యోగులైన ముగ్గురు నాయీబ్రాహ్మణులను కుట్రపూరితంగా సస్పెండ్‌ చేయించారని గూగూడు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అనేక మంది నాయకులకు నాయీబ్రాహ్మణులు గూగూడు గ్రామంలోకి రాగానే మేళ,సన్నాయి వాయిద్యాలతో స్వాగతించారు. నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ వైసీపీ నాయకుడు వచ్చినప్పుడు కూడా సదరు నాయీ బ్రాహ్మణులు సన్నాయి స్వాగతం పలికారు.


అయితే ఇప్పుడు ఆ చిరుద్యోగులు, పేదరికం అనుభవిస్తున్న వారిని ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేయించేందుకు కొందరు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఏదైనా పొరపాటు చేస్తే మందలించడమో లేక ముందస్తుగా షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయాలే కానీ ఇలా నాయీ బ్రాహ్మణులను సస్పెండ్‌ చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న గూగూడులో రాజకీయాలు సాగిస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-09-24T09:07:08+05:30 IST