నీరున్నా.. ఎత్తిపోయరేం..?

ABN , First Publish Date - 2021-07-24T06:27:19+05:30 IST

శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది.

నీరున్నా.. ఎత్తిపోయరేం..?
హంద్రీనీవా కాలువలో ఆగిన నీటి ప్రవాహం,

హంద్రీనీవాకు పంపింగ్‌ ఎప్పుడో?

శ్రీశైలం జలాశయంలో 

నీటిమట్టం దాటినా ప్రారంభంకాని ఎత్తిపోతలు

తెలంగాణ ధోరణితో వేచిచూస్తున్న ఏపీ అధికారులు

గుంతకల్లు, జూలై 23: శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో భారీగా వచ్చి చేరుతోంది. నీటి మట్టం కూడా శరవేగంగా పెరుగుతోంది. మల్యాల వద్ద హంద్రీనీవా కాలువలోకి నీటి పంపింగ్‌కు పుష్కలంగా అందుతోంది. అయినా.. అధికారులు నీరు ఎత్తిపోయట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధోరణితో వేచిచూస్తున్నారు. దీంతో ఇక కాలువ ద్వారా నీరు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతకు నిరాశ తప్పడంలేదు. అధికారులు, పాలకుల వైఖరిపై అనంత వాసి విస్మయం వ్యక్తం చేస్తున్నాడు.

       శ్రీశైలం జలాశయంలోకి చాలినంత నీరు చేరినా హంద్రీనీవాకు పంపింగ్‌ను అధికారులు ప్రారంభించలేకపోతున్నారు. డ్యాంలో 835 అడుగుల నీటి మట్టం దాటితే మల్యాల వద్ద గతంలో పంపింగ్‌ను ప్రారంభించేవారు. ఈసారి ఆ లెవెల్‌ ఐదు రోజుల కిందటే దాటినా.. హంద్రీనీవాలోకి ఎత్తిపోతలను చేపట్టడానికి ఇంజనీరింగ్‌ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కృష్ణాజలాల విషయంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రగులుతున్న వివాదం కారణంగా అధికారులు వేచిచూసే ధోరణి కనబరుస్తున్నారు. ఎత్తిపోతలు ఆలస్యమైతే కాలువలో నీటి పారుదల లక్ష్యాన్ని అందుకోవడం గగనమే. ఇది జిల్లా ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. తెలంగాణ రాష్ట్రంతో నీటి వివాదం ఇలాగే కొనసాగితే ఈ సీజన్‌లో ఏప్రిల్‌ వరకూ నీటిని తోడుకునే అవకాశాలు చేజారే ప్రమాదం లేకపోలేదు.


పంపింగ్‌ చేయకపోవడం తొలిసారి

శ్రీశైలం డ్యాంలో మల్యాల పంపులకు నీరు అందినా ఎత్తిపోతలు ప్రారంభం కాకపోవడం ఇదే తొలిసారి. హంద్రీనీవా కాలువ ప్రారంభమైనప్పటి నుంచి ఎనిమిదేళ్లలో డ్యాంలో 835 అడుగుల నీటిమట్టం దాటిన మరుక్షణం హంద్రీనీవాకు నీటి లిఫ్టింగ్‌ ప్రారంభించేవారు. హంద్రీనీవాకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలన్న విషయంగా తేదీలతో నిమిత్తం లేకుండా, పంపులకు నీరు చేరిన వెంటనే తోడటం మొదలెట్టేవారు. కాంగ్రెస్‌ హయాంలో ట్రయల్‌ రన్‌ తర్వాత ఒకసారి, టీడీపీ హయాంలో ఐదేళ్లు, వైసీపీ పాలనలో రెండు సంవత్సరాలు డ్యాంలో 835 అడుగులకు నీరు చేరిన వెంటనే హంద్రీనీవాకు నీటి పంపింగ్‌ మొదలుపెట్టారు. ప్రస్తుతం డ్యాంలో తగినంత నీరు నిల్వ ఉన్నా పంపింగ్‌ చేయకపోవడం శోచనీయం. వర్షాకాలం ప్రారంభమైనా జూలై మొదటి, రెండు వారాలలో సరైన వర్షాలు లేక డ్యాంకి ఇన్‌ఫ్లో తగినంతగా రాక నీటి నిల్వలు పెరగలేదు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాంలోకి ప్రస్తుతం భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో నాలుగు రోజుల కిందటే డ్యాంలో 77 టీఎంసీలు చేరి, నీటి మట్టం 835 అడుగుల మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. దీంతో మల్యాల పంపుహౌస్‌ వద్ద మోటార్ల వద్దకు నీరు చేరింది. ప్రస్తుతం 77 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అవసరమైనదానికన్నా ఎక్కువగా నీరున్నా హంద్రీనీవాకు పంపింగ్‌ను ప్రారంభించలేదు.


విద్యుదుత్పత్తితో సమస్య

హంద్రీనీవా ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో మెదలకుండా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరం ఉన్నట్టుంది సాగునీటి ప్రాజెక్టులపై పడింది. ఏపీ అవసరాలతో నిమిత్తం లేకుండా విద్యుదుత్పత్తికి నీటిని వాడుకుంటుండటంతో సమస్య ఏర్పడింది. ఈ నెలలో వానలు సక్రమంగా కురవకపోవడంతో డ్యాంలో ఇన్‌ఫ్లో లేక నీటి నిల్వలు పెరగలేదు. ఓవైపు తక్కువ మోతాదులో ఇన్‌ఫ్లో ఉండటం, తెలంగాణ రాష్ట్రం పోలీసు పహారాలో విద్యుదుత్పత్తి చేపట్టడంతో ఈనెల 17వ తేదీ వరకూ డ్యాంలో నీటిమట్టం పెరగకపోగా.. తగ్గింది. తెలంగాణకు 150 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ఐదు విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. డ్యాంలో 805 అడుగుల కనిష్ట నీటిమట్టం స్థాయి వరకూ తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ డ్యాంలో 808 అడుగులను దాటకుండా కరెంటు జనరేషన్‌ కోసం నీటిని వినియోగిస్తూ వచ్చింది. డ్యాంలో ఇన్‌ఫ్లో తగ్గిపోవడానికి తోడు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కృష్ణా నీటి వినియోగంపై వివాదాలు తోడవడంతో హంద్రీనీవా నీటి పారుదల విషయంగా సమస్య తలెత్తింది. డ్యాంలోకి నీరు వస్తున్నా ఆ నీటికి మించి తెలంగాణ రాష్ట్రం డ్రా చేసింది. ఇక ఎక్కువ వాడుకుంటే డ్రాడౌన్‌ పాయింట్‌ కంటే దిగువకు నీటిమట్టం పడిపోతుందన్న కారణంగా గత వారంలో తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తిని కాస్త తగ్గించింది. ఈ క్రమంలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డ్యాంలో నీటి మట్టం పెరిగింది.


నీటి మట్టం పెరిగినా..

ఐదు రోజులుగా వరదనీటి ప్రవాహం డ్యాంలోకి పెద్ద మోతాదులో వస్తుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో చేరుతోంది. దీంతో హంద్రీనీవా అధికారులు ఎదురుచూస్తున్న విధంగా డ్యాంలో నీటిమట్టం పెరిగి, 835 అడుగుల స్థాయిని ఎప్పుడో దాటేసింది. అయినా అధికారులు ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం మళ్లీ అన్ని విద్యుత్‌ ప్లాంట్లను ప్రారంభించి, అధిక మోతాదులో నీటిని వినియోగిస్తే, డ్యాంలో ఇన్‌ఫ్లో సరిగా చేరకపోతే ఎత్తిపోతలను నిలిపివేయాల్సి వస్తుందన్న సంశయం ఏర్పడింది. ఈ కారణంగా డ్యాం లోకి నీటినిల్వలు పుష్కలంగా చేరినా హంద్రీనీవాకు ఎత్తిపోతలను ప్రారంభించడానికి అధికారులు సాహసించలేకపోతున్నారు.


40 టీఎంసీలైనా దక్కేనా?

హంద్రీనీవా రెండు దశల కాలువకు లక్ష్యంగా ఉన్న 40 టీఎంసీల నీరు గడిచిన రెండు సంవత్సరాల్లో లభించింది. గతేడాది భారీ వర్షాలు కురవడంతో జూలై 23వ తేదీన మల్యాల వద్ద ఎత్తిపోతలను ప్రారంభించారు. ఈ సంవత్సరం మార్చి 27వ తేదీ వరకూ మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి, ఆ తర్వాత ఏప్రిల్‌ 10వ తేదీ వరకూ ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీరిచ్చారు. 40 టీఎంసీలను దాటి నీటిని పంప్‌ చేశారు. ఇదే అత్యంత గరిష్టంగా నీరు పారిన రికార్డుగా హంద్రనీవాకు ఉంది. 2019 సీజన్‌లోనూ దాదాపు 40 టీఎంసీల నీటిని పారించారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వ ధోరణి కారణంగా ఆ మేరకు నీరు లభిస్తుందా? అన్న సంశయం నెలకొంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాల కారణంగా ఏప్రిల్‌ వరకూ నీరు లభిస్తుందన్న నమ్మకం లేకుండాపోయింది. ఈ కారణంగా హంద్రీనీవాకు లక్ష్యంగా ఉన్న 40 టీఎంసీల నీరు ఈ సంవత్సరం లభిస్తుందా అన్న మీమాంస ఇంజనీరింగ్‌ అధికారుల్లో నెలకొంది. ఏపీ, తెలంగాణకు 66ః34 నిష్పత్తిన నీటిని వినియోగించుకునే సంప్రదాయాన్ని తోసిరాజని 50ః50 రేషియో పద్ధతిని అవలంబించాలని తెలంగాణ నిర్ణయించడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి, విద్యుదుత్పాదనకు నీటిని వినియోగిస్తూ పోతే వరదనీటి వినియోగంపై ఆధారపడ్డ హంద్రీనీవా పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. వీలైనంత త్వరగా ఈ అనిశ్చిత పరిస్థితి తొలగిపోతే తప్పా.. హంద్రీనీవా భవితవ్యం ఏమిటో తేలదు.

Updated Date - 2021-07-24T06:27:19+05:30 IST