మాట వినకుంటే వేటే..!

ABN , First Publish Date - 2021-05-09T06:25:54+05:30 IST

తాము చెప్పినట్టు వినకుంటే ఎంపీడీఓ స్థాయి అధికారినైనా ఇష్టమొచ్చినట్లు ఆడిస్తారు.

మాట వినకుంటే వేటే..!

ఎంపీడీఓలపై రాజకీయ పెత్తనం 

తాడిమర్రి ఎంపీడీఓ కర్నూలుకు..

నేటికీ ఉరవకొండ ఎంపీడీఓకు ప్లేస్‌ శూన్యం

అనంతపురం విద్య, మే 8: తాము చెప్పినట్టు వినకుంటే ఎంపీడీఓ స్థాయి అధికారినైనా ఇష్టమొచ్చినట్లు ఆడిస్తారు. ఏది చెప్పినా... నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా... చేసితీరాల్సిందే. కాదు.. కూడదు అంటే మండలం ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేస్తారు. ఇదీ జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధుల బరితెగింపు. ఇలా ఇప్పటికే ఇద్దరు ఎంపీడీఓలు అధికార పార్టీ నేతల క్షక సాధింపులకు బలయ్యారు. చేతకాకుంటే.. సెలవులు పెట్టి వెళ్లండనీ, తమ వారికే ఇన్‌చార్జ్‌ ఇప్పించుకుని, పనులు చేయించుకుంటామన్నట్లు అధికార పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాడిమర్రిలో గతంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న రమణపై ధర్మవరం నియోజకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తాము చెప్పినట్లే చేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆయన ఎక్కువ కాలం అక్కడ ఉండలేకపోయారు. దీర్ఘకాలిక సెలవులో వెళ్లాలంటూ తీవ్ర ఒత్తిళ్లు తేవడంతో.. ఆయన ఆ మేరకు సెలవులో వెళ్లారు. సుమారు 8 నెలలు ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆఖరుకు ఆయన రాష్ట్ర అధికారులకు లేఖ పెట్టుకోవడంతో జిల్లాను మార్చి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో విధుల్లో చేరారు. ఉరవకొండ, రాప్తాడు నియజకవర్గాల్లోనూ ఇదే సమస్య ఉంది. ఉరవకొండలో గతంలో రెగ్యులర్‌ ఎంపీడీఓగా వెంకటనాయుడు పనిచేస్తుండగా.. ఆయనపై సైతం అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయినా... కొంతకాలం ఆయన నెట్టుకొచ్చారు. తాము చెప్పినట్లు వినాలంటూ బలవంత పెడుతూ వచ్చారు. దీంతో ఆయన సెలవు పెట్టారు. 7 మాసాలుగా ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీని వెనుక అధికార వైసీపీ నేతల ఒత్తిళ్లే అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓగా దామోదర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఈయన ఈఓఆర్డీ. ఇక్కడ పనిచేస్తున్న రెగ్యులర్‌ ఎంపీడీఓ వెంకటనాయుడుపై కక్ష సాధింపుగా పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని, ఇదెక్కడి తీరు అంటూ జడ్పీ అధికారులు, ఎంపీడీఓలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ నుంచి బొమ్మనహాళ్‌కు తర్వాత శెట్టూరును నియమించారు. ఆ తర్వాత సైతం ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా ఏడు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో కనగానపల్లి ఎంపీడీఓగా పనిచేసిన ఓ మహిళా ఎంపీడీఓపై సైతం స్థానిక నాయకుల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ఆమె ఇటీవల ఎన్నికల ముందు దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు సమాచారం. ఇలా రోజురోజుకీ జిల్లాలో ఎంపీడీఓలపై అధికార పార్టీ నాయకులు కక్ష సాఽధింపుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-05-09T06:25:54+05:30 IST