రైతు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2021-08-01T06:54:12+05:30 IST

జిల్లా రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఆదేశించారు.

రైతు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ, పాల్గొన్న ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు

వ్యవసాయ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి..: మంత్రి శంకరనారాయణ 

అనంతపురం వ్యవసాయం, జూలై 31: జిల్లా రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. శనివారం స్థానిక జడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశపు హాల్‌లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలన్నారు. రైతు  భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలోనే రైతుల సమస్యలు రికార్డు చేసి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. విత్తన సేకరణలో అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌, బీమా మంజూరులో రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం పూర్తి అవగాహనతో పనిచేయాలన్నారు. ప్రతి రైతు ఉచిత పంటల బీమాలో పేర్లు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు అవసరమైన పనులు చేసేలా ఉపాధి అధికారులను సంప్రదించి ముందుకు వెళ్లాలన్నారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతోపాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. ప్రత్యామ్నాయ విత్తనాలను సబ్సిడీతో పంపిణీ చేసేలా వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ సలహా మండలి చైర్‌పర్సన్‌ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ-క్రాప్‌ బుకింగ్‌పై అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేసి, రైతుల అభివృద్దికి తోడ్పాటు అందించాలన్నారు. జిల్లాలో పండ్లతోటల పెంపకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ రైతుల కోసమే ప్రభుత్వం వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, మండల, జిల్లా స్థాయిల్లో ప్రతినెలా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరుగుతాయన్నారు. ఆయా సమావేశాల్లో తీర్మానించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినా కదిరి ప్రాంతంలో ఇప్పటి దాకా 30 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయన్నారు. గతేడాది వర్షాలు బాగా పడినా దిగుబడి రాలేదనీ, రైతులకు బీమా రాలేదన్నారు. దిగుబడిని ప్రమాణికంగా తీసుకొని బీమా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ మడకశిర, అమరాపురం ప్రాంతాల్లో ఆకు, వక్క తోటలు నీరులేక ఎండిపోతున్నాయన్నారు. ఆకు, వక్క తోటల విస్తరణకు ప్రభుత్వం తరపున తగిన సహాయం అందించేలా చూడాలన్నారు. అనంతరం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తయారు చేసిన అగ్రి టెక్‌ ఏటీపీ యాప్‌ను మంత్రి, ఎంపీ, కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, జేసీ నిశాంత్‌కుమార్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్‌ లిఖిత, ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ, సీపీఓ ప్రేమ్‌చంద్ర, సెరికల్చర్‌ జేడీ పద్మమ్మ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ వరకుమార్‌, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T06:54:12+05:30 IST