రెండేళ్లయినా సాగుకు నీరేదీ..?

ABN , First Publish Date - 2021-07-23T06:53:43+05:30 IST

హంద్రీనీవా కాలువ పనులను టీడీపీ హయాంలో శరవేగంగా చేస్తుంటే.. అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలు అర్థంలేని విమర్శలు చేశారు.

రెండేళ్లయినా సాగుకు నీరేదీ..?
పిల్లకాలువలో పెరిగిపోయిన ముళ్ల కంపలు

పాలకుల్లారా..ఆయ‘కట్టు కథే’నా..? 

రెండేళ్లయినా సాగుకు నీరేదీ..?

టీడీపీ హయాంలో హంద్రీనీవా 

పనులపై వైసీపీ అర్థంలేని విమర్శలు

శరవేగంగా సాగుతున్నా.. డిస్ట్రిబ్యూటరీలు, 

పిల్లకాలువలు ఎక్కడంటూ ఎద్దేవా..

చెరువులు నిండుతుంటే.. 

చేనుకు చేరలేదంటూ వ్యాఖ్యానాలు..

 వైసీపీ రెండేళ్ల పాలనలో చేసిందేమిటో?

 ఒక్క డిస్ట్రిబ్యూటరీ కట్టింది లేదు..

ఎకరా ఆయకట్టుకు నీరిచ్చింది లేదు..

పూడిపోతున్న పిల్ల కాలువలు

ప్రధాన కాలువ నిర్వహణ 

అంతంతమాత్రమే


హంద్రీనీవా కాలువ పనులను టీడీపీ హయాంలో శరవేగంగా చేస్తుంటే.. అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలు అర్థంలేని విమర్శలు చేశారు. లక్ష్యాలు నిర్ధేశించుకుని, నీటిని తీసుకొస్తుంటే.. డొంకతిరుగుడుగా మాట్లాడారు. చెరువులు నింపుతుంటే.. డిస్ట్రిబ్యూటరీలు ఎక్కడ కట్టారు? పిల్లకాలువలు ఎక్కడ తవ్వారు? పొలాలకు చుక్కనీరు కూడా ఇవ్వలేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల నిర్మాణం పూర్తిచేసి, మొత్తం ఆయకట్టుకు నీరిస్తామంటూ బీరాలు పలికారు. ఆ తర్వాత ఎన్నికలొచ్చాయి. వైసీపీ అధికారం కూడా చేపట్టింది. ఆ తర్వాత రెండేళ్లు గడిచిపోయాయి. మరి చేసిందేమిటి? సాధించిందేమిటి? హంద్రీనీవా కాలువకు డిస్ట్రిబ్యూటరీలు ఎక్కడ కట్టారో, ఎన్ని కట్టారో వైసీపీ నేతలే చెప్పాలి. రెండేళ్లలో ఒక్క డిస్ట్రిబ్యూటరీ కూడా కట్టలేకపోయారు. కాలువ వెడల్పు పనులను అటకెక్కించారు. మరమ్మతులను మరిచారు. వైసీపీ పాలన పుణ్యమాని టీడీపీ హయాంలో తవ్విన పిల్ల కాలువలు పూడిపోతున్నాయి. కొన్ని పూడిపోయాయి కూడా. రెండేళ్ల పాలనలో ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కట్టారో... టీడీపీ పాలనపై పనికట్టుకుని విమర్శలు గుప్పించిన నేతలే సెలవియ్యాలి. ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న వైసీపీ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో ఒక్క డిస్ట్రిబ్యూటరీ అయినా కడుతుందో.. లేదోనంటూ ఆయకట్టు రైతులు వాపోతున్నారు.


గుంతకల్లు, జూలై22: హంద్రీనీవా ప్రధాన కాలువ నిర్మాణం పూర్తయి, ఎనిమిదేళ్లు గడుస్తున్నా తొలిదశ డిస్ట్రిబ్యూటరీల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీటి మోక్షం కలగడంలేదు. ప్రధాన కాలువ పూర్తయినా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం ముగియకపోవడం గమనార్హం. దీంతో అనుబంధంగా ఉన్న పిల్లకాలువలకు నీరందక పూడిపోతున్నాయి. కంపచెట్లు పెరిగిపోయి, అసలు అక్కడ కాలువలు ఉన్నాయా? అన్న సందేహం కలిగేలా అధ్వానంగా మారాయి. పిల్లకాలువలకు సంబంధించిన భూమికి రైతులకు పరిహారాలు చెల్లించిన ప్రభుత్వం వాటిలో నీటిని పారించడంపై శ్రద్ధ చూపడంలేదు. డిస్ట్రిబ్యూటరీల్లో మోటార్లు వేసుకుని, నీటిని పంపింగ్‌ చేసుకుని, కొందరు రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. అంతే తప్పా.. జలవనరుల శాఖ మాత్రం ఒక్క ఎకరాకూ సాగు నీరివ్వలేకపోతోంది. దీనికితోడు హంద్రీనీవా కాలువ నిర్వహణాలోపం కారణంగా దెబ్బతింటోంది. కాలువకు నీరు విడుదలైంది మొదలు ఒక్కసారి మాత్రమే పూడికతీత పనులు చేపట్టారు. ఏటా నీరు పారడం కారణంగా మట్టికట్టలు కరిగిపోయి, కాలువలో పూడిక పెరుగుతోంది. వర్షాలకు గట్లు కోతకు గురై, మట్టి కాలువలోకి చేరుతోంది. నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా గట్లపై కంపచెట్లు పెరిగిపోతున్నాయి. కనీసం హంద్రీనీవాకు నీటి విడుదలకు ముందు కూడా మరమ్మతులు చేపట్టడంలేదు. దీంతో కాలువకు గండ్లు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలోనూ పలుమార్లు కాలువకు గండ్లు పడ్డాయి.



డిస్ట్రిబ్యూటరీలకు నీరేదీ?

హంద్రీనీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టును కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల పరిధిలో 6.02 ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టారు. పనులకు 2004లో నిధులను కేటాయించారు. ఎనిమిదేళ్లపాటు చేపట్టారు. పనులు పూర్తికాకున్నా నీరు పారేవిధంగా అడ్డంకులను తొలగిస్తూ నీటి ఎత్తిపోతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రధాన కాలువ పనులను టీడీపీ హయాంలో ముగించారు. డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయారు. 2012లో కాలువకు నీటిని తొలిసారిగా ట్రయల్‌ రన్‌ నిర్వహించి, తొలిదశ కాలువలో చివరన ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పారించారు. తర్వాత మిగతా పనులను టీడీపీ హయాంలో పూర్తి చేశారు. మల్యాల నుంచి కర్నూలు జిల్లాలోని మద్దికెర వరకూ 144 కి.మీ.ల మేర కాలువలో పలుచోట్ల డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తికాలేదు. 23 నుంచి 29వ ప్యాకేజీ వరకూ డిస్ట్రిట్యూటరీల్లో 79,885 (దాదాపు 80 వేల) ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 33వ ప్యాకేజీ కింద 20,900 ఎకరాలకు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలకు, 36వ ప్యాకేజీలో 80,600 ఎకరాలకు కలిపి 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉంది. ఇవేవీ జరగలేదు. రైతులు శక్తి సామర్థ్యాలను బట్టి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల్లో కొంతమేరకు నీరు ప్రవహించిన చోట్లలో మోటార్లను బిగించుకుని, పొలాల వరకూ పైపులైను వేసుకుని నీటిని వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పిల్ల కాలువల్లో నీరు పారని కారణంగా అవి కాస్తా పూడిపోతున్నాయి. కంపచెట్లు పెరిగిపోతున్నాయి. ఓంరే సంస్థ 33, 36 ప్యాకేజీల్లో పనులను చేపట్టడంలో విఫలమవడంతో ఆయకట్టును అభివృద్ధి చేయలేకపోయారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కనీసం ఆ ప్రయత్నమే చేయలేదు. ప్రభుత్వం తలచుకుంటే ఒక్క సీజన్‌లోనే పనులను పూర్తిచేసి, ఆయకట్టును అభివృద్ధి చేయవచ్చని ఆయకట్టుదారులు పేర్కొంటున్నారు.



బలహీనపడ్డ మట్టి కట్టలు

హంద్రీనీవా కాలువ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ మరమ్మతు పనులు జరక్కపోవడంతో మట్టికట్టలు పలుచోట్ల బలహీనపడ్డాయి. కాలువలో నీరు భూమికి సమాంతరంగా ప్రవహించే పలు ప్రదేశాల్లో మట్టి కట్టలను నిర్మించారు. సమాంతర భూమి నుంచి పది అడుగుల ఎత్తుదాకా పలుచోట్ల కాలువ గట్లు ఏర్పాటయ్యాయి. అక్విడెక్టులు ఉన్నచోట 20 అడుగుల ఎత్తుదాకా మట్టికట్టలను నిర్మించారు. తొలిదశ కాలువలో గుంతకల్లు మండలంలోని కసాపురం శివారులోనూ, జీ కొట్టాల వద్ద, వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం, రాగులపాడు 8వ పంప్‌ హౌస్‌, పీసీ ప్యాపిలి తండా వద్ద మట్టికట్టలను నిర్మించారు. కాలువకు నీటిని వదిలిన ప్రతిసారీ ఈ మట్టికట్టలు దెబ్బతింటున్నాయి. జీ కొట్టాల వద్ద నాలుగేళ్ల కింద కాలువకు నీరు నిండుగా ప్రవహించే సమయంలో రెండు వైపులా ఉన్న కట్టల మట్టి నీటిలోకి జారిపోయింది. అప్పటికప్పుడు అక్కడ మట్టిపోసి, గండి పడకుండా కాపాడారు. అంతేతప్పా.. తర్వాత మరమ్మతులు చేపట్టలేదు. ఈ ప్రదేశంలో రెండు గట్ల మట్టి కాలువలోకి జారిపోయి, కెనాల్‌ వెడల్పుగా మారి, కట్టలు బలహీనపడ్డాయి.



పొంచి వున్న గండ్ల ప్రమాదం

కాలువ మట్టి జారిపోయిన చోట్ల గండ్లు పడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కసాపురం-జీ కొట్టాల గ్రామాల మధ్య ఆలూరు రహదారి సమీపాన గతంలో రెండుసార్లు గండ్లు ఏర్పడ్డాయి. ఛాయాపురం వద్ద వర్షాలకు ఇన్‌లెట్ల నుంచి భారీగా వర్షపునీరు కాలువలోకి ప్రవేశించగా కెనాల్‌ కోతలకు గురైంది. బుగ్గ సంగాల గ్రామం వద్ద నుంచి రాగులపాడు పంపు హౌస్‌ వరకూ పలుచోట్ల వర్షాలకు కాలువ గట్లు కోతకు గురయ్యాయి. జీప్‌ ట్రాక్‌ కూడా దెబ్బతింది. ఆయా ప్రదేశాల్లో మట్టి పనులు చేపట్టి, గట్లను పటిష్ట పరచాల్సిన అవసరముంది. మొదటి దశ కాలువ వెడల్పు పనుల కారణంగా మరమ్మతులు చేయడంలేదు. ఎలాగూ కాలువ వెడల్పు పనుల్లో పూడికను తొలగించడం, ఒక గట్టును పక్కకు జరిపి వెడల్పు చేయాల్సి ఉన్న కారణంగా అధికారులు, ప్రభుత్వం కాలువ మరమ్మతులు, పూడిక తీతపై నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం గట్లపై భారీగా పెరిగిపోయిన కంపలను సైతం తొలగించడంలేదు. దీంతో కాలువపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. కాలువలో పాక్షికంగా కొన్నిచోట్ల మాత్రమే కంపలను తొలగించారు. నీరు వదలడానికి మరెంతో సమయం లేనందున దీనిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.




పిల్లకాలువల్లో చెట్లు మొలిచాయి

నాకు కాలువ కింద 40 ఎకరాల ఆయకట్టు ఉంది. పొలాలకు మాత్రం నీరు అందడంలేదు. డిస్ట్రిబ్యూటరీ నుంచి పైపులైన్‌ వేసుకుని, మోటారుతో నీటిని తెచ్చుకుంటున్నా. డిస్ట్రిబ్యూటరీ నుంచి పొలాల్లో నిర్మించిన పిల్ల కాలువల్లో నీరు పారని కారణంగా పూడిపోతున్నాయి. కంపచెట్లు మొలిచి, పెరిగిపోయాయి. అవతలకు వెళ్లడానికి కాస్త దారి ఏర్పాటు చేసుకుని, అలాగే వదిలేశాం. నీరుపారుతుంటే రైతులే కాలువలను సక్రమంగా ఉంచుకునేవారు. 

-  రాజమ్మగారి లక్ష్మన్న, రైతు, గడేహోతూరు


నీరివ్వకుంటే ఎలా?

కాలువ కింద నాకు ఆరెకరాల భూమి ఉంది. పిల్ల కాలువ ఉన్నా పూడిపోయింది. నీరు తెచ్చుకోవడానికి ఎంతో ఖర్చవుతోంది. అయకట్టుకు సాగునీరివ్వకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయకట్టుకు సాగునీరివ్వాలి.

- తలారి మునెప్ప, రైతు, గడేహోతూరు


ఏళ్లు గడుస్తున్నా..

నాకున్న ఐదెకరాల పొలం హంద్రీనీవా ఆయకట్టు కింద ఉంది. ఏళ్లు గడుస్తున్నా నీరు ఇవ్వలేదు. పైపులైన్ల నిర్వహణ, మోటార్ల కోసం ఎంతో ఖర్చవుతోంది. ప్రభుత్వం, అధికారులు వీలైనంత త్వరగా ఆయకట్టుకు సాగు నీరివ్వాలి.   

- బసినేపల్లి చలపతి, గడేహోతూరు

Updated Date - 2021-07-23T06:53:43+05:30 IST