ఎవరు చెప్పారని.. ఈ అన్యాయం..?

ABN , First Publish Date - 2021-06-19T06:54:07+05:30 IST

అయ్యా ! ఎస్పీ గారు కాస్త ఆలోచించండి.....

ఎవరు చెప్పారని..  ఈ అన్యాయం..?

  • ఆదివారాల్లో పూర్తి కర్ఫ్యూపై చిరు వ్యాపారుల్లో ఆందోళన
  • ప్రభుత్వ సడలింపుల్లోనూ స్థానికంగా ఆంక్షలే !
  • ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయ్‌... 
  • మద్యం దుకాణాలు తెరుస్తున్నారు
  • అయినా వారాంతంలో సంపూర్ణ కర్ఫ్యూ
  • జిల్లాలోని చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం
  • ఎస్పీ గారూ...! ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన


అనంతపురం : 

అయ్యా !

ఎస్పీ గారు కాస్త ఆలోచించండి.

మేమంతా చిరు వ్యాపారులం. 

చిన్న పనులు చేసుకు బతికే బడుగు జీవులం.

గతేడాది నుంచి కరోనా మహమ్మారి దెబ్బకు బలవుతున్న పేదలం.

ఏరోజుకారోజు పని చేస్తేనే మా పిల్లాపాపల కడుపునిండేది. 

కరోనా కంటే ముందు ఉన్నంతలో హాయిగానే జీవించేవాళ్లం.

కరోనా మహమ్మారి మా బతుకుల్లో బండ వేసింది.

వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించింది. 

వాటిని మీ పోలీసు శాఖ పకడ్బందీగా అమలు చేస్తోంది. 

ఇలాంటి పరిస్థితుల్లో మా జీవనం దినదినగండంగా మారింది. 

ఉన్న ఉపాధి పోయింది. మా బతుకే కర్ఫ్యూ అయ్యింది.

కొద్ది కాలమే కదా అనుకున్నాం.

ఇంట్లో కష్టపడి దాచుకున్న పైసాసైసాతో కొద్దికాలం నెట్టుకొచ్చాం.

చాలకుంటే ఇంట్లో ఉన్న వస్తువులను సైతం తాకట్టు పెట్టేశాం. 

ఓ వైపేమో ఆర్టీసీ బస్సులు అన్ని రోజుల్లోనూ తిరుగుతున్నాయి. 

మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. 

ఆంక్షలు మాత్రం మాలాంటి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకేనా? 

కొందరు వ్యాపార సంఘాల పేరుతో తీసుకున్న నిర్ణయాల వల్ల మా జీవితాలు బలవుతున్నాయి.

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోయినా ఆదివారాల్లో పూర్తిగా కర్ఫ్యూ అమలుజేస్తున్నారు. ఉపాధి కోల్పోయి పస్తులుండాల్సిన స్థితిని అనుభవిస్తున్నాం. 


మామూలు రోజుల్లో కూడా ప్రభుత్వం 12 గంటల వరకూ వెసులుబాటిస్తే... పోలీసులు 11.30 గంటలకే బంద్‌ చేయిస్తున్నారు. ఆతర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపిస్తే... ఒంటి గంట నుంచే పోలీసు సైరన్‌ మోగిస్తూ షాపులతో పాటు రోడ్లపై ఏ ఒక్క వ్యాపారాల్లేకుండా బంద్‌ చేయిస్తున్నారు.  ఆదివారం బంద్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించలేదు. కలెక్టర్‌ చెప్పలేదు. ఎస్పీ అంతకంటే చెప్పలేదు. ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారు... కిందిస్థాయి పోలీసులు అమలు చేస్తున్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయాలకు కొత్తిమీర, అల్లం అమ్ముకునేవాడికి ఏమిటి సంబంధం. ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు సడలిస్తోంది. అయితే స్థానికంగా కొందరి అత్యుత్సాహం వల్ల అనధికారికంగా ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ పూర్తి కర్ఫ్యూ ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఇతర జిల్లాల్లో లేని ఆంక్షలు ఇక్కడెందుకు అమలు చేస్తున్నారో.. ఇదెక్కడి న్యాయమో మీరే ఆలోచించాలి. మరో 24 గంటలు గడిస్తే ఆదివారం. ఆ రోజు బంద్‌ చేయిస్తారో ఏమో... ఇలా వారంలో ఒక రోజు బంద్‌ చేయిస్తే ఆ రోజు మా లాంటి ప్రజలకు ఉపాధి లేనట్లే. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. 


ఇది జిల్లాలోని ఆటోలు నడిపే డ్రైవర్లు, బండిమీద టిఫిన్‌ పెట్టుకుని అమ్మేవాళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు, మెస్సులు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఐస్‌క్రీమ్‌ బండ్లు, మిక్చర్‌ బండ్లు, బొరుగులు, టీ కేఫ్‌లు, పానీపూరీ, జొన్నరొట్టెలు, కర్రీస్‌, జూస్‌, చెరుకురసం, ఫ్రూట్‌సలాడ్‌, బజ్జీలు, కాయగూరల వ్యాపారాలతో పొట్టపోసుకునే చిరువ్యాపారుల ఆవేదన. కరోనా ఆపత్కాలంలో ఉపాధి లేక పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు పూటగడవని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. బతుకులు భారంగా మారాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఏరోజుకారోజు పని దొరికితేనే పూట గడిచేది.  ఈనేపథ్యంలో కొన్ని సంఘాలు తీసుకుంటున్న నిర్ణయాలను పోలీసులు ఉత్సాహంగా అమలు చేస్తుండటంతో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు పూటగడవక అల్లాడిపోతున్నారు. ఎలాంటి ఆదేశాలు లేకపోయినా వారాంతాలు పూర్తిగా 24 గంటలు, 48 గంటల పేరుతో కర్ఫ్యూ విధిస్తుండటంతో వారు కర్ఫ్యూ అంటేనే వణికిపోతున్నారు. ఈ వారం నుంచైనా వారంతంలో పూర్తి కర్ఫ్యూలేకుండా చూడాలని వారు జిల్లా పోలీసు అధికారిని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-06-19T06:54:07+05:30 IST